India-China : ఇండియా-చైనాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు దేశాల సైనికులు సరిహద్దులో పరస్పరం ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని భారత సరిహద్దు ప్రాంతం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వద్ద గత నెలలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై భారత సైన్యం, ప్రభుత్వం మాత్రం అధికారికంగా స్పందించలేదు. జూలై 26న ఈ ఘటన జరిగింది. ఇండియా, చైనా బలగాలు సరిహద్దులు సాధారణ ప్యాట్రోలింగ్ నిర్వహిస్తుండగా పరస్పరం ఎదురుపడ్డారు.
అయితే, అక్కడ చైనా సైనికులు ఇంగ్లీషులో ఒక బ్యానర్ ప్రదర్శించడం ఘర్షణకు దారితీసింది. ఇలా వారం రోజులపాటు ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగినట్లు సమాచారం. తర్వాత రెండు దేశాలక చెందిన ఆర్మీ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, పరస్పరం చర్చలు జరిపారు. పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ప్రస్తుతం ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేనట్లు తెలుస్తోంది. గతంలో కూడా పలుమార్లు ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. 2017లో డోక్లాం సెక్టార్లో ఘర్షణ జరిగింది. ఆ తర్వాత చివరిసారిగా 2020 జూన్‌లో లదాఖ్ వద్ద ఇండియా-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. అప్పటి ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనా సైనికులు కూడా బోలెడంత మంది మరణించారు. కానీ, దీనిపై చైనా అధికారికంగా ప్రకటించలేదు.
మళ్లీ ఆరు సంవత్సరాల తర్వాత రెండు దేశాల మధ్య ఘర్షణ తలెత్తింది. మరోవైపు చైనా ఇటీవలి కాలంలో ఇండియాను రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌ను తన భూభాగంగా పేర్కొంటూ చైనా మ్యాప్ కూడా రూపొందించింది. అంతేకాదు.. ఇక్కడి ప్రదేశాలకు కొత్త పేర్లు పెట్టింది. కానీ, ఇండియా వీటిని ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ ఇండియాలో భాగమే అంటూ ప్రకటించింది. రెండు రోజులక్రితం కూడా ఇండియా ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.