సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): 22-ఏ(నిషేధిత జాబితా)తో సామాన్యుల ఆస్తులను ప్రభుత్వం లాక్కోవాలని చూడటం అన్యాయమని రియల్టర్లు, సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం 3 టీవీ, సకలం ఆధ్యర్యంలో 22ఏ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు కే.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. 22-ఏతో ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు.
ప్రభుత్వమే సమస్య పరిష్కరించాలని సూచించారు. రియల్టర్ రవిచంద్రన్ మాట్లాడుతూ.. పటాన్ చెరు, అమీన్‌పుర లొకేషన్లలో చాలా వరకు ప్రభుత్వ భూములున్నాయని..వాటికి సంబంధిత శాఖల అధికారులు అనుమతినివ్వడంతో అపార్ట్మెంట్లు వెలిశాయన్నారు. బ్యాంక్లోన్లు వచ్చాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ భూములు 22-ఏలో ఉన్నాయని చెబితే వాళ్లంతా ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇకపై ఏ లొకేషన్లో ఉన్న భూమిని కొనుగోలు చేయాలన్నా ముందే అన్ని డాక్యుమెంట్లను పరిశీలించుకోవాలని సూచించారు. అనంతరం సతీష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 93 లక్షల ఎకరాలకు పైగా ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉందని అన్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయలోపం ఉందని చెప్పారు. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సేవల్లో పారదర్శకత లోపించిందని అన్నారు.
ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో నుంచి భూములు తీసే మార్గం ఉందని అయితే అది చాలా ఖర్చుతో కూడుకున్నదని ఆరోపించారు. 22ఏ సమస్యను ప్రభుత్వం పరిష్కరించకపోతే ప్రజలు నష్టపోతారని అన్నారు. ప్రభుత్వ భూములను రక్షించడానికి 22ఏ ఓకే కానీ దాని పేరుమీద ప్రయివేట్ భూములను కూడా ఆ జాబితాలో చేర్చడం అన్యాయం అని చెప్పారు. 22ఏ అమలయ్యే విధానంలో లోపం ఉందని వివరించారు. ఇప్పుడెందుకు దీనిని తెరమీదకు తీసుకొచ్చారని ప్రశ్నించారు.
గతంలో సమస్యలు ఉంటే పరిష్కరించుకునే వెసులుబాటు ఉండేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని వాపోయారు.అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇప్పుడు భూమి కొనుగోలు చేయాలంటే కచ్చితంగా అందరూ లింక్ డాక్యుమెంట్, ఆర్ఓఆర్, పట్టాదార్ పాస్‌బుక్, ఈసీ, లేఅవుట్, నేరుగా భూమి పరిశీలన, రెవెన్యూ వెరిఫికేషన్, లీగల్ ఒపీనియన్ తదితరవి అన్నీ పరిశీలించుకోవాలని సూచించారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ.. బిల్డర్లు అన్నీ అనుమతులు తీసుకొని అపార్ట్మెంట్లు కట్టి సేల్ చేసి వెళ్లిపోతారని అన్నారు.
22ఏ అంశంలో వాళ్లు ఎక్కడా కనిపించరని చెప్పారు. బిల్డర్‌ను నిలదీస్తే తనకు అన్నీ అనుమతులున్నాయని చెబుతారని పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్‌తో ఘర్షణపడినా ఫలితం లేదని అన్నారు. ఈ సమస్య అంతా కొనుగోలు చేసిన వారికే చుట్టుకుంటుందని సూచించారు. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్వేతా కృష్ణమూర్తి, రవి ప్రకాశ్, సకలం ఎడిటర్ అరుణ తదితరులు పాల్గొన్నారు.