లక్నో : ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. యూపీ నాలుగు రాష్ర్టాలుగా విడిపోతుందని సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్భర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీని పూర్వాంచల్, మధ్యాంచల్, బుందేల్ఖండ్, హరిత్ ప్రదేశ్లుగా విభజించాలాని తాము కోరుకుంటున్నట్టు రాజ్భర్ చెప్పారు. కులగణన తర్వాత యూపీ విభజనకు ప్రధాని నరేంద్రమోదీ తనకు హామీ ఇచ్చారంటూ రాజ్భర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్వాంచల్ రాష్ట్రంగా ఏర్పడితే రాజ్భర్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే మొదటి ముఖ్యమంత్రి కావాలనేది తమ ప్రధాన డిమాండ్ అన్నారు. రాజకీయ పోరాటం మరింత తీవ్రం అవుతోందని కార్యకర్తలు సహనం కోల్పోవద్దని కోరారు.
పూర్వాంచల్ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిచ్చే ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకునేందుకు తన పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఆ ప్రాంతంలో రాజ్భర్ వర్గానికి ఓటుబ్యాంకు ఎక్కువగా ఉందని.. తమ హక్కుల సాధనలో ఇది కీలకం అని తెలిపారు. అలాగే ఓబీసీలకు ఉన్న 27 శాతం రిజర్వేషన్లనుకూడా ఉపవర్గాలుగా విభజించాలని కోరారు. ఇదే విషయంపై తాను ప్రధాని నరేంద్ర మోదీని కలవగా.. ఆయన కూడా సానుకూలంగా స్పందించారని.. నీ ప్రతిపాదన సమర్థవంతమైనదే అని చెప్పారంటూ రాజ్భర్ వివరించారు.