ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కార్యక్రమం ముగిసింది. ఆ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లెక్కతేలింది. అధికారిక గణాంకాల ప్రకారం మొత్తం ఓటర్లలో 3,92,298 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించలేదని వెల్లడించింది. ఇందులో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 1,77,645 మంది తమ ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వలేదు. ‘సర్’ ప్రక్రియ ముగియడంతో.. ప్రస్తుతం కొత్త సందింగ్ధం తెరపైకి వచ్చింది. ఫారాలు సమర్పించని ఓటర్లు ఉన్నట్టా? లేనట్టా? అన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా.. అధికారులు ఈ నెల 17న డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు. అయితే.. డ్రాఫ్ట్‌లో పేరు లేకపోయినా, ఎన్యూమరేషన్ ఫారం సమర్పించకపోయినా.. గాబరా పడాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు కొనసాగే.. అభ్యంతరాల స్వీకరణలో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది.
కరీంనగర్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / కలెక్టరేట్ : ‘సర్’పై ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు ఈ కార్యక్రమం ముగిసింది. అయితే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనుకున్న తరహాలోనే 13.08 శాతం ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వలేదని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 29,97,973 మంది ఓటర్లు ఉండగా, ఆ మేరకు.. ప్రతి ఒక్కరికీ ఎన్యూమరేషన్ఫారాలు చేరేవిధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. నిజానికి ఆరంభంలో ఫారాల పంపిణీ చాలా అలస్యం అయినా.. ఆ తదుపరి ఎన్నికల సంఘం ఆదేశాలతో కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపి అధికారయంత్రాగాన్ని పరుగులు పెట్టించారు. ఆ మేరకు.. ఆయా జిల్లాల్లో ఉన్న ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ఫారాలు పంపిణీ చేశారు. సమయం సరిపోవడం లేదని వచ్చిన అభ్యంతరాల మేరకు ఎన్నికల సంఘం రెండుసార్లు గడువు పెంచింది. ఈ నెల 10తో గడువు ముగియగా, ఉమ్మడి జిల్లాలో 26,05,675 మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలకు సమర్పించారు. ఆ మేరకు ఈ మొత్తం ఓట్లను డిజిటలైజ్ చేసినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు.
ఇంకా 3,92,298 మంది ఓటర్లు తమ ఫారాలు సమర్పించనట్టు లెక్కతేలింది. ఇందులో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 1,77,645 ఓటర్లు తమ ఫారాలు సమర్పించకపోవడం గమనార్హం. ప్రధానంగా 3.92 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నట్టా? లేనట్టా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ కారణాల వల్ల ఇంకా కొంత మంది ఎన్యూమరేషన్ఫారాలు సమర్పించలేకపోయారన్న చర్చ కూడా ఉంది. అలాగే.. 2002లో ఓటు ఉన్నా.. సరిగా చూసుకోలేక తాజాగా ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేని వారు సైతం ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తదుపరి బయటకు వచ్చే అవకాశాలున్నాయన్న చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. అధికారులు మాత్రం ఈ నెల 17న ఓటర్ల డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకునే వెసలుబాటును ఎన్నికల సంఘం కల్పించింది. ఈ సమయంలో వచ్చే అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి తగు చర్యలు తీసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన అభ్యంతరాలను వెనువెంటనే పరిష్కరించేందుకు ఈ నెల 17 నుంచి అక్టోబర్ 15 వరకు ఎన్నికల సంఘం అధికారులకు అవకాశం కల్పించింది. ఆ తదుపరి అక్టోబర్ 19న తుది జాబితా ప్రకటించనున్నారు.

ఇప్పటికే ఓటరుగా ఉన్న వ్యక్తి ఈ నెల 10లోపు ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వక పోతే అతని పేరు డ్రాఫ్ట్ జాబితాలో లేకపోయినా సదరు వ్యక్తి అభ్యంతరాల స్వీకరణ సమయంలో అధికారులకు ఫిర్యాదు చేయడానికి ఈసీ అవకాశం కల్పించింది. అలాగే, ఫారం-6తోపాటు డిక్లరేషన్ ఫారం ద్వారా సదరు వ్యక్తి తన పేరును ఓటర్ జాబితాలో చేర్పించుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఇప్పటి వరకు నమోదు కాని కొత్త వ్యక్తి అయి ఉండి 18 ఏళ్లు నిండితే.. సదరు వ్యక్తులు ఫారం-6 ద్వారా కొత్త ఓటర్‌గా నమోదుచేసుకోవడానికి అవకాశం ఉంది. సర్ కార్యక్రమం ముగిసినందున ఓటర్‌గా నమోదు చేసుకునే అవకాశం కోల్పోయామంటూ కొంత మందిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో ఏమైనా అనుమానాలుంటే బూత్‌లెవల్ అధికారి (బీఎల్వో)ని అడిగి తెలుసుకోవచ్చని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేరు రాకపోయినంత మాత్రాన ఓటు హక్కు కోల్పోయినట్టు కాదన్నది ఈసీ స్పష్టంగా పేర్కొంది.
నిజానికి 2002 సర్‌తో సంబంధం లేకుండా మధ్య మధ్యలో చాలా మంది యువకులు తమ ఓటర్ జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకున్నారు. వివిధ ఎన్నికల సమయాల్లో ఓటు హక్కు పొందారు. కానీ, ప్రస్తుతం ‘సర్’లో భాగంగా.. వారి తల్లిదండ్రుల ఎపిక్ నంబర్ ఆధారంగా చేసుకొని నమోదు చేసుకునేందుకు ప్రయత్నించగా.. చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయి. అయితే.. తిరిగి ఫారం -6 ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తే.. అందులో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో చాలా మంది ఓటర్లు.. సర్ కింద తన ఓటు హక్కు నమోదు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో కొత్తగా నమోదు చేసుకునేందుకు ఆన్లైన్లో అవకాశం కల్పిస్తే.. నూతన ఓటర్లు, జాబితాలో గల్లంతయిన వారు తిరిగి దరఖాస్తు చేసుకొని ఓటు హక్కు పొందే అవకాశం ఏర్పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
