Hafizpet Railway Station | హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళను కొట్టి.. జుట్టు పట్టుకొని లాక్కెళ్లిన ఘటనపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై విచారణ చేపట్టినట్లు తెలిపింది. ఇందులో మహిళపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన హోంగార్డు అని గుర్తించినట్లు వెల్లడించింది.
హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్లో విధులు నిర్వహించేందుకు తెలంగాణ పోలీస్ నుంచి ఆ హోంగార్డును డిప్యూటేషన్‌పై పంపినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ఘటనపై విచారణ పూర్తిచేసిన అనంతరం అతడిని తిరిగి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు పంపినట్లు పేర్కొంది. అవసరమైన క్రమశిక్షణ చర్యల కోసం తెలంగాణ పోలీస్ శాఖకు అప్పగించినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చింది.
హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఓ మహిళను ఓ వ్యక్తి కొడుతూ.. జుట్టు పట్టుకొని లాక్కెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఘటనగా పేర్కొంటూ వీడియోలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. వైరల్ వీడియోలో కనిపించిన వ్యక్తి రైల్వే పోలీస్ కానిస్టేబుల్ అంటూ తొలుత ప్రచారం జరిగింది. అయితే దక్షిణ మధ్య రైల్వే విచారణ అనంతరం దీనిపై స్పష్టత ఇచ్చింది.
హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ పరిధిలో అమానుష ఘటన
హైదరాబాద్ – హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళను కొట్టి, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన రైల్వే పోలీస్ కానిస్టేబుల్ (RPF) pic.twitter.com/b3xlFQNd1t
— Telugu Scribe (@TeluguScribe) September 18, 2026