కడలిలా కదిలొచ్చిన యువత
పోటెత్తిన నిరుద్యోగులు.. వెన్నుదన్నుగా నిలిచిన బీఆర్ఎస్ యువతలో భరోసా నింపిన కేటీఆర్ ప్రసంగంసర్కార్పై నిరుద్యోగ యువత గర్జించింది. కడలిలా..కదలి వచ్చి.. ధోకా చేసిన కాంగ్రెస్ సర్కార్‌ను తూర్పారబట్టింది. మూడేండ్ల కిందట సరూర్‌నగర్ సభలో యూత్ డిక్లరేషన్ పేరిట బోగస్ హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీని అదే వేదికగా ఎండగట్టింది. తండోపతండాలుగా తరలివచ్చిన నిరుద్యోగులు.. రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని నిరసన గళాన్ని వినిపించారు. శనివారం సరూర్‌నగర్‌లో రేవంత్ సర్కార్‌ను బెంబేలెత్తించేలా సాగిన యువ సంగ్రామ సదస్సులో కుంభకోణాలు కాదు కొలువులు ఇవ్వు, నోటిఫికేషన్ల జాతరేది?, రేవంత్‌ను గెలిపించి తప్పు చేశాం.. హస్తం పార్టీని చిత్తుగా ఓడిస్తాం.. తదితర ప్లకార్డులతో నిరుద్యోగులు నినదించారు. నిరుద్యోగ యువతకు మొదటి నుంచీ వెన్నుదన్నుగా నిలుస్తున్న బీఆర్ఎస్.. వారి పోరాటానికి సంఘీభావం తెలిపింది.. అండగా నిలిచింది. సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ఫూర్తిదాయక ప్రసంగం.. నిరుద్యోగులకు కొండంత భరోసా కల్పించింది.
– ఎల్బీనగర్, జూలై 18

యువత, నిరుద్యోగుల డిమాండ్ల కోసం నిర్వహించిన యువ సంగ్రామ సభకు నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. దారి పొడువునా నినాదాలే, ఫ్లకార్డులతో తమ డిమాండ్ల పరిష్కారం కోసం నినదించారు. సరూర్‌నగర్ స్టేడియం ముందు జాతీయ రహదారికి ఇరువైపులా కిలోమీటర్ వరకు వాహనాల పార్కింగ్, ఐదు ఎకరాల స్థలంలోనూ బస్సులు మొదలుకొని వాహనాల పార్కింగ్, ఇరువైపులా మాత్రమే కాకుండా రోడ్ల పక్కన దొరికిన ప్రతి ఖాళీ స్థలంలో ద్విచక్రవాహనాల పార్కింగ్తో యువతరం సంగ్రామ సభవైపే వారి లక్ష్యంగా ప్రయాణం సాగించారు. దిల్సుఖ్నగర్, చైతన్యపురి ప్రాంతాల నుంచే కాకుండా చిక్కడపల్లి, అశోక్‌నగర్, ఎస్ఆర్నగర్ తదితర ప్రాంతాల నుంచి నిరుద్యోగులు ర్యాలీలుగా సాగడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన యువతరంతో సరూర్‌నగర్ స్టేడియం నిండిపోయింది. జాతీయ రహదారి నుంచి వెల్లువలా వచ్చిన యువత, నిరుద్యోగులు, విద్యార్థులు స్డేడియంలోని మైదానంలో నిండిపోయి రోడ్డుపై వెనుక మైదానంలో నిండిపోయి కన్పించారు.
కాంగ్రెస్ డిక్లరేషన్ హామీలు అమలు కాలేదు
కంటోన్మెంట్, జూలై 18: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో సరూర్‌నగర్‌లో ప్రియాంకగాంధీ చేత విడుదల చేసిన యూత్ డిక్లరేషన్ హామీలు ఇప్పటికీ అమలు కాలేదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు. కంటోన్మెంట్ పికెట్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే యువ సంగ్రామ సభకు, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు అనిత ప్రభాకర్, నళిని కిరణ్, పాండుయాదవ్, శ్యామ్‌కుమార్, లోకనాథ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలసి శనివారం క్రిషాంక్ తరలివెళ్ల్ళారు. ర్యాలీగా బయలుదేరే ముందు యూత్ డిక్లరేషన్ ప్రతులను క్రిశాంక్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులు చించివేశారు. ఈ సందర్భంగా క్రిషాంక్ మాట్లాడుతూ యూత్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని, మూడేళ్లు కావస్తున్నా యూత్ డిక్లరేషన్‌లో పేర్కొన్న రెండు లక్షల ఉద్యోగ హామీ, 20 వేల పోలీస్ ఖాళీల భర్తీ, ఐదు లక్షల విద్యా భరోసా కార్డు, రాజీవ్ యువ వికాసం జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఓవర్సిస్ ఫెలోషిప్ అమలు చేయలేదని అన్నారు.
సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్

వెంగళరావునగర్, జూలై 18: మాజీ హోం మంత్రి, బీఆర్ఎస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డిని శ్రీనగర్ కాలనీలోని ఆమె నివాసంలో మధురానగర్ పోలీసులు శనివారం హౌస్ అరెస్ట్ చేశారు. సరూర్‌నగర్‌లో నిరుద్యోగ యువ సంగ్రామ సదస్సు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడంపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన సభకు వెళ్లకుండా అడ్డుపడడం దుర్మార్గమని ఆమె ధ్వజమెత్తారు. సభకు హైకోర్టు అనుమతిచ్చినా అడ్డుకోవడంపై పోలీసులను నిలదీశారు.
ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు యువత పోరాటం ఆగదు

మల్కాజిగిరి, జూలై 18: యువ సంగ్రామ సదస్సుకు మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ యువత సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. యువత భవిష్యత్ కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నా రు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు నిరుగొ ండ జగదీష్‌గౌడ్, శాంతి శ్రీనివాస్‌రెడ్డి, జేఏసీ వె ంకన్న, తోట నరేందర్‌రెడ్డి, హన్మంతరావు, అనిల్‌కిశోర్, మేకల రాము, అమీనుద్దీన్ ఉన్నారు.
కేటీఆర్ రాకతో ఉర్రూతలూగిన యువత..
సరూర్‌నగర్ స్టేడియం ప్రాంగణంలో నిరుద్యోగులు నిండిపోవడంతో ఉదయం పదకొండు గంటల నుంచే పలువురు నిరుద్యోగులు, యువతరం స్పీచ్‌లతో మార్మోగింది. తమకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో ఎండగట్టారు. ప్రభుత్వ తీరుతో తామంతా ఎంత ఇబ్బందులు పడుతున్న వైనంపై వారంతా తమ ప్రసంగాల్లో చెబుతుంటే.. నిరుద్యోగులు ఒక్కసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సభా ప్రాంగణంలోకి రాగానే యువత ఒక్కసారిగా కేకలు, కేరింతలతో ఆయనకు స్వాగతం పలికారు. కేటీఆర్ వేదికపైకి వచ్చిన అనంతరం వెంటనే యువత వైపు ఉన్న ర్యాంపు ద్వారా వారి వద్దకు వస్తూ అభివాదం చేస్తూ.. రాగా కేటీఆర్‌తో కరచాలనం చేసేందుకు యువత ఉత్సాహం చూపారు. కొందరు కేటీఆర్‌కు కండువాను కూడా కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
భవిష్యత్తు సీఎం అంటూ.. నినాదాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేసేందుకు నిర్వహించిన యువ సంగ్రామ సభలో కేటీఆర్ ప్రతి అంశంపై కులంకషంగా ప్రసంగించారు. అశోక్‌నగర్‌లో రాహుల్ గాంధీ చెప్పిన హామీలు, ఇదే సరూర్‌నగర్ స్టేడియంలో ప్రియాంకగాంధీ చెప్పిన మాటలు, రేవంత్ రెడ్డి ఎన్నికలు ముందు ఇచ్చిన వాగ్ధానాలు, వారి మోసాన్ని తన ప్రసంగంలో ఎండగట్టారు. ఏడాదికి రెండు లక్షలు ఉద్యోగాలు అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్‌ను బండకు కొట్టేందుకు యువతతో పాటుగా వారి తల్లిదండ్రులు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ అండగా ఉంటుందనిహామీ ఇచ్చారు. కేటీఆర్ తన ప్రసంగం ముగించి వేదిక నుంచి వెళ్తున్న క్రమంలో పలువురు యువకులు భవిష్యత్ సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు.
కాంగ్రెస్‌పై ఆగ్రహించిన యువ సంగ్రామ సభ
ఎల్బీనగర్లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించిన యువ సంగ్రామ సభ కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ అక్కసును, ఆగ్రహాన్ని వెలిబుచ్చేలా సాగింది. వేదికపై నాయకులు కాకుండా నిరుద్యోగ జేఏసీ నాయకులు, దిల్సుఖ్నగర్, అశోక్‌నగర్‌తో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువతతోనే మాట్లాడించారు. ఈ క్రమంలో యువతరం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతూ తమకు కాంగ్రెస్ చేసిన అన్యాయాలపై గళం విప్పారు. వారి ఘాటైన ప్రసంగాలతో సభా ప్రాంగణం అట్టుడికింది.
యువతరాన్ని అలరించి..
సభకు తరలి వస్తున్న యువతరాన్ని అలరిస్తూ కూకట్‌పల్లికి చెందిన సుఖాజీ పాటలకు అనుగుణంగా లయబద్ధంగా నృత్యం చేస్తూ కన్పించారు. సరూర్‌నగర్ స్టేడియం ప్రధాన గేట్ వద్ద రోడ్డుకు ఓ పక్కన ముఖానికి రంగులు వేసుకుని నిలబడి పాత పాటలకు అనుగుణంగా హావభావాలతో నటిస్తూ, నృత్యం చేస్తూ వచ్చిన వారిని ఆకట్టుకున్నారు. అదే రీతిలో జవహర్‌నగర్‌కు చెందిన కేతమ్మ తనదైన శైలిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, విరుచుకుపడ్డారు.
రేవంత్ నమ్మకద్రోహం
యువ సంగ్రామ సదస్సులో నిరుద్యోగ యువత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగులకు చేసిన నమ్మకద్రోహాన్ని ఎండగట్టారు. ఇదే సరూర్‌నగర్‌లో సభ పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్‌ను వెంటనే అమలు చేయాలని కోరితే నిరుద్యోగులను ఎండ్రిన్ తాగాలని అంటారా? అని ప్రశ్నించారు. యూత్ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీని అమలు చేయనందుకు సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఎండ్రిన్ తాగాలని నిరుద్యోగులు ధ్వజ మెత్తారు. నమ్మకద్రోహం చేసిన కాంగ్రెస్ ఓటమిని చూసేదాకా పోరాడుతామని హెచ్చరించారు.
ఉద్యోగాలిస్తామని మోసం: నవీన్ పట్నాయక్
కేసీఆర్ ఉద్యోగం ఊడకొడితే మీకు ఉద్యోగాలు ఇస్తామంటూ కాంగ్రెస్ నమ్మబలికి మమ్మల్ని ఎన్నికల్లో ముడిసరుకులుగా వాడుకున్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ చేపట్టిన ఉద్యోగాలు 1.60 లక్షలు. చివరి దశలో 47,503 ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఏస్సే, కాంగ్రెస్ 60 వేలు ఉద్యోగాలు అని చెబుతున్నారు.. అది సరికాదు. కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ ఇచ్చింది. పోలీస్ విభాగంలో 19 వేల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని పోలీస్ అధికారులు అం టుంటే కేవలం 5 వేల పోలీస్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం అన్యాయం. సర్కార్‌పై మరో పోరాటానికి సిద్ధమవుతున్నాం.