బొంరాస్‌పేట/కోస్గి, మార్చి 1 : పోలేపల్లి ఎల్లమ్మ సిడె ఉత్సవం కనులపండువగా సాగింది. తెలంగాణతోపాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరాగా.. వారి సమక్షంలో వేడుక ఆధ్యంతం ఆనంద భరితంగా జరిగింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ జాతర వైభవంగా జరుగుతున్నది. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సిడె కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నయనానందకరంగా నిర్వహించారు. ఎల్లమ్మ తల్లీ.. మమ్మల్ని చల్లంగా చూడమ్మా.. అన్న నామస్మరణ మార్మోగింది. భక్తుల కేరింతలు, జయజయ ధ్వనులు ఓవైపు.. మేళతాళాలు, డప్పు చప్పుళ్లు మరో వైపు జాతరకే హైలెట్.. మహిళలు పూనకాలతో ఊగిపోయారు. సాయంత్రం సిడె వేడుక 15 నిమిషాలపాటు శోభాయమానంగా జరిగింది. అంతకు ముందు జల్ది ఉత్సవంలో భాగంగా ఆలయం లో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని పల్లకీలో ఉంచి గుడికి సమీపంలో ఉన్న బావి వద్దకు మేళతాళాలు, కొమ్ము వాయిద్యాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ బావిలో విగ్రహానికి స్నానం చేయించిన తర్వాత మళ్లీ ఆలయానికి చేర్చారు. అక్కడ కుంభం పోసిన తర్వాత ఆలయ కమిటీ చైర్మన్ ఏదుల జయరాములు, మేనేజర్ రాజేందర్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించిన రథానికి ఉన్న పొడవైన స్తంభానికి చివరన ఏర్పాటు చేసిన తొట్లెలో ఉంచి ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయించారు. ఈ సమయంలో అమ్మవారి రథాన్ని లాగడానికి భక్తులు వేల సంఖ్యలో పోటీపడ్డారు. సిడె తిరుగున్న సమయంలో పలువురు భక్తులు పూనకాలు నిండారు. భక్తులు వేపాకు, పసుపు, గవ్వలు కలిపిన గవ్వల బండారును అమ్మవారిపైకి విసరగా.. గవ్వలను ఏరుకోవడానికి భక్తులు పోటీ పడ్డారు. పోతరాజుల విన్యాసాలు జాతరలో ఆకర్షణగా నిలిచాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు రంగారెడ్డి, పొరు గు జిల్లాలు, మహారాష్ట్రలోని షోలాపూర్, భీవండి, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, పక్క రాష్ర్టాల నుంచి భక్తులు లక్షకుపైగా తరలిరాగా జాతర ప్రాంగణం జనసంద్రమైంది. సిడె ఉత్సవాన్ని తిలకించి తన్మయ త్వం చెందారు. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి బారులుదీరారు. బోనం కుండలు, మేకపోతులు, కోడిపుంజులతో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. క ష్టాలు తీర్చాలని అమ్మవారిని వేడుకున్నారు. కొం దరు భక్తులు తలనీలాలు సమర్పించి కోనేరులో స్నానం ఆచరించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎల్లమ్మ జాతరకు కోస్గి, తాండూరు, పరిగి, నారాయణపేట ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. షోలాపూర్ భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో తాండూరు బస్టాండ్ భక్తులతో కిటకిటలాడింది. ఎడ్ల బండ్లు, ప్రైవేట్ వాహనాల్లో భక్తులు జాతరకు తరలి వచ్చారు. సిడెను తిలకించిన అనంతరం స్వస్థలాలకు తిరిగివెళ్లారు. నీటి సమస్య రాకుండా ఆలయ కమి టీ ట్యాంకర్లను ఏర్పాటు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.