TS-iPass | పెట్టుబడుల వెన్నుతట్టిన టీఎస్ఐపాస్.. పరిశ్రమల అనుమతి, ఏర్పాటులో జాప్యానికి చెల్లు
TS-iPass | కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణలో మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలి. అందుకు కంపెనీలు రావాలి. అది జరుగాలంటే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలి.
TS-iPass | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణలో మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలి. అందుకు కంపెనీలు రావాలి. అది జరుగాలంటే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలి. అందుకు సులభతర వ్యాపారం చేసే సుహృద్భావ వాతావరణం కల్పించాలి. అలాంటి వాతావరణం ఉండాలంటే మౌలిక సదుపాయాలు, రాయితీలు, ప్రోత్సాహకాలతో పాటు వేగవంతమైన అనుమతులకు మార్గం ఉండాలి. తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ మనస్సులో మెదిలిన ఈ ఆలోచనలకు కార్యరూపమే.. టీఎస్ఐపాస్ (తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్). సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) అనుమతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ను ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలువురు నిపుణులు ప్రశంసించారు. తాజాగా కేంద్రప్రభుత్వ మేధోసంస్థ నీతిఆయోగ్ కూడా టీజీఐపాస్ను దేశంలోనే ఉత్తమ విధానాల్లో ఒకటిగా కొనియాడింది. ఈ మేరకు ‘ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్’ పేరుతో తాజాగా విడుదల చేసిన నివేదికలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
నిర్ణీత వ్యవధిలో అనుమతులు
ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడానికి దేశంలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల్లో టీఎస్ఐపాస్ ఒకటని నీతిఆయోగ్ ప్రశంసించింది. టీఎస్ఐపాస్ ద్వారా ఎంఎస్ఎంఈ అనుమతుల్లో జాప్యాన్ని తగ్గించడంతోపాటు తనిఖీలను కనిష్ఠస్థాయికి చేర్చినట్లు తన నివేదికలో పేర్కొన్నది. సింగిల్ విండో పద్ధతిలో లభించే అనుమతులకు నిర్ణీత (15 రోజుల) గడువును నిర్ధారించడాన్ని నివేదిక కొనియాడింది. తద్వారా అనవసర జాప్యాలు లేకుండా వ్యాపారాలు ప్రారంభించడానికి, విస్తరించడానికి ఈ చట్టం దోహదపడుతున్నదని తెలిపింది. వ్యాపారంలో ఏర్పడే సంక్లిష్టతలను కూడా ఈ విధానం తగ్గించినట్టు చెప్పింది. చట్టబద్ధమైన నిబంధనల అమలులో స్వీయధ్రువీకరణను ఈ విధానం అనుమతిస్తున్నదని గుర్తుచేసింది. తనిఖీల సంఖ్యను గణనీయంగా తగ్గించడంతో వ్యాపార విస్తరణకు దోహదపడినట్టు ప్రశంసించింది. మొత్తంగా టీజీఐపాస్ను దేశంలోనే ఉత్తమ విధానాల్లో ఒకటిగా తేల్చిచెప్పింది. కాగా నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ గతంలో అనేక సందర్భాల్లో టీఎస్ఐపాస్పై ప్రశంసలు కురిపించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషిచేస్తున్నదని కొనియాడారు.
అలా టీఎస్ఐపాస్కు శ్రీకారం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరాక అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్ర బహుముఖాభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే వ్యవసాయరంగ అభివృద్ధికి నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించిన విధంగానే పారిశ్రామికీకరణ కోసం అత్యుత్తమ చట్టాన్ని తేవాలని నిశ్చయించారు. నిత్యం కరెంటు కోతలు, పవర్ హాలీడేలతో సతమతమవుతున్న పరిశ్రమల రంగాన్ని గట్టెక్కించడమే కాకుండా దేశానికే ఆదర్శంగా నిలపాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే సమస్యలు తెలుసుకునేందుకు పరిశ్రమ వర్గాలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు తొమ్మిది గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పారిశ్రామికవేత్తలు తమకు నిరంతర విద్యుత్తు ఇవ్వాలని కోరారు. అనుమతుల్లో తలెత్తుతున్న ఇబ్బందులు, మితిమీరిన జాప్యాన్ని నివారించాలని ఈ సందర్భంగానే విజ్ఞప్తిచేశారు. దీంతో కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ టీజీఐపాస్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
టీఎస్ఐపాస్ ఎప్పుడు.. ఎలా?
- డిసెంబర్ 3, 2014- టీఎస్ఐపాస్ చట్టానికి గవర్నర్ ఆమోదం
- జూన్ 12, 2015-సేవలు ప్రారంభం
- ఏప్రిల్ 1, 2016-ఆన్లైన్లో టీఎస్ఐపాస్ సేవలు ప్రారంభం
టీఎస్ఐపాస్ ప్రత్యేకతలు
సింగిల్‌విండో విధానం: పరిశ్రమకు అవసమైన అనుమతులు, ప్రోత్సాహకాలు ఒకేచోట
లాప్టాప్ ఉంటే చాలు: ఇంటినుంచి కాలు బయట పెట్టకుండానే దరఖాస్తులు, అనుమతులు అన్నీ ఆన్లైన్లోనే..
వేరేవాళ్లు అక్కర్లేదు: స్వీయ ధృవీకరణ (సెల్ఫ్ సర్టిఫికేషన్) ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు
అనుమతులకు గడువు: 15 రోజుల్లోగా అనుమతుల జారీ, అనుమతులకు గరిష్ఠ సమయం 30రోజులు
కరెంటు కోతలూ లేకపోవడంతో..
దేశంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ఆన్లైన్లోనే దరఖాస్తులు, అనుమతులు రావడంతో పరిశ్రమ వర్గాల్లో ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. దీనికితోడు మండు వేసవిలో సైతం రెప్పపాటు కూడా కరెంటు పోకపోవడంతో బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమలు మూడు షిఫ్టుల్లో నడిచాయి. దీంతో దేశవిదేశాల నుంచి రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ పేరుగాంచింది. ప్రపంచంలోని అనేక పేరుగాంచిన పరిశ్రమలు, ఐటీ, ఔషధ కంపెనీలు రాష్ర్టానికి క్యూకట్టాయి. అప్పటి పరిశ్రమల మంత్రి కేటీఆర్ నేతృత్వంలో పెట్టుబడుల కోసం జరిపిన విదేశీ పర్యటనల సందర్భంగా టీఎస్ఐపాస్ గురించి వివరించగానే ఆయా కంపెనీల ప్రతినిధులు ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి విధానం లేదని ప్రశంసలు కురిపించారు. టీఎస్ఐపాస్ కారణంగా రాష్ర్టానికి పరిశ్రమలు క్యూకట్టాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

