మహబూబ్‌నగర్, జూలై 27 : మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలం అచ్యుతాపురం సమీపంలో ఓ గొర్రెల మందపై చిరుత దాడి చేయగా ఐదు గొర్రెలు మృతి చెందగా ముగ్గురు కాపరులకు గాయపడిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే కోయిలకొండ మండలం అచ్యుతాపురం గ్రామ సమీపంలో శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గొర్రెల కాపరి మైబన్న తన గొర్రెల మందను ఆపాడు. భోజనాలు చేసి నిద్రించిన తర్వాత గొర్రెల మందలో అలజడి కనిపించింది. ఏదైనా జంతువు, లేదా కుక్క మందలోకి వచ్చిందేమో అన్న అనుమానంతో గొర్రెల కాపారి పక్కన ఉన్న రైతులు సత్యనారాయణరెడ్డి, చెన్నారెడ్డి ఇండ్లకు సమాచారం ఇచ్చాడు.
అందరూ కలిసి బ్యాటరీలు వేసి మందలో పరిశీలించారు. అప్పటికే ఆ చిరుత నాలుగు గొర్రెలను చంపి వాటి రక్తాన్ని తాగి గొర్రెలతో పాటు నిద్రిస్తున్న దృశ్యాన్ని చూశారు. వారి అలికిడికి లేచిన చిరుత వెంటనే వారిపై దాడికి పాల్పడింది. ముగ్గురి అరుపులు కేకలతోపాటు గొర్రెల అరుపులకు వెనక్కి తగ్గిన చిరుత సమీపంలోని గుట్టుల్లోకి వెళ్లిపోయింది. సమాచారం అందిన వెంటనే వారి వారి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని హన్వాడ ప్రభుత్వ దవాఖానకు తరలించి ప్రథమ చికిత్సల అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ దవాఖానకు తరలించారు.
గాయపడి చికిత్స పొందుతున్న వారిని ఆదివారం ఉదయం కలెక్టర్ విజయేందిర బోయి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని దవాఖాన సూపరింటెండెంట్‌ను కలెక్టర్ ఆదేశించారు. అయితే అటవీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుతను బంధించేందుకు బోనుతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.