సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) ప్రవేశపెట్టి చెత్త సేకరణను ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెట్టేందుకు అధికారులు కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ స్వచ్ఛ ఆటో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మాదాపూర్‌లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కార్యాలయం ఎదుట మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. నగరంలోని నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్మికులు రాంకీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ఈ క్రమంలో ఒకసారిగా సీఎంసీ ప్రధాన గేటును తోసుకొని లోపలికి వెళ్లేందుకు కార్మికులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం కార్మికులు గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. సీఎంసీ కమిషనర్ సృజన, జయేష్ రంజన్.. రాంకీ సంస్థకు తొత్తులుగా మారారని, తమను ఆ ప్రైవేట్ ఏజెన్సీ కింద పనిచేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారని కార్మికులు మండిపడ్డారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే త్వరలోనే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని, నగరవ్యాప్తంగా చెత్త ఆటోల సేవలను పూర్తిగా నిలిపివేస్తామని యూనియన్ నాయకులు రాజేందర్, ఆందోళనకారులు హెచ్చరించారు.