మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రణాళిక లేకుండా భూయజమానులను మభ్యపెట్టి ఆస్తులను గుంజుకునేందుకు కుట్రలు చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టును ప్రకటించి రెండేండ్లవుతున్నా ఇప్పటివరకు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును బయటపెట్టకుండా భూసేకరణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. కనీసం ప్రాజెక్టు వివరాలు, ఏఏ ప్రాంతాల్లో ఎంత భూమి తీసుకుంటారు? ప్రాజెక్టు కింద ఎన్ని నిర్మాణాలను స్వాధీనం చేసుకుంటారు? పరిహారం ఏవిధంగా ఇస్తారు? అనే వివరాలపై కనీస స్పష్టత ఇవ్వడం లేదు.
– సిటీ బ్యూరో/మణికొండ/బండ్లగూడ (నమస్తే తెలంగాణ)
సిటీ బ్యూరో/మణికొండ/బండ్లగూడ, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ఎంఆర్డీసీఎల్, రెవెన్యూ అధికారులు మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రకటించిన జీవోకు, క్షేత్రస్థాయిలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు ఏమాత్రం పొంతన లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా భూములను కోల్పోతున్న యజమానులకు అధికారికంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పూర్తిగా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ తీరుగా వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తూ సమావేశాలకు రావాలని పిలుస్తున్నారు. ప్రాజెక్టుపై సమగ్ర అవగాహన లేకుండా భూయజమానులను భయబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారు. ఈనేపథ్యంలోనే మగంళవారం బాపుఘాట్-హిమాయత్‌సాగర్, బాపుఘాట్-గండిపేట ప్రాంతాల ప్రజలను సమావేశాలకు పిలిచారు. ప్రాజెక్టుపై బాధితులు అడిగిన సందేహాల్లో ఏ ఒక్కదానికీ సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేసేందుకు ప్రయత్నించారు. అధికారుల తీరుపై బాధితులు ప్రశ్నల వర్షం కురిపించడంతో బిక్కమొహం వేసి చూస్తూ ఉండిపోయారు. దేనికీ స్పష్టత ఇవ్వకుండానే సమావేశాన్ని ముగించేశారు. ఎందుకు వచ్చారో.. ఏం చెప్పదలుచుకున్నారో తెలియక బాధితులు తలలు పట్టుకున్నారు. అధికారుల తీరుపై తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరిస్తూ బయటకు వెళ్లిపోయారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ లేకుండా, అధికారికంగా నోటీసులు ఇవ్వకుండా సంప్రదింపులకు ఎలా పిలుస్తారని భూ యజయానులు ప్రశ్నించారు. డీపీఆర్ ప్రజల ముందుంచకుండా, ప్రాజెక్టు స్వరూపమేంటో తెలియకుండా.. అందులో ఏం మార్పులు చేశారో స్పష్టత ఇవ్వకుండానే సంప్రదింపులు, సమావేశాలు నిర్వహించడం వెనుక అసలు మతలబు ఏముందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు డీపీఆర్ ఏమిటో, అందులో తమ ప్రాంతానికి సంబంధించిన వివరాలేమిటో, ఎంతమంది ఇండ్లు, ఎంత భూమి ప్రాజెక్టు పరిధిలోకి వస్తుందో స్పష్టంగా వెల్లడించకుండా సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. తమ అభిప్రాయాలను తెలుసుకునేందుకే సమావేశం నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, ఎంతమేర ప్రాధాన్యం ఇస్తున్నారో చెప్పాలని నిలదీశారు. సమావేశం నిర్వహించామని రికార్డుల్లో చూపించుకునేందుకే అధికారులు వచ్చారని, తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందే నిర్ణయించుకున్న ప్రణాళికను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టులోని ఫేజ్-1 గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి బాపుఘాట్-హిమాయత్‌సాగర్, బాపుఘాట్-గండిపేట పరిసరాల్లోని ప్రజలను సంప్రదింపులకు పిలిచారు. రెండు ప్రాంతాలవారితో వేర్వేరుగా సమావేశమైన అధికారులు వారి సందేహాలను, ప్రశ్నలను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించారు. ఎంఆర్డీసీఎల్ ప్రతినిధి డిప్యూటీ కలెక్టర్ కొప్పుల వెంకటరెడ్డి తీరుపై బాధితులు అసహనం వ్యక్తంచేశారు. వాళ్లు ఏప్రశ్న అడిగినా ఒకటే సమాధానం చెప్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎవరు ఏ సందేహం అడిగినా ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేశాం.. నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం.. చాలావరకు ఇండ్లు కోల్పోకుండా చూస్తాం.’ అనే సమాధానమిచ్చారు. డీపీఆర్‌పై స్పష్టత, పరిహారం, భూసేకరణ విధానం, ప్రాజెక్టు స్వరూపం గురించి వివరించాలని బాధితులు కోరినా అదే సమాధానం చెప్పారు. ఏ ప్రశ్న అడిగినా డిజైన్ మార్పు అనేమాట తప్ప మరో విషయమే మాట్లాడలేదు. సమావేశం ఆసాంతం ఒకే సమాధానంతో ముగించారు. దీంతో ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులు ఇంటిబాట పట్టారు.
అధికారుల వివరణతో సంతృప్తి చెందని బాధితులు ‘గో బ్యాక్ ఆఫీసర్స్ ’ అంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలను వినకుండా నిర్వహిస్తున్న సమావేశం తమకు అవసరం లేదంటూ సమావేశాన్ని బహిషరించారు. తీవ్ర అసహనంతో అకడి నుంచి వెళ్లిపోయారు. తరతరాలుగా తమ కుటుంబాలకు ఆధారంగా ఉన్న భూములు, ఇండ్లను ప్రాజెక్టు పేరుతో తీసుకోవడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని.. అభివృద్ధి పేరుతో తమ జీవితాలను, ఆస్తులను బలిచేయడాన్ని మాత్రం సహించబోమని తేల్చిచెప్పారు. డీపీఆర్‌ను ఎందుకు పూర్తిగా బహిర్గతం చేయడం లేదు? ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ఇండ్లు, భూములపై పూర్తి వివరాలు ఎప్పుడు ఇస్తారు? బాధితుల అభిప్రాయాలకు నిజంగా విలువ ఇస్తున్నారా? డిజైన్ మార్పులతో ఎంతమంది బాధితులకు నష్టం తగ్గింది? పరిహారం, పునరావాసంపై స్పష్టమైన హామీ ఎప్పుడు ఇస్తారు? ప్రభుత్వం, అధికారులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవలం సమావేశాలు, ప్రజెంటేషన్లు, హామీలతో తమ సమస్య పరిషారం కాదని.. తమ ఆస్తులపై స్పష్టమైన హకులు, న్యాయమైన పరిహారం, పునరావాసంపై లిఖితపూర్వక భరోసా ఇచ్చిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని కోరారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో ఆస్తు లు కోల్పోయినవారికి టీడీఆర్ ఇస్తామంటున్నారు. ఆ టీడీఆర్‌ను మేం ఏం చేసుకోవాలి? దానివల్ల మా ఆస్తులకు ఉన్న విలువలో సగం కూడా పొందలేం. నా జీవిత కాలమంతా కష్టపడి ఇంటిని కొనుక్కొ న్నా.. ఇప్పుడు దాని విలువ రూ.1.30 కోట్లు ఉంది. మీరిచ్చే పరిహారం టీడీఆర్ రూపంలో ఇస్తే అందులో సగం కూడా రాదు. ప్రాజెక్టు స్వరూపం తెలియకుండా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. డీపీఆర్ బయటపెట్టిన తర్వాతనే మాతో సంప్రదించాలి.
– రాజబాబు, సిరిమల్లె లేవుట్
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ఎలాంటి అవగాహన, అంచనా లేకుండా మా ఆస్తులు తీసుకుంటామంటున్నారు. కనీసం అధికారులకైనా దానిపై కనీస అవగాహన ఉం దా? ముందు నదిని శుద్ధి చేయండి. నోటీసులు లేకుండా స్పష్టమైన ప్రకటన లేకుండా మీటింగ్ ఉంది.. రావాలి అన్నారు. ఇక్కడికి వచ్చినాక ఇంతకుముందు చెప్పిన ముచ్చట్లే చెప్తున్నారు. డీపీఆర్ ఏది అంటే సమాధానం లేదు. ఎన్ని ఇండ్లు, ఎన్ని ఆస్తులు తీసుకుంటారో వివరాలు ఇవ్వాలంటే సమాధానం లేదు.అసలు ఇంతకుముందున్న డిజైన్ ఎక్కడుందో చూపించారా? అధికారులు మమ్మల్ని మభ్యపెట్టి ఇండ్లు గుంజుకునేందుకు కుట్ర చేస్తున్నారు.
– సికిందర్, హైదర్ ఎన్క్లేవ్
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి, ఎంఆర్డీసీఎల్ అధికారులకు ఏమాత్రం అవగాహన లేదు. కేవలం రికార్డుల్లో చూపించుకునేందుకే ఇలాంటి మీటింగ్‌లు పెడుతున్నారు. డీపీఆర్ లేకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషనుఅంటూ మభ్యపెడుతున్నారు. మూసీకి ఎఫ్టీఎల్ ఏది? బఫర్‌జోన్ ఏది? అనే స్పష్టత లేదు. ఎన్ని నిర్మాణాలు, ఎంత భూమి ఎఫెక్ట్ అవుతుందో చెప్పాలంటే సమాధానం లేదు. అనధికారికంగా సమావేశం పెడతారు? ఇండ్ల మీదకు వచ్చేందుకు కుట్ర చేస్తారు. పరిహారంపైనా ఏ సమాధానం ఉండదు. ప్రాజెక్టు విషయంలో ముందు ప్రజలకు స్పష్టత ఇవ్వాలి.
– అబ్దుల్ అజీజ్, హైదర్‌గూడ