KTR | హైదరాబాద్, జూలై 18(నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో జాబ్‌లు నింపడం లేదు కానీ రాహుల్‌గాంధీ, ఆయన సోదరుల జేబులు నింపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జాబ్ క్యాలెండర్‌కు నై.. స్కామ్ క్యాలెండర్‌కు సై అంటున్నారని విమర్శించారు. డిసెంబర్ 7తర్వాత కాంగ్రెస్ గెలిస్తే ఉద్యోగపర్వం అని నాడు చెప్పి ఇవాళ ఉన్మాద పర్వం చూపిస్తున్నారని సరూర్‌నగర్ సభ వేదికగా చురకలంటించారు.
ఉద్యోగాలు అడిగితే ఉరికించి కొడుతున్నారని, అశోక్‌నగర్ చౌరస్తాలో అందమైన కబుర్లు చెప్పి ఎక్కడ గాడిదలు కాస్తున్నారని ప్రశ్నించారు. అశోక్‌నగర్‌లో నేడు యువత శోకిస్తున్నదని, దిల్‌సుఖ్‌నగర్‌లో యువతపై లాఠీలు విరుగుతున్నాయని, సిటీ సెంట్రల్ లైబ్రరీలో దాడులు, ఉస్మానియా క్యాంపస్‌లో నిబంధనల ఉల్లంఘనలు, ఆడబిడ్డలపై అర్ధరాత్రి కేసులు పెడుతుంటే ఢిల్లీలో రాహుల్‌గాంధీ మాత్రం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని సుద్దపూస ముచ్చట్లు చెప్తున్నారని చురకలంటించారు.
రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇస్తారని, కానీ ఆయన మాత్రం రాహుల్‌గాంధీని ప్రధాని చేసేదాకా శ్రమిస్తా అంటున్నారని విమర్శించారు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ పేరిట అన్ని పత్రికల్లో యాడ్లు ఇచ్చిందని, అందులో అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారని కేటీఆర్ స్క్రీన్‌పై ప్రదర్శిస్తూ ఎండగట్టారు.
1969లో తెలంగాణ యువకుల గుండెల్లో గునపం దింపిందే కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ దుష్ట కాంగ్రెస్‌పైనే కదా తెలంగాణలో మలి దశ ఉద్యమం వచ్చిందని ఆయన గుర్తుచేశారు. వేలాది మందిని బలిగొన్న ఖూనీనికోర్లు కాంగ్రెస్ నేతలు కాదా? అని ప్రశ్నించారు. చరిత్ర చదువాలని లేకపోతే దుర్యోధనులు, దుశ్శాసనులు మళ్లీ వచ్చితామే పాండవులమని చెప్పే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు.
ఉస్మానియా, కాకతీయ పీజీ విద్యార్థులు సభకు వచ్చారని వారంతా పీహెచ్‌డీలో ‘కోటి మోసాలు-కాంగ్రెస్ నాటకాలు’ అనే సబ్జెక్టుపై థీసిస్ చేయాలని కేటీఆర్ కోరారు. అప్పుడే కాంగ్రెస్ మోసాలు దేశమంతా తెలుస్తాయని దెప్పిపొడిచారు. మాట శాశ్వతం, అధికారం శాశ్వతం కాదని ఇటీవలు పలు సందర్భాల్లో రేవంత్‌రెడ్డి అంటున్నారని, సీఎం వ్యాఖ్యలు వింటే సంప్రదాయని, సుప్పిని, సుద్దపూసినిలా సొక్కం మాటలే గుర్తుకొస్తున్నాయని కేటీఆర్ వ్యంగ్యస్ర్తాలు సంధించారు. రూ.50లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఓటుకు నోటు దొంగ నేడు నీతి గురించి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.
25వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి దగా డీఎస్సీ చేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. నాడు కేసీఆర్ పెంచిన వయో పరిమితిని ఎందుకు తగ్గించావని అడిగితే రేవంత్‌రెడ్డి నుంచి స్పందన ఉండదని మండిపడ్డారు. ఎన్నికల్లో మళ్లీ ఏదో మాయచేస్తా అనే భ్రమలో సీఎం రేవంత్ ఉన్నారని, జార్జిరెడ్డి నాడు చెప్పినట్టు ‘జీనా హైతో మర్నా సీకో.. కదం కదం పే లడ్నా సీకో’ స్ఫూర్తితో యువత రేవంత్ పాలనను అంతం చేస్తారని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ కథకు ముగింపు పలికేది విద్యార్థులేనని కేటీఆర్ హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి ైక్లెమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుందని చెప్పారు.
కొత్త జోనల్ సిస్టమ్ తేవడానికి కేసీఆర్ రెండున్నరేండ్లు కష్టపడ్డారని కేటీఆర్ గుర్తుచేశారు. మన ఉద్యోగాలు మన యువతకే రావాలని 95శాతం స్థానిక రిజర్వేషన్లు చేయాలని శాసనసభలో బిల్లు పెట్టి మోదీకి పంపారని స్పష్టంచేశారు. మోదీ మాత్రం రెండేండ్లు ఆ బిల్లును ఆలస్యం చేయడంతో స్వయంగా కేసీఆర్ వెళ్లి గైర్ ముల్కీ ఉద్యమం, ఇండ్లీ సాంబార్ గోబ్యాక్, 610 జీవో, గిర్గ్లానీ కమిషన్, 6.5 ఫార్ములాను ఆయనకు సవివరంగా చెప్పడంతో అంగీకరించారని తెలిపారు. ఈస్థాయిలో రిజర్వేషన్లు ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే ప్రభుత్వమే నేరస్తులను శిక్షించిందని తెలిపారు.
నమ్మించి మోసం చేయడంలో పీహెచ్డీ చేసిన రేవంత్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని దెప్పిపొడిచారు. నాడు నిరుద్యోగ యువతతో పోలింగ్ బూత్‌ల వద్ద ఓట్లు వేయించుకొని.. ఇవాళ ఉద్యోగాలు అడిగితే బూతులు తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 20వేల పోలీసు ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగులు ఆందోళన చేపడితే ఎండ్రిన్ తాగినా.. బావిలో దుంకినా ఇవ్వబోనని సీఎం తెగేసి చెప్తున్నారని మండిపడ్డారు. ‘కేసీఆర్ నాడు 48వేల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నీకు ఇవ్వడంలో ఉన్న ఇబ్బంది ఏంది?’ అని ప్రశ్నించారు. గ్రూప్-1 మెయిన్స్ కోసం 1:100 పిలుస్తా అని చెప్తే అదే విషయాన్ని తాము అడిగితే తిడుతున్నాడని దుయ్యబట్టారు.
తొమ్మిదిన్నరేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం 2,32,308 పోస్టులకు నియామకాలు చేపడితే.. ప్రక్రియ పూర్తిచేసి భర్తీ చేసినవి 1,60,083 ఉద్యోగాలు అని కేటీఆర్ లెక్కలతో వివరించారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు ఏమైనా సందేహాలుంటే.. రుజువు చేసే బాధ్యత తమదేనని తేల్చిచెప్పారు. నాడు నిరుద్యోగులను రెచ్చగొట్టిన మేధావులు ఉద్యోగాలు సంపాదించారని, కానీ నేడు ఉలుకూపలుకూ లేదని చురకలంటించారు. విద్యార్థుల గొంతు కోసేలా ఉన్న జీవో 29పై స్పందించడం లేదని మండిపడ్డారు. జీవో 46పైరాకేశ్రెడ్డి నాయకత్వంలో పోరాడు తున్నది బీఆర్ఎస్ మాత్రమే అని స్పష్టంచేశారు.