Manne Krishank | బీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేషన్ చైర్మన్, ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై మరో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకే క్రిశాంక్ నివాసం వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
క్రిశాంక్ ఇంటి తలుపులు బలవంతంగా తెరిచి లోపలికి ప్రవేశించేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసుల రాకతో విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం క్రిశాంక్ నివాసానికి చేరుకుంది. పార్టీ కార్యకర్తలు సైతం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటుండటంతో పరిస్థితి రాజకీయంగా వేడెక్కింది.
సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ @Krishank_BRS పై మరో అక్రమ కేసు పెట్టిన రేవంత్ సర్కార్!
ఉదయం 5 గంటలకే క్రిశాంక్ ఇంటి వద్ద భారీగా మోహరించి..
దౌర్జన్యంగా తలుపులు పగులగొట్టి ఇంట్లోకి చొరబడేందుకు యత్నిస్తున్న పోలీసులు.… pic.twitter.com/4997UUs8Hm— BRS Party (@BRSparty) September 18, 2026
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ హోదాలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న క్రిశాంక్‌పై సోషల్ మీడియా పోస్టుల విషయంలో గతంలోనూ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కేసు నమోదు చేయడం ద్వారా ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదు చేస్తూ పార్టీ నేతలను పదేపదే పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని విమర్శిస్తోంది.