మహబూబ్‌నగర్, అక్టోబర్ 20 : ప్రజల రక్షణ కోసం ప్రాణాలను లెక్కచేయకుండా శాంతి భద్రతలను కాపాడాలన్నా.. అసాంఘిక శక్తుల ఆట కట్టించాలన్నా.. మొదటి వరుసలో ఉండేవాడు పోలీసు. విధి నిర్వహణలో ప్రాణాలు లెక్కచేయక పోరాడి ప్రాణా లు వదిలిన వీరులకు వందనం, అభివందనం. 1959 అక్టోబరు 21న జమ్మూకాశ్మీర్ లేహ్ ప్రాంతంలో మైనస్ 35 డిగ్రీల కనిష్ఠ ఉష్ణ్ణోగ్రత నమోదైంది. మనషులు గడ్డకట్టే ఆ చలిలో సైతం భారత జవాన్లు సరిహద్దు గస్తీలో ఉన్నారు. అంతలో చైనా సైనికులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ భీకర దా డిలో భారత జవాన్లు 11 మంది దుర్మరణం చెం దారు. కొంతమంది చైనా సరిహద్దులో మృతిచెందగా, మరికొంత మంది అసువులు బాశారు. మృతదేహాలను సైతం సొంత ప్రాంతానికి తీసుకురాలేని పరిస్థితి. భారత ప్రభుత్వం మృతదేహాలను అక్కడే ఖననం చేయాలని నిర్ణయించింది. కుటుంబ సభ్యు లు తమ వారిని కడసారి కూడా చూసుకోలేకపోయారు. ఆ సైనికుల ఆత్మకు శాంతికలగాలని ప్రతి ఏడాది అక్టోబర్ 21న అమరవీరుల సంస్మరణ ది నోత్సవం జరుపుకొంటున్నారు. లేహ్ ప్రాంతంలో అమరవీరుల సంస్మరణ స్తూపం నిర్మించారు.
జిల్లాలో మావోయిస్టు తూటాలకు ఇంతవరకు 39 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. వారి వీరత్వాన్ని గుర్తుచేస్తూ ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరువీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరం, ఓపెన్ హౌజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 39 మంది పోలీసులు అమరులయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోనే 30 మంది తూ టాలకు, ల్యాండ్మైన్లకు బలవగా, మరో ఇద్దరు జి ల్లా నుంచి విడిపోయిన సైబరాబాద్ పరిధిలోకి వెళ్లారు. ఎస్పీ పరదేశినాయుడు సంఘవిద్రోహుల చేతిలో చనిపోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోమశిల వద్ద పరదేశినాయుడు తమ సిబ్బందితో కలిసి వెళ్తున్న సమయంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో ఎస్పీతో పాటు ఇద్దరు ఎస్సైలు కిశోర్ కుమార్, శివ ప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్ రంగారెడ్డి, కానిస్టేబుళ్లు సుభాన్, జహబ్ ఇక్బాల్, జయరాం, వైవీఎస్ ప్రసాద్ అక్కడిక్కడే మృతిచెందారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల్లో సోమవారం ఉదయం 8:45 గంటలకు పోలీసు అమరులకు నివాళులర్పించనున్నారు. ఆయా జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నివాళి అనంతరం పోలీసులు ఎస్పీ కార్యాలయం నుంచి వన్‌టౌన్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టనున్నారు. కాగా, పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు వేడుకలు నిర్వహించనున్నారు.