కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి28 : నకిలీ వాహన బీమా పత్రాలను సృష్టిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఒక ముఠా పోలీసులకు చిక్కి కటకటపాలైన ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి మృణాల్కుమార్ ఫిబ్రవరి 27న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో కొందరు వ్యక్తులు పలు ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల పేరుతో నకిలీ వాహన బీమా పత్రాలను తయారు చేస్తూ జీడిమెట్లలోని ఎన్ఎల్బీ నగర్ పరిసరాల్లో విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రత్యేక బృందంగా ఏర్పడి దాడులు చేపట్టారు. ఈ దాడిలో రాగుల రవి, శివకుమార్, ఎస్.కుర్తి మాణిక్యరావు, కొత్త బాబురావు, రాగుల మహేశ్, తడకల గిరిధర్గౌడ్, మోర నరసింహ, కందుమ్గారి నాగరాజు, జెర్సుల కిషన్లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. త్వరగా ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవాలనే వాహనదారులను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంది. అలాంటి వారి వద్ద నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ వారికి నకిలీ బీమాపత్రాలను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది.
నిందితుల స్థావరాలపై జరిపిన సోదాలో నకిలీ వాహన బీమా పత్రాలు, వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన ఫోర్జరీ స్టాంపులు, పత్రాల తయారీకి ఉపయోగించే కంప్యూటర్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించారు. కాగా నకిలీ ఇన్సూరెన్స్ వల్ల ప్రమాద సమయాల్లో క్లెయిమ్ రాకపోవడమే కాకుండా, వాహనదారులు చట్టపరమైన చిక్కుల్లో పడతారని, పాలసీ తీసుకునే ముందు అధికారిక వెబ్సైట్లలో తప్పనిసరిగా సరి చూసుకోవాలని పోలీసులు సూచించారు.