భూత్పూర్, మార్చి 28: సహకార సంఘాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని భూత్పూర్ మండల సింగల్ విండో చైర్మన్ కదిరి అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాలు అభివృద్ధి చెందితేనే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని, అప్పుడే సంఘాలు కొత్త రైతులకు రుణాలను ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు.
సర్వసభ్య సమావేశంలో పాలకమండలి సభ్యులు మాట్లాడుతూ.. మన సంఘంలో మొత్తం 86 మంది రైతులు రుణాలను తీసుకుంటే, కేవలం 52 మందికి మాత్రమే రుణమాఫీ వర్తించిందని, మిగిలిన వారు రైతులు కాదా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ఎజెండాలో కౌలు రైతులకు కూడా రుణమాఫీ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ విషయంపై ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. దీనిపై సభ ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని సూచించింది. వరి కొనుగోలు విషయంలో ప్రభుత్వం మహిళా సంఘాలకు ప్రాధాన్యతను ఇస్తూ ప్రత్యేకంగా మహిళా సంఘాలకు కొన్ని గ్రామాలను కేటాయిస్తున్నారు. మహిళా సంఘాలకు వరి కొనుగోలు కేంద్రాలు ఇస్తే వాటి నుంచి వచ్చే ఆదాయం కేవలం మహిళా సంఘాలకే సొంతం అవుతుంది. ఇది కొంతమందికి మాత్రమే మేలు జరిగే అవకాశం ఉందని సభ్యులు ఇలా కాకుండా సహకార సంఘాలకు మండల మొత్తం అవకాశం ఇవ్వాలని కోరారు. సహకార సంఘాలకు ఆదాయం వస్తే ఇంకా ఎక్కువమంది రైతులకు రుణాలను ఇచ్చేందుకు ఆస్కారం ఉందని వారు సూచించారు. ఈ విషయం పట్ల ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.
అనంతరం రైతులు మాట్లాడుతూ.. సింగిల్ విండోల ద్వారా కేవలం యూరియా మాత్రమే కాకుండా నేడు మార్కెట్లో ఎన్నో కొత్త రకం విత్తనాలు వస్తున్నాయి. ఈ విత్తనాల పట్ల రైతులకు అవగాహన కల్పించి నూతన సేద్యం చేసేందుకు సహకరించాలని రైతులు సూచించారు. అనంతరం సింగిల్ విండో చైర్మన్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో కొత్త సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉన్నందున భూత్పూర్ మండలంలో కొత్త సహకార సంఘాన్ని పాత మొల్గర గ్రామంలో ఏర్పాటు అవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈవో రత్నయ్య, మాజీ సింగల్ విండో చైర్మన్ సత్తూర్ బస్వరాజు గౌడ్, మాజీ సర్పంచ్ సత్తూర్ నారాయణ గౌడ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి,సింగిల్ విండో వైస్ చైర్మన్ శ్రీనివాసులు, పాలకమండలి సభ్యులు గడ్డం రాములు, యాదయ్య, శేఖర్ రెడ్డి, రామ్ రెడ్డి, ఆశన్న, బీఆర్ఎస్ నాయకులు మురళీధర్ గౌడ్, అశోక్ గౌడ్ రైతులు తదితరులు పాల్గొన్నారు