మహబూబ్‌నగర్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చే పట్టిన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారు. ఈ దశలో మళ్లీ పార్టీలో నూతన ఉత్తేజం రగిలించేందుకు మలిదశ పోరాటంలో భాగంగా 2009 నవంబర్ 29న చేపట్టిన దీక్షతో కేంద్రం దిగివచ్చి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ దీక్ష ఫలితమే తెలంగాణ ఏర్పాటుకు నాంది పలికింది.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్లు అన్నిరంగాల్లో అభివృద్ధిలో పరుగులు పెట్టించి దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిపారు. కాగా, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ర్టాన్ని అధోగతి పాలు చేస్తున్నది. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోయి గోసపడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తిరగబడుతున్నారు. మళ్లీ కేసీఆర్ రావాలంటూ కోరుకుంటున్నారు.
కేసీఆర్ దీక్షను స్మరించుకునేందుకు శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపడుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో దీక్షా దివస్ పెద్ద ఎత్తున చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను సిద్ధం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాజీ మంత్రులు, అలంపూర్ ఎమ్మెల్యేతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పటికే ఈ ఐదు జిల్లాలకు పార్టీ సీనియర్ నేతలను ఇన్‌చార్జీలుగా నియమించారు. ఇప్పటికే సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను భారీ ఎత్తున తరలించేందుకు సమాయత్తం చేశారు.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అంటూ గులాబీ బాస్ చేపట్టిన దీక్ష తెలంగా ణ రాష్ట్ర సాకారానికి ఎంతో ఊతమిచ్చింది. దీక్షలో కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న సమాచారంతో బంద్‌లు, నిరసనలు వెల్లువెత్తా యి. ఎటు చూసినా జై తెలంగాణ నినాదమే వినిపించింది. బస్సులు, రైళ్లు స్తంభించిపోయాయి. విద్యార్థులు, లాయర్లు, ఇంజినీర్లు, మేధావు లు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు ఇలా నా లుగున్నర కోట్లమంది ఒక్కటయ్యారు.
గెజిటెడ్ ఉద్యోగులు సైతం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక కేంద్రం దిగిరాక తప్పలేదు. నా తోపాటు చాలా మందిమి కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాం. దీక్ష విరమించాలన్నా ఆయన వినకుండా కేంద్రం దిగొచ్చే వరకు దీక్ష చేపట్టారు. ఫలితంగా కేంద్రం తెలంగాణ ఇస్తున్నట్లు సంకేతాలు ఇస్తూ దివంగత ప్రొఫెసర్ జయశంకర్‌కు వర్తమానం పంపింది. డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు కేంద్రం సానుకూలంగా స్పందించడంతో కేసీఆర్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశాం.
– శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి