KTR | హైదరాబాద్, జూలై 18 (నమస్తేతెలంగాణ): 70వేల ఉద్యోగాలిచ్చినట్టు నోటిఫికేషన్లతో రుజువు చేస్తే తాను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానని, అవసరమైతే రాహుల్‌గాంధీకి జై కొడుతానని సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సు సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో అభయహస్తం.. ప్రపంచంలోనే అతి పెద్ద మోసమని నిప్పులు చెరిగారు. ‘కాంగ్రెస్ నాయకుడొకడు 60వేలు ఉద్యోగాలిచ్చామంటడు.. ఇంకొకడూ 70వేలు అంటడు.. మరొకడు లక్ష అంటడు.. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను నీ ఖాతాలో వేసుకోవడానికి, క్రెడిట్ చోరీ చేయడానికి సిగ్గనిపిస్తలేదా? రేవంత్‌రెడ్డీ’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మూడేండ్ల క్రితం సరూర్‌నగర్ వేదికగా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగులకు అలవిగాని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిందని.. ఇవాళ అదే స్టేడియం వేదికగా కాంగ్రెస్‌కు ‘డెత్ డిక్లరేషన్’ రాసేందుకు యువత సిద్ధంగా ఉన్నారని తేల్చిచెప్పారు. శనివారం హైదరాబాద్ సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యువ సంగ్రామ సదస్సుకు కేటీఆర్ హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగ యువతను ఉద్దేశించి భావోద్వేగంగా ప్రసంగించారు. తెలుగు, ఇంగ్లిష్ క్యాలెండర్లు మారినా.. జాబ్ క్యాలెండర్ మాత్రం పత్తాలేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.
కొలువుల కుంభమేళా అని చెప్పి కుంభకోణాల మేళాకు తెరతీశారని దుయ్యబట్టారు. ‘రేవంత్‌రెడ్డీ.. ఇక్కడికి వేలాదిగా కదిలివచ్చిన యువత జోష్ చూస్తుంటే ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటినుంచి ఇంకో లెక్క’ అని హెచ్చరించారు. నిరుద్యోగులను నిండా ముంచిన సర్కార్‌ను యువకులంతా కలిసి కట్టగట్టి ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా సరూర్‌నగర్ గ్రౌండ్‌కు వస్తే తేల్చుకుందామని సవాల్ చేశారు. ఉస్మానియా, మహాత్మాగాంధీ, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీలు, అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, చిక్కడపల్లి, కోచింగ్ సెంటర్లు.. హాస్టళ్ల నుంచి వచ్చిన యువతకు ధన్యవాదాలు తెలిపారు.
‘పెద్దలు చెప్పినట్టు యువశక్తి శివమెత్తితే పోరాటాలు పోటెత్తుతయ్.. నవశక్తి విజృంభిస్తే విప్లవాలు విరబూస్తయ్.. యువతరం పిడికిళ్లు బిగిస్తే అధికార పీఠాలే కదిలిపోతయ్.. మీ గళాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతయ్.. మీరు కదంతొక్కితే ఉద్యమాలు ఉప్పెనలవుతయ్..’ అంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో యువత కలిసివచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఏవిధంగా స్వరాష్ట్రాన్ని సాధించుకున్నమో ప్రపంచమంతా చూసిందని గుర్తుచేశారు.
‘మన టీ హబ్‌లో పురుడు పోసుకున్న స్కైరూట్ కంపెనీ.. ఈరోజు శ్రీహరికోట నుంచి ప్రైవేట్ రాకెట్ పంపింది.. 79 ఏండ్ల భారతదేశ చరిత్రలో ఒక ప్రైవేట్ కంపెనీ రాకెట్‌ను పంపడం ఇదే మొదటిసారి’
-కేటీఆర్
ఏటా 2లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులకు ద్రోహం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకే సరూర్‌నగర్ సభ ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. 38 నెలల కింద మే 8, 2023న ఇదే నేల నుంచి దారుణమైన దగా జరిగిందని దుయ్యబట్టారు. దగాపడ్డది తెలంగాణ యువత అయితే దగా చేసింది కాంగ్రెస్ అని స్పష్టంచేశారు. ‘ఢిల్లీ నుంచి ప్రియాంక గాంధీ.. గల్లి నుంచి కల్తీ కాంగ్రెస్ నాయకులు.. హైకమాండ్ నుంచి గాంధీలు.. గాంధీభవన్‌లో దూరిన గాడ్సేలు వచ్చి యూత్ డిక్లరేషన్ పేరిట బురిడీ పత్రం విడుదల చేశారు.
60 ఏండ్లు తెలంగాణ గడ్డమీద నెత్తురు పారించిన, తెలంగాణ బిడ్డల మీద తుపాకులు ఎక్కుపెట్టి వేలాది మందిని బలిగొన్న దుర్మార్గ కాంగ్రెస్.. ఆనాడు వాగ్దానాల వరద పారించింది.. పాత కేటుగాళ్లు.. కొత్త డూప్లికేట్ గాళ్లు ఇద్దరు కలిసి తెలంగాణ యువతపై నకిలీ ప్రేమ నటిస్తూ విసిరిన వల పేరే యూత్ డిక్లరేషన్’ అంటూ తూర్పారబట్టారు. యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన 24హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆగ్రహంవ్యక్తంచేశారు.
‘రెండు లక్షల ఉద్యోగాలు వచ్చాయా? కాలేజీ ఆడపిల్లలకు స్కూటీలు అందినయా? యువతకు రూ. 10లక్షలు ఖాతాల్లో పడ్డయా? ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ అయిందా? నెలకు 4వేల నిరుద్యోగ భృతి, పదో తరగతి పాసైతే రూ.10వేలు, పన్నెండో తరగతి పాసైతే రూ.20వేలు, డిగ్రీ పాసైతే రూ.50 వేలు, పీజీ ఉత్తీర్ణులైతే లక్ష, పీహెచ్డీపూర్తిచేస్తే రూ.5లక్షలు వచ్చా యా?’ అని సభికులను ప్రశ్నించగా లేదు.. లేదు అంటూ చేతులు ఊపుతూ సమాధానాలిచ్చారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఏమొచ్చింది.. ఇంత మోసం చేసి న వాళ్లను ఏమనాలో ఆలోచించాలని కోరారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘యంగ్ జనరేషన్ చీటెడ్ బై ఓల్డ్ జాకిల్’ జిత్తులమారి ముసలినక్క కాంగ్రెస్ తెలివిగా యువతను చిత్తుచేసిందని వ్యాఖ్యానించారు.
ఇక్కడికి వచ్చింది మామూలు పిల్లలు కాదు.. ఉడుకునెత్తురుతో ఉరకలెత్తే యవతరం.. నెత్తురు మండే నవతరం.. జంగ్ సైరన్ మోగించేందుకు యంగ్ జనరేషన్ ఇక్కడికి కదిలివచ్చింది. ఉస్మానియా, మహాత్మాగాంధీ, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీలు, అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, చిక్కడపల్లి, కోచింగ్ సెంటర్లు.. హాస్టళ్ల నుంచి తరలివచ్చిన యువతకు ధన్యవాదాలు.
-కేటీఆర్
యూత్ డిక్లరేషన్ పేరిట దగా చేసిన కాంగ్రెస్‌కు డెత్ డిక్లరేషన్ రాయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘ఇక్కడి కల్తీ కాంగ్రెస్సోళ్లను నమ్మరని తెలిసి ఢిల్లీ నుంచి టూరిస్టులను తీసుకొచ్చిన్రు.. అధిష్ఠాన పుత్రుడు రాహుల్ వచ్చిండు.. అశోక్‌నగర్ చౌరస్తాలో చాయ్ తాగిండు.. బిస్కెట్లు తిన్నడు.. మనకు కొన్ని బిస్కెట్లు వేసిండు.. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరి ఉద్యోగాలు పీకేస్తే మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలిస్తా అన్నడు. ఇవ్వాళ రాహుల్‌గాంధీని అడుగుతున్నా.. నీకు తెలుగు రాదని.. తెలివిలేదని మాకు తెలుసు.. నీకు భాష రాదు.. మా బాధ తెలియదు’ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో నోటిఫికేషన్లు లేవని.. అంతా లూటిఫికేషన్లేనని దెప్పిపొడిచారు.
కాంగ్రెస్ నాయకులు ఒకరు 60 వేల ఉద్యోగాలిచ్చామంటరు..ఇంకొకరు 70 వేలు అంటరు..మరొకరు లక్ష అంటరు.. రేవంత్‌రెడ్డీ.. నేను ఒకటే అడుగుతున్నా.. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకోవడానికి, క్రెడిట్ చోరీ చేయడానికి సిగ్గనిపిస్తలేదా?
-కేటీఆర్
‘కాంగ్రెస్ పుట్టుపూర్వోత్తరాలు తెలిసినప్పటికీ చైతన్యవంతులైన మనం వారి వలలో పడి మోసపోయాం.. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌కు అధికార పీఠమొచ్చింది.. తెలంగాణ నిరుద్యోగ బిడ్డలకు బలిపీఠమెక్కే దుస్థితి వచ్చింది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నాడు గల్లీగల్లీ తిరిగి అమ్మలు, అక్కల కాళ్లు మొక్కి కేసీఆర్‌కు ఓటేయవద్దని ప్రాధేయపడుతూ ప్రచారం చేసిన నిరుద్యోగులు ఈ రోజు బాధపడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఇలాంటి వాళ్లను ఏం చేద్దాం.. రేవంత్‌రెడ్డి మాటల్లో చెప్పాలంటే బెల్ట్ ట్రీట్మెంట్ ఇద్దామా? లాగుల్లో తొండలు విడుద్దామా? గుడ్లు పీకి గోటీలాడుదామా?’ అని ప్రశ్నించారు.

పెద్దలు చెప్పినట్టు యువశక్తి శివమెత్తితే పోరాటాలు పోటెత్తుతయ్.. నవశక్తి విజృంభిస్తే విప్లవాలు విరబూస్తయ్.. యువతరం పిడికిళ్లు బిగిస్తే అధికార పీఠాలే కదిలిపోతయ్.. మీ గళాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతయ్.. మీరు కదంతొక్కితే ఉద్యమాలు ఉప్పెనలవుతయ్..
-కేటీఆర్
ఉద్యోగాలు భర్తీ చేయాలని అడిగితే సీఎం రేవంత్‌రెడ్డి ఎండ్రిన్ తాగమంటున్నరు. నిరుద్యోగులను మోసంచేసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎండ్రిన్ తాగాలి. అయినా ఆ ఎండ్రిన్ రాష్ట్రంలో దొరుకుతున్నదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఎరువులు దొరుకుతున్నయా? మీరు వ్యవసాయాన్ని పట్టించుకుంటున్నరా? ప్రాజెక్టుల నుంచి నీళ్లివ్వక, రైతుభరోసా అందివ్వక, ఎరువులు సరఫరా చేయక అక్కడ రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నరు.
కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ఇదేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ అని ముద్ర వేస్తున్నరు. బీఆర్ఎస్ మా నిరుద్యోగులు, విద్యార్థుల తరఫున పోరాడుతున్నది. అందుకే మద్దతుగా నిలుస్తున్నం. మాట తప్పిన రాహుల్‌గాంధీ.. మళ్లీ అశోక్‌నగర్‌కు రా.. మా సత్తా ఏమిటో చూపిస్తాం.
-ఆస్మా, నిరుద్యోగ జేఏసీ నాయకురాలు
మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా రెండు లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ ఇస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇంతవరకు ఇవ్వలేదు. గురుకుల వ్యవస్థ, విద్యావ్యవస్థను సర్వనాశనం చేస్తున్నడు. విద్యావ్యవస్థను బాగు చేయలేకపోతే రేవంత్ రాజీనామా చేయాలి. నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు చనిపోతున్నరు. గురుకులాల్లో విద్యార్థులు ఆరోగ్యం బాగా లేక చనిపోతున్నరు. డీఎస్సీతోపాటు గురుకుల, మాడల్ నోటిఫికేషన్ తదితరాలతో రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. రేవంత్, ప్రియాంక గాంధీతో ఇదే సరూర్‌నగర్ స్టేడియంలో ఇచ్చిన హమీలను నెరవేర్చకపోతే మిమ్మల్ని అథఃపాతాళానికి తొక్కుతం.
– భుక్యా కుమార్, బీఈడీ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే గొప్పలు చెప్పుకుంటున్నరు. 70 వేల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో నిరూపించాలి. ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని నమ్మించి మోసం చేసిన రేవంత్‌ను గద్దె దించుతాం. రాజకీయ భవిష్యత్తుకు గోరీ కడ్తం. జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగులను మోసం చేసి మా భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి తగిన బుద్ధి చెప్తం.
– సింధు, నిరుద్యోగి