ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్న కాంగ్రెస్ తీరుపై కర్షకలోకం భగ్గుమంటున్నది. మళ్లా పటేల్, పట్వారీ వ్యవస్థ వస్తే రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు తప్పవంటున్నారు. రేవంత్‌రెడ్డి కుటుంబం పటేల్ పట్వారీలు.. వాళ్ల ఇంటి ముందు కావాలి కాసే జనం ఇప్పుడు లేరని, దీంతో మళ్లీ పాత వ్యవస్థను తీసుకొచ్చేలా కనిపిస్తుందని ధ్వజమెత్తారు. ఈ వ్యవస్థ తమ
కు వద్దంటూ ముక్తకంఠంతో రైతులు చెబుతున్నారు. రైతులను ఇబ్బందులు పెట్టాలని చూసే నాయకులు తమకు వద్దని, హస్తం పార్టీ నేతలకు ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. తమకు సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి బాగుందంటున్నారు. నిమిషాల్లో భూ రిజిస్ట్రేషన్,గంటల్లో మ్యుటేషన్ అవుతుండడంతో పోర్టల్‌కు జేజేలు పలుకుతున్నారు.
రైతు : నా పేరు పి.సుదర్శన్‌రెడ్డి.. మాది సంగంబండ గ్రామం. నా పేర ఆరెకరాల భూమి ఉన్నది. ఏటా వ్యవసాయం చేస్తున్నాను. ధరణితో భూములకు భద్రత ఏర్పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేసి పటేల్ పట్వారీ వ్యవస్థను తెస్తామంటున్నారు. అలా జరిగితే మన భూములపై మనమే హక్కులను కోల్పోవాల్సి వస్తుంది. ఇది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామంలో పట్వారీల పాలనను తెచ్చి పేదోళ్ల భూముల్లో ఎవరెవరో ఖాస్తుదారు కాలంలో పేర్లు చేర్పించుకొని భూములను లాగేసుకున్నారు. 2014లో కేసీఆర్ సీఎం అయ్యాక రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి ధరణి పోర్టల్‌తో భూములకు మరింత భద్రత కల్పించారు. పట్టాదారు బయోమెట్రిక్ లేనిదే మన భూముల్లో ఎవరూ వేలు పెట్టడానికి వీలులేదు. అలాగే భూముల క్రయ విక్రయాలను సరళీకృతం చేశారు. ధరణి పోర్టల్ విధానంతో ఎవరికైనా భూమిని అమ్మినా.. కొనుగోలు చేసినా గంటల వ్యవధిలోనే పట్టాదారు పాసు పుస్తకం తయారు చేసి క్షణాల్లో మన చేతుల్లో పెడుతున్నారు. ధరణిని తీసేస్తే మళ్లీ పాత కాలపు రోజు లు వస్తాయి.
ప్రశ్న : ధరణిని తీసేసి కౌలుదారు విధానం తీసుకొచ్చి అనుభవదారు కాలం పెడతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు..? మీరేమంటారు..?
రైతు : ఏటా వ్యవసాయం చేస్తున్నాను. ఒక్కోసారి వీలు కాకపోతే ఎవరికైనా కౌలుకు ఇచ్చి చేయిస్తుంటాను. కౌలు ప్రకారంగా ధాన్యం ఇస్తారు. ఇప్పుడు కౌలు రైతును ఖాస్తు కాలంలో అనుభవదారుడిగా చేరిస్తే పరోక్షంగా నా భూమిపై ఇతరులకు హక్కు ఇచ్చినట్లే అవుతుంది. ఇది ఏ ఒక్క రైతుకూ శ్రేయస్కరం కాదు. ఎవరూ అంగీకరించరు. ఇప్పుడున్న విధానమే బాగుంది. మళ్లీ కేసీఆర్ సర్కారే రావాలి.
ధరణి పోర్టల్‌ను తీసివేయడం అంటే రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేయడమే. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రూపాయి ఖర్చు లేకుండా పాస్ పుస్తకాలు వచ్చాయి. లక్షలాది మంది రైతులకు ఎంతో ధైర్యం వచ్చింది. ఆపద వచ్చినప్పుడు సొంత భూమిని అమ్ముకోవాలన్నా, కొనాలన్నా ఇప్పుడు చాలా తేలికైంది. కాంగ్రెసోళ్లు ఇంత మంచి సౌలతును తీసివేయడం అంటే మళ్లీ లంచాలకు తెరతీయడమే అవుతుంది. ధరణి పోర్టల్ తీసేస్తే మళ్లీ రైతులు తాసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ధరణి వల్లే భూముల వివరాలు కరెక్టుగా ఉన్నాయి. రైతులకు దళారులను ఆశ్రయించకుండానే రైతుబంధు డబ్బులు పడుతున్నాయి. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే వచ్చే రూ.5 లక్షల రైతు బీమా కోసం దళారులను ఆశ్రయించాల్సి రాక తప్పదు. ధరణిని తొలగించాలని రైతులెవరైనా ధర్నాలు, రాస్తారోకోలు చేశారా..? కాంగ్రెస్ నాయకులతో ఎవరైనా గోడు వెళ్లబోసుకున్నారా..? అలాంటివేవీ లేనప్పుడు ధరణిని తీసేస్తామని వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా అవుతుంది. వారి స్వలాభం కోసం మాట్లాడడం తప్పా మరెలాంటి ఉపయోగం లేదు.
రైతులు భూ తగాదాలతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సీఎం కేసీఆర్ పునరాలోచించి ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారు. ప్రభుత్వమే భూ సమస్యలను పరిషరించడంతో భూతగాదాలు లేకుండా రైతన్నలు ఎంతో సంతోషంగా ఉన్నారు. రైతుల జీవితాలలో వెలుగులు నింపిన ధరణి పోర్టల్‌ను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి తీసేస్తాం అంటున్నారు. ఒకవేళ అలా జరిగితే మళ్లీ సమస్యలు రావడంతోపాటు దళారీలు రాజ్యమేలుతారు. ధరణి పోర్టల్‌తో భూసమస్యలన్నీ తీరాయనుకుంటే.. రాష్ట్రంలో రాక్షసపాలనను అవలంబించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చి ధరణి పోర్టల్ ప్రవేశపెట్టడంతో రైతులకు వరంలా మారింది. ఇప్పుడు స్థానికంగా తాసీల్దార్ కార్యాలయాల్లోనే స్లాట్ బుక్ చేసుకొని ఇచ్చిన టైంకి వెళ్తే రిజిస్ట్రేషన్ సులభంగా, వేగంగా అయిపోతుంది. ఆ వెంటనే ప్రొసీడింగ్ జరిగి.. నేరుగా ఇంటికే పాస్‌పుస్తకం వస్తున్నది. భూములు అమ్మడం, కొనుగోలు చేయడం చాలా సులభమైంది. రైతులు ఒకసారి ఆలోచన చేసి ధరణి పోర్టల్ పోకుండా ఉండేందుకు కలిసికట్టుగా ఉండి బీఆర్ఎస్కు మద్దతుగా నిలవాలి.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకురావాలని చూస్తున్నది. ఇదే గనుక జరిగితే మళ్లీ ఈ వ్యవస్థతో లంచావతారులు, దళారులు పుట్టుకొస్తారు.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాటలు చూస్తే రైతులకు అన్యాయం చేస్తున్నాడని అర్థమవుతుంది. మూడు గంటల కరెంట్ చాలని, మతిభ్రమించి రోజుకో ప్రకటనలు చేస్తున్నాడు. ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తాడట. వీరికి అధికారం కట్టబెడితే మనకు కష్టాలు తప్పవు. ఇలాంటి వారిని పొలిమేరలు దాటించాలి.. మా బాగోగులు చూసేది సీఎం కేసీఆర్ ఒక్కడే. ధరణి రాకతో భూముల విలువలు పెరిగి పేదోడికి మేలు చేకూరింది. ధరణి రావడంతో దరిద్రం విరగడైపోయింది. గతంలో మాకు తెలవకుండనే మా భూములు లాక్కునేవారు. నేడు ఆ బాధ తీరింది.. మా భూములకు భద్రత కల్పించిన రైతుబాంధవుడు సీఎం కేసీఆర్. ఈ పోర్టల్‌తో మాకు ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఏర్పడింది. తాసీల్దార్ కార్యాలయంలో దళారీలు కనపడడం లేదు. సామాన్యులకు కూడా నిమిషాల్లో భూమి రిజిస్ట్రేషన్, రోజు వ్యవధిలోనే భూమి ఆన్లైన్లో నమోదవుతున్నంది. ఇందుకు సంబంధించి సెల్‌ఫోన్‌కు సమాచారం వస్తుంది. దీంతో ధరణిపై భరోసా వచ్చింది. రైతుల కష్టసుఖాలు తెలిసిన నేత ఆయనే.. ఆయన అడుగులో అడుగువేసి ముందుకు సాగుదాం.. కారు గుర్తుకు ఓటేద్దాం..
ధరణితో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తే పైరవీకారుల రాజ్యం మళ్లొస్తది. దీంతో దళారుల ప్రమేయం పెరిగి రైతుల భూములను గోల్మాల్ చేసే అవకాశం ఉంది. గతంలో భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే పైరవీకారులను ఆశ్రయించాలి. అప్పుడు ఖర్చులు, రవాణా, లంచం అంతా వృథానే అవుతుంది. రేవంత్‌రెడ్డి ధరణిని తీసేస్తే మళ్లీ మండల కార్యాలయాల్లో దళారుల వ్యవస్థ పుట్టుకొస్తుంది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో వ్యవసాయ భూములు భద్రంగా ఉన్నాయి. గతంలో యజమానికి తెల్వకుండానే భూమి ఇంకొకరి పేరు మీదికి మార్చేది. సీఎం కేసీఆర్ ఆలోచనతో ధరణి తీసుకొచ్చి రైతు ప్రమేయం లేకుండా మరొకరి పేరు మీదికి భూమి మార్చే వీలు లేకుండా ఉంది. స్వయంగా రైతు వెళ్లి వేలు ముద్ర వేస్తేనే రిజిస్ట్రేషన్ అయ్యేవిధంగా చేశారు. ధరణితో దర్జాగా ఉంటున్నాం. కాంగ్రెస్ పార్టీ వస్తే ధరణి రద్దు చేసి ఇబ్బందుల పాలు చేస్తారు. అందుకే సీఎం కేసీఆరే మళ్లీ రావాలి. ధరణి ఉండాలి.
ధరణి పోర్టల్ లేకముందు పహాణీ కావాలంటే రూ.200 ఇచ్చి రోజుల తరబడి పట్వారీ వెంట చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది. కాంగ్రెస్ హయాంలో రైతు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి పొలాన్ని తన పేర లేదా కుటుంబసభ్యుల పేర రిజస్ట్రేషన్ చేయించడానికి మధ్యవర్తిత్వం అవసరమయ్యేది. దీంతో అధిక ఖర్చులు, శ్రమ ఉండేది. కానీ నేడు ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రకియ వేగంగా, పారదర్శకంగా నిమిషాల వ్యవధిలో జరుగుతున్నది. పహాణీ కావాలంటే రూ.10 ఇచ్చి నెట్ సెంటర్లో రెండు నిమిషాల్లో ప్రింట్ తీసుకుంటున్నాం. పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు భయమయ్యేది. ఏమైనా మాట్లాడితే మా భూమిని వేరే వారి పేరు మీద రాస్తారేమోనని బిక్కుబిక్కుమంటూ వారు చెప్పిటన్లు నడుచుకునెటోళ్లం. పట్వారీలు పైసలు తిన్నా కూడా పని సరిగ్గా చేసిన పాపాన పోలేదు. బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేస్తే ఎంత భద్రంగా ఉంటాయో ధరణి వచ్చిన తరువాత మా భూములు అంతే భద్రంగా ఉన్నాయి. మళ్లీ కాంగ్రెస్ వస్తే రైతులకు అధోగతే. ఈ విషయంపై రైతులు జాగ్రత్తగా ఆలోచించాలి.
సీఎం కేసీఆర్ మది నుంచి వచ్చిన ధరణి చట్టం రైతులకు చుట్టంలాంటిది. ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో భూ వివాదాలకు చెక్ పడింది. భూముల అమ్మకం, కొనుగోళ్లు ప్రక్రియ ఒకే రోజు పూర్తయ్యేలా బీఆర్ఎస్ ప్రభుత్వం వీలు కల్పించింది. దళారులు, ఏజెంట్ల అవసరం లేకుండా మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకుంటున్నాం. రిజిస్ట్రేషన్, పాస్‌బుక్, మ్యుటేషన్ గంటల వ్యవధిలోనే జరుగుతున్నాయి. సెల్ఫోన్లో ఒక్క బటన్ నొక్కితే రాష్ట్ర వ్యాప్తంగా భూముల వివరాలు తెలుసుకునే సౌకర్యం కలిగింది. ఆధునిక పరిజ్ఞానంతో కూడిన ధరణి వెబ్సైట్ మన రాష్ట్రంలో తప్పా దేశంలో ఎక్కడా లేదు. అలాంటి పోర్టల్‌ను తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం చూస్తుంటే వాళ్ల తెలివి ఎంటో ఇట్టే అర్థమవుతుంది. ఒకవేళ కాంగ్రెస్‌కు అధికారం కట్టబెడితే పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామంటున్నారు. అదే కానీ వస్తే భూములపై హక్కులను కోల్పోతాం. గతంలో పట్టాదారు కాలంతోపాటు దరఖాస్తు దారుడు అనే కాలం ఉండేది. ఆ కాలంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎవరైనా నాలుగైదు సంవత్సరాలు కౌలుకు చేస్తే పట్టాదారుడితో పాటు కౌలుదారుడికి భూమిపై హక్కు ఉండేది. దీంతో కౌలుదారుడు తనకు భూమిపై హక్కు ఉందంటూ పట్టాదారుడితో గొడవలకు దిగేవారు. ఇప్పుడు ధరణితో అలాంటి తప్పిదం లేకుండా ఉంది. ధరణిలో ఉన్న భూముల ఆధారంగానే అమ్మకాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ సర్కారు వస్తేనే ధరణి కొనసాగుతుంది. లేకుంటే రైతులంతా ఆగం కాక తప్పదు.