హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితంపై, ఆయన ఉద్యమాన్ని నడిపిన తీరుపై పలు దేశాల్లో మేధోవర్గం చర్చిస్తున్నది. తాజాగా ఇటలీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు కేసీఆర్ గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఆదివారం తెలంగాణ భవన్‌ను సందర్శించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉద్యమం గురించి, తెలంగాణ రాష్ట్ర సాధన వంటి అనేక అంశాలపై ఆ ఇద్దరు ప్రొఫెసర్లు ఆరా తీశారు. వివిధ ప్రాంతాలు, విశిష్టతలపై జరుపుతున్న పరిశోధనల్లో భాగంగా తెలంగాణ భవన్‌ను సందర్శించినట్టు తెలిపారు.
తెలంగాణ భవన్లో కేసీఆర్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడే ఎందుకు ప్రతిష్టించారు..? దాని ప్రాధాన్యం ఏమిటీ..? అని, ఆ తల్లి చేతిలోని పూలు, బతుకమ్మ, మక్క కంకి, కట్టుబొట్టు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలో పూలతో జరుపుకునే బతుకమ్మ పండుగ, దేశంలో ఎక్కడా లేని విధంగా జరుపుకొనే బోనాలు, సమ్మక్క, సారలమ్మ జాతర వంటి పండుగలు, జాతరలు వాటి విశిష్టతల గురించి ఆరా తీశారు.
తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు గురించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర ఇటలీ ప్రొఫెసర్లకు ‘కేసీఆర్ ది మ్యాన్ ఆఫ్ మిలియన్స్’ అనే పుస్తకాన్ని బహూకరించారు. అనంతరం ఆ పుస్తకాన్ని ఎందుకు రాయాల్సి వచ్చిందనే విషయాన్ని ఇటలీ ప్రొఫెసర్లకు వివరించారు. ఇటలీ ప్రొఫెసర్లు కేసీఆర్ జీవిత చరిత్ర, ఉద్యమం, రాష్ట్ర సాధన, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుసుకొని సంతోషించారు.