– పాములు పట్టడంలో నేర్పరి
బూర్గంపహాడ్, ఆగస్టు 12 : కోరలు చాచిన సర్పమైనా.. విషపూరితమైన సర్పమైనా.. ఎంతటి ప్రమాదకర సర్పమైనా సరే ఆయనకు బంధీయే. పాములు పట్టడంలో ఇతను నేర్పరి. ఎవరైనా సరే పామును పట్టుకోవాలని సమాచారం ఇస్తే చాలు… ఇట్టే అక్కడ వాలిపోతారు. వాటిని భయం, బెరుకు లేకుండా పట్టుకుని వెళ్లిపోతారు. అతనెవరో కాదు భద్రాచలం రాజీవ్‌నగర్‌కు చెందిన శ్రీనివాసశాస్త్రి. ఏపీలోని నర్సీపట్నంకు చెందిన ఈయన 20 ఏళ్లుగా భద్రాచలంలో నివాసం ఉంటూ సారపాక ఐటీసీ పీఎస్పీడీ కర్మాగారంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈయన వృత్తి బాధ్యతతో పాటు పాములు పట్టుకోవడంలోనూ నేర్పరితనం సాధించారు. 15 ఏళ్ల క్రితం తాను నివాసం ఉండే ఇంట్లోకి పాము వచ్చింది. తమ పూర్వీకుల నుండి వచ్చిన విద్యతో దానికి ఎలాంటి హాని కలగకుండా పట్టుకుని అటవీప్రాంతంలో విడిచిపెట్టారు. అప్పటి నుండి నాగుపాము, కట్లపాము, రక్తపింజరు తదితర విషపూరిత ప్రమాదకర సర్పాలతో పాటు కొండచిలువ వంటి భారీ సర్పాలను సైతం తన చేతిలో బంధించి నిర్మానుష్య అటవీప్రాంతంలో వదిలేస్తారు. పాములు పట్టుకునే క్రమంలో రెండుసార్లు ప్రమాదానికి గురైనా సొంత ఖర్చులతో బాగు చేయించుకున్నారే తప్ప ఎవరినీ కూడా ఏ రూపంలోనూ సాయం ఆశించలేదు.
శ్రీనివాస శాస్త్రి ఇప్పటి వరకు 3వేల సర్పాలను పట్టుకుని అటవీప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు. అయితే పాములు పట్టుకోవడానికి సరైన వస్తువులు లేవని ప్రభుత్వం స్పందించి పాములు పట్టుకునేందుకు స్టిక్‌తో పాటు బూట్లు, యూనిఫాం అందిస్తే ఉపయోగకరంగా ఉంటుందని శ్రీనివాసశాస్త్రి చెబుతున్నారు. శ్రీనివాసశాస్త్రిని ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం అభినందించారు.