గద్వాల, మే 12 : ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంట దళారుల పాలు కా కుండా ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటుకు శ్రీకారం చు ట్టింది. దీంతో మధ్యవర్తులను నమ్ముకోకుండా నేరుగా సెంటర్లకు పంట ఉత్పత్తులను తరలించి విక్రయించి కర్షకులు మద్దతు ధర పొందేవారు. ఈ క్ర మంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా సెంటర్ల నిర్వాహకులతోపాటు మిల్లర్లు, దళారులకు ఆదాయ వనరులుగా మారాయి. కొందరు కేంద్రాల నిర్వాహకులతో కు మ్మకై వారు పంట పండించకున్నా.. పండిచినట్లు ఇతరుల పేర్ల మీద ఉన్న భూమి పాస్‌పుస్తకాల ఆధారంగా ధాన్యం విక్రయాలు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా గద్వాల, కేటీదొడ్డి మండలాల్లో విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం.
ఈ విషయం అధికారులకు తెలిసినా.. అమ్యామ్యాలకు ఆశపడి తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై రైతులు ఫిర్యాదు చేస్తేనే తప్పా అధికారులు సెంటర్ల వైపు కన్నెత్తి చూడడం లేదు. తమకు గన్నీ బ్యాగులు ఇవ్వమంటే లేవని చెబుతూనే కర్ణాటక నుంచి రాత్రికి రాత్రే కేంద్రాలకు అక్రమంగా తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారట. శనివారం కేటీదొడ్డి మండ లం కొండాపురం రైతులు ఐకేపీ సెంటర్‌కు తాళం వేసి నిరసన తెలియజేశారు. ఈ ఘటన మరువక ముందే గద్వాల మండలం కొత్తపల్లి, రేకులపల్లి కొనుగోలు సెంటర్లలో అక్రమాలపై అధికారులకు ఆలస్యంగా ఫిర్యాదులు అందాయి. దీంతో అప్రమత్తమైన ‘అధికారులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న’ చందంగా అదనపు కలెక్టర్ ఆదేశాలతో సెంటర్లను తనిఖీ చేయడానికి సిద్ధమయ్యారు. సెంటర్లల్లో తవ్వే కొద్దీ అక్రమాలు బటయపడుతున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకంజ వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
జోగుళాంబ గద్వాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో గోల్మాల్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక ప్రాంతంలో రైతులు మార్కెట్, బయట ధాన్యం విక్రయిస్తే మద్దతు ధర రూ.1,900 నుంచి రూ.2,100 మాత్రమే లభిస్తుంది.. అదే తెలంగాణలోని కొనుగోలు సెంటర్లలో విక్రయిస్తే ధర రూ.2,300తోపాటు బోనస్ రూ.500 అందుతుంది. ఇది గ్రహించిన కొందరు రైతులు, దళారులు బయట నుంచి ధాన్యం కొనుగోలు చేసి బినామీ రైతుల పేర ఇక్కడ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతున్నది. .. ఇలాంటి ఘటనలు ఆలస్యంగా గద్వాల మండలంలోని కొత్తపల్లి, రేకులపల్లి సెంటర్లలో వెలుగు చూశాయి. కొత్తపల్లి కొనుగోలు సెంటరల్లో ఓ దళారీ మార్కెట్లో కొనుగోలు చేసిన ధా న్యాన్ని తన సమీ ప బంధువుల పేర 663 బస్తాలు విక్రయించారు. అయితే దళారీ సమీప బంధువుకు 18 ఎకరాల పొలం ఉండగా..
నలుగురు రైతులకు కౌలుకిచ్చాడు. అతడు పొలం కూడా సాగు చేయలేదు. కాని సాగు చేసినట్లు చూయించి కొత్తపల్లి సెంటర్లో ధాన్యం విక్రయించాడు. ఈ ధాన్యాన్ని అలంపూర్‌లోని ఓ మిల్లుకు ఇప్పటికే తరలించారు. ఇదే బాగుందని భావించిన సదరు దళారీ మరో 500 సంచులు రేకులపల్లి కొనుగోలు సెంటర్లో విక్రయించడానికి తీసుకొచ్చాడు. అనుమానం వచ్చిన రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం ఎక్కడ నుంచి తెచ్చావని సదరు వ్యక్తిని ప్రశ్నించగా గతేడాది పండించిన ధాన్యం మిల్లులో భద్రపరిచానని చెప్పాడు. అధికారులు మిల్లు యజమానిని ప్రశ్నించగా ఏ రైతు తమ మిల్లులో ధాన్యం భద్ర పర్చలేదని చెప్పడంతో అసలు విషయం బయట పడింది. ఈ తతంగం జరుగుతున్న సమయంలో 18 ఎకరాల భూమి కలిగిన రైతు భూమిని, కౌలు చేసుకున్న రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు సెంటర్‌కు తీసుకరావడం.. అప్పటికే ఆ రైతు పేర ధాన్యం కొనుగోలు చేయడంతో అసలు విషయం వెల్లడైంది.
అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. దళారీ తెచ్చిన 500 సంచుల్లో 140 సంచులు తూ కం వేశారు. అయితే అధికారులు ఈ ధాన్యం కొనుగోలును నిలిపి వేశారు. కాగా శనివారం కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదని, గన్నీబ్యాగులు ఇవ్వకుండా వేధిస్తున్నారని, రాత్రికి రాత్రే కర్ణాటక ధాన్యం సరిహద్దులోని కేటీదొడ్డి మండలంలోని కొన్ని సెంటర్లకొస్తే వాటిని కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఐకేపీ సెంటర్‌కు తాళం వేసిన సంగతి విదితమే. ఇలా సెం టర్ల నిర్వాహకులు దళారులు, మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం కొనుగోళ్లలో గోల్మాల్ చేస్తూ నిజమైన రైతులకు అన్యాయం చేస్తున్నారు.
‘తలా పాపం తిలా పిడికెడు’ అన్న చందంగా ధాన్యం కొనుగోళ్ల అక్రమాల్లో అందరూ సూత్రధారులే అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. బయట పడినప్పుడే అధికారులు హడావుడి చేస్తున్నారే తప్పా.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టడం లేదని ఆరోపణలు మూట గట్టుకుంటున్నారు. కేంద్రాల్లోని తతంగమంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమాల్లో సెంటర్ల నిర్వాహకులతోపాటు మిల్లర్లు, వ్యవసాయ విస్తరణాధికారుల పాత్ర ఉండడం.. వీరికి రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని.. అందుకే ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని కొనుగోలు సెంటర్లలో జరుగుతున్న అక్రమాలపై ఇప్పటికైనా పౌర సరఫరా శాఖాధికారులు దృష్టి సారించి అరికట్టాలని రైతులు కోరుతున్నారు.