జడ్చర్ల, డిసెంబర్ 21 : తెల్లబంగారానికి వన్నె తగ్గింది. గతేడాదికన్నా రేటు భారీగా పడిపోవడంతో పత్తి రైతు చిత్తవుతున్నాడు. కనీసం మద్దతు ధరలు కూడా దక్కడం లేదు. దీంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో కొనేందుకు వ్యాపారస్తులు ఆసక్తి చూపకపోవడంతో ధరలు రోజురోజుకూ తగ్గుతున్నాయి.
మార్కెట్లో పత్తికి మద్దతు ధర కరువైంది. ఆశించిన స్థాయిలో రేటు దక్కకపోవడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన పత్తి రైతులకు ప్రతిఏడాది కన్నీళ్లే మిగులుతున్నాయి. ఓవైపు ప్ర కృతి, మరోవైపు వ్యాపారులు ఇద్దరి మధ్యలో కర్షకులు నలిగిపోతున్నారు. వ్యవసాయమే జీవనంగా కొనసాగిస్తున్న రైతు ఒక ఏడాది పంటలు పండకపోయినా మళ్లొచ్చే ఏడాదైనా పండుతాయన్న నమ్మకంతో పంటలు వేస్తున్నాడు. కానీ మద్దతు ధర దక్కకుంటే ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. అదే వ్యాపారం విషయానికొస్తే ఒక్కసారి నష్టం వాటిల్లితే దాన్ని తొలగించి మరో బిజినెస్ చేసుకునే వెసులుబాటు ఉన్నది. కానీ రైతుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. వ్యవసాయం తప్పా ఇతర పనులు రాని రైతులు దాన్నే నమ్ముకుని జీవిస్తున్నారు. ఈ ఏడాది వానకాలం సీజన్లో తొలకరి వర్షాలు కురవడంతో కోటి ఆశలతో రైతులు పంటలు సాగు చేపట్టారు. దుక్కి దున్నడం మొదలు.. విత్తనాలు విత్తి.. ఎరువులు వేసి, మందులు పిచికారీ చేసి ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకుందామంటే తీరా మార్కెట్లో ధరలు అంతంతే.. అక్కున్న వ్యాపారులు వేసిందే ధర దీంతో కర్షకులు దిగాలు చెందుతున్నారు. ఇలా పత్తి రైతుకు ప్రకృతితో పాటు ధరలు రాక నష్టపోతున్నారు.
ఈ ఏడాది మొదట్లో రూ.7 వేలకు పైచిలుకు పలికిన పత్తి ధరలు రోజురోజుకూ పడిపోతూనే వచ్చాయి. ప్రస్తుతం క్వింటా రూ.6 వేలు లభిస్తుండగా.. గతేడాదికంటే పూర్తిగా పడిపోయాయి. పోయినసారి వానకాలం సీజన్ ప్రారంభంలో క్వింటాకు రూ.9 వేలకు పైచిలుకు ధరలు రాగా.. ఈ సారి సీజన్ ప్రారంభంలో క్వింటాకు కేవలం రూ.7,295 ధరలు మాత్రమే వచ్చాయి. తర్వాత రోజురోజుకూ తగ్గుతూ వచ్చాయి. అయితే ధరలు పెరుగుతాయన్న ఆశతో రైతులు పత్తిని అమ్మకుండా ఇండ్లల్లో నిల్వ చేశారు. తీరా ధరలు పెరగకపోవడంతో చివరకు తక్కువ రేటుకే అమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తింది. నిల్వ ఉంచితే ఇంకా పడిపోయే అవకాశం ఉన్నదని పలువురు రైతులు తక్కువ ధరలకే తెల్లబంగారాన్ని విక్రయిస్తున్నారు. ఈసారి అసలు ధరలే రావడం లేదు.
పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కూడా రావడం లేదు. క్వింటాకు రూ.7,020 ధర నిర్ణయించినా కానీ మార్కెట్లో కనీస ధరలు కూడా దొరకని పరిస్థితి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి సాగుకోసం చేసిన పెట్టుబడి ఖర్చులు సైతం వస్తాయా..? లేదా..? అన్న మీమాంస రైతుల్లో నెలకొన్నది. పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతోనే ఆశించిన స్థాయిలో ధరలు దక్కడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. కర్ణాటక, రాయిచూర్, మహారాష్ట్ర సైతం పత్తి ఎగుమతి కావడం లేదని పేర్కొంటున్నారు.
రైతులు పండించిన పత్తికి క్వింటాకు రూ.12 వేల ధరను ప్రభుత్వం ఇవ్వాలి. నాకున్న పదెకరాలలో పత్తిని సాగు చేశాను. పంట పూర్తిగా దెబ్బతిన్నది. దిగుబడులు బాగా తగ్గాయి. ఎకరాకూ 3 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ధరలను చూస్తే ఈ సారి పంట సాగుకు పెట్టిన ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ మద్దతు ధర రూ.7,020 కూడా రావడం లేదు. మొత్తం 90 బస్తాలు తీసుకొస్తే 80 బస్తాలకు క్వింటా రూ.6,260 ధర వచ్చింది. మరో 10 బస్తాలకు క్వింటాకు రూ.5,400 మాత్రమే దక్కింది. ఎంతో కష్టపడి పండించిన పంటలకు ధరలు లేకపోవడంతో అప్పులపాలు కావాల్సి వస్తుంది. గతేడాది క్వింటాకు రూ.9 వేలకుపైగానే ధర పలికింది. ఈ సారి కూడా ధరలు బాగొస్తాయన్న ఉద్దేశంతో పత్తిని సాగు చేస్తే నిరాశే ఎదురైంది. ప్రస్తుత మార్కెట్లో ధరను చూస్తే భయమేస్తున్నది. బుధవారం జడ్చర్ల మార్కెట్కు తీసుకొస్తే రూ.6,260 ధర వచ్చింది. ఇలా అయితే అప్పులు ఎలా తీర్చాలో.. సర్కారు మద్దతు ధరను పెంచాలి.