‘మేము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తాం.. పాత కాలం నాటి పట్వారీ, పటేళ్ల వ్యవస్థను తీసుకొస్తాం.. రెవెన్యూ రికార్డుల్లో పాత కాలంనాటి పట్టేదారు.. మన్యందారు కాలాలు చేరుస్తాం’.. అంటూ కాంగ్రెస్ రాష్ట్ర నేతలు చేస్తున్న ప్రకటనలపై రైతులు భగ్గుమంటున్నారు. పహాణీల కాలమొస్తే మళ్లీ ఎన్కటి కష్టాలు తప్పవని కన్నె ర్ర చేస్తున్నారు. తెలంగాణ ప్రభు త్వం తీసుకొచ్చిన రెవెన్యూ సంస్కరణలు ఆగిపోయే ప్రమాదం ఉ న్నదని.. అక్రమ రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఏర్పడే అవకాశం ఉన్నదని ఆందోళన చెందుతున్నారు. హస్తం పార్టీ పాలన మాకొద్దు.. కేసీఆర్ ప్రభుత్వమే కావాలి.. ధరణి పోర్టల్ ఉండాలని కర్షకులకు జై కొడుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూములను ఖతం పట్టిస్తరు. రేవంత్‌రెడ్డి మాటలు చూస్తుంటే ఎప్పుడు అధికారంలోకి రావాలె.. భూములను ఎప్పుడు మింగాలే అని అన్నట్టుంది. సీఎం కేసీఆర్ ముందు చూపుతో ధరణిని అమల్లోకి తెచ్చి ఎవరి భూములు వారికి భద్రం చేసిండు. తెలంగాణ రాక ముందు భూములు అమ్మాలన్నా.. కొన్నాలన్నా.. పది మందితో కలిసి నారాయణపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు పోయి పట్టా చేయించేటోళ్లం. ఖర్చులు భారీగా అయ్యేవి. లంచం ఇవ్వాల్సి వచ్చేది. అయినా ఒక్కోసారి పని అయ్యేది కాదు. రోజుల తరబడి తిరిగేటోళ్లం. రైతుకు రిజిస్ట్రేషన్ ఖర్చు మాత్రమే కాకుండా.. రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వెంట వచ్చినోళుల తిని తాగనింకెనే అయిపోయేటివి. ఇప్పుడు ఆ బాధ తప్పింది. ధరణితో తరతరాల వరకు భూములను భద్రంగా ఉంచుకోవచ్చు. కాంగ్రెస్ పరిపాలనను ఎప్పటి నుంచో చూసినం. రైతుకు గానీ పేదోడికి గానీ చేసిందేమీలేదు. నేనే కాదు.. ఊరోళ్లు సైతం బాజాప్త కారు గుర్తుకే ఓటేస్తరు.
మా అమ్మమ్మ వాళ్ల ఊరు కోస్గి మండలంలోని హన్మన్పల్లి. మా అమ్మకు 2.30 ఎకరాలను వాళ్ల నాయన 30 ఏండ్ల కిందట ఇచ్చారు. అయితే, పొలం ఉంటది, ఎక్కడికి పోతదని అనుకున్నాం. 2019లో వెళ్లి మండల కార్యాలయంలో పొలం చూసుకుంటే అందులో నుంచి 239 సర్వే నంబర్లో ఉన్న 2.30 ఎకరాలకు గానూ 1.03 ఎకరాల పొలం లేదు. అధికారులను అడిగితే మీ నాయిన పొలం అమ్ముకున్నాడని చెబుతున్నారు. అలా రికార్డుల్లో కూడా నమోదు చేశారు. నిజానికి మా నాయన పొలం అమ్మలేదు. పట్వారీ వ్యవస్థ ఉన్నందుకే మా ప్రమేయం లేకుండా 1.03 ఎకరాల పొలాన్ని రికార్డుల్లో మార్చారు. దీనిపై ఎన్ని సార్లు మండల కార్యాలయానికి వెళ్లినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ అప్పుడే ఉండిఉంటే మాకు అన్యాయం జరిగేది కాదు. ధరణి విధానం చాలా బాగున్నది. ఈ విధానాన్ని ఎత్తివేయాలని కాంగ్రెసోళ్లు ఆలోచన చేస్తున్నారు. వారికి అసలు ధమాక్ ఉందో లేదో తెలియదు. కాంగ్రెస్‌లో ఉన్నోళ్లంతా దళారులే కాబట్టి పట్టాదారులను, రైతులను మోసం చేసేందుకు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయమాటలకు రైతులు, పట్టాదారులు మోసపోవద్దు. నా మాదిరిగా ఎవ్వరూ నష్టపోకండి.
ధరణిని తీసేస్తే పట్వారీ వ్యవస్థ వస్తుంది. ఆ వ్యవస్థ కానీ వస్తే రైతుల భూ రికార్డులు మార్చి రైతులను నిలువునా ముంచుతారు. ధరణి వచ్చాకే మా భూములకు రక్షణ ఏర్పడింది. మా భూములు ఎక్కడ ఉన్నాయి. ఎంత ఉన్నాయో తెలుస్తుంది. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా నేరుగా మీ సేవకు పోయి మాకు కావాల్సిన పత్రాలు ఐదు నిమిషాల్లో తీసుకుంటున్నాం. పాత పద్ధతి వస్తే పట్వారీలకు పైసలిచ్చి రోజుల తరబడి తిరిగినా.. అవసరమున్న పత్రాలు ఇవ్వరు. పని ఇడిసిపెట్టుకొని రోజుల తరబడి తిరగలేం. రేవంత్‌రెడ్డిది చెత్త ఆలోచన. రైతులు బాగుండడం ఆయనకు ఇష్టంలేదు. రైతులను కష్టపెట్టాలని చూస్తున్నారు. మండలంలోనే భూముల రిజిస్ట్రేషన్ 15 నిమిషాల్లో అవుతుంది. పట్టా పాస్‌బుక్కులు కూడా నేరుగా ఇంటికే వస్తున్నాయి. కాంగ్రెస్ వస్తే మళ్లీ కష్టాలు మొదటికి వస్తాయి. కాంగ్రెస్ వద్దు.. వాళ్ల భూ మాత వద్దు.. ధరణియే ముద్దు..
తెలంగాణలో ధరణి తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం విడ్డూరం. ధరణి పోర్టల్ తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వచ్చే ప్రమాదం ఉన్నది. పటేల్, పట్వారీ వ్యవస్థతో నాలాంటి పేద రైతులకు ఇబ్బందులు తప్పవు. సీఎం కేసీఆర్ నిరుపేద రైతుల కోసం ఎంతో ముందు చూపుతో ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారు. దీంతో రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. భూ యజమాని ప్రమేయం లేకుండా ఎలాంటి భూ లావాదేవీలు చేయడానికి వీలు లేదు. ఐదు నిమిషాల్లో భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతున్నాయి. గతంలో నా భూమి ఆన్లైన్ చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూమి ఆన్లైన్ చేయాలంటే నానా అవస్థలు పడేవాళ్లం. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మ్యుటేషన్ కోసం చెప్పులరిగేలా తాసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పని జరిగేది కాదు. డబ్బులిచ్చి రెవెన్యూ అధికారులను వేడుకున్నా ఏండ్ల తరబడి ఫైలు కదలకపోయేది. ఇప్పుడు ఎవరికీ లంచం ఇవ్వాల్సిన పనిలేదు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వేలిముద్రతో పని పూర్తవుతుంది. గతంలో అవినీతి అక్రమాలను పెంచి పోషించిన కాంగ్రెస్ నాయకులు మళ్లీ దళారీ రాజ్యానికి ఆజ్యం పోయాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధరణి పోర్టల్ ఉండాల్సిందే. మళ్లీ సీఎంగా కేసీఆర్‌ను గెలిపించుకోవాల్సిందే.
ప్రశ్న : ధరణి పోర్టల్ కావాలా..? భూమాత కావాలా? ధరణితో ఎలాంటి ప్రయోజనమున్నది?
రైతు : ధరణి పోర్టల్‌తో రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి పూర్తి తగ్గింది. ఇదివరకు భూములకు సంబంధించిన రికార్డుల కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. వివరాలు తెలుసుకునేందుకు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సర్వేనెంబర్లు తెలిసేవి కావు. సరైన మ్యుటేషన్స్ లేకపోవడంతో రికార్డులు తారుమారయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సారు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. రికార్డులన్నింటినీ ఆన్లైన్లో భద్రపరిచారు. ధరణి వల్ల ఒక్క రైతులకే కాదు.. అన్ని వర్గాల వారికి ఎంతో మేలు జరుగుతున్నది.
ప్రశ్న: ధరణిని తొలగించి టీపీసీసీ అధ్యక్షుడు భూమాత పోర్టల్‌ను తెస్తామని అంటున్నారు? దీనిపై మీరు ఏమంటారు?
రైతు : ధరణి పోర్టల్ ఉండాలి. అది తీసివేస్తే సమస్యలన్నీ చుట్టుముడుతాయి. గ్రామాల్లో భూములకు సంబంధించి వివాదాలు ఏర్పడుతాయి. ఒకరి భూమిలో మరొకరు సాగుచేస్తారు. కబ్జాదారులు పుట్టకొస్తారు. మళ్లీ పట్వారీ వ్యవస్థను తెచ్చి పెడతారు. గ్రామంలో పట్వారీలు చెప్పిందే వేదం అవుతుంది. వినకపోతే తమ భూముల్లో వేలు పెడుతారు. అప్పుడు ఏ కొంచెం తేడా వచ్చినా రికార్డులు సరిచేసుకోవడానికి అధికారులకు లంచాలు ఇవ్వాలి. ధరణి వచ్చిన తర్వాత ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. మన భూముల రికార్డులు మనమే ధరణి పోర్టల్‌కు వెళ్లి చూసుకోవచ్చు. ఇదే విధానం బాగుంది.
కంపూటర్ల ధరణిలో భూమి ఆన్లైన్ చేసినందుకు భద్రంగా ఉంది. ఒక్క గుంట కూడా తేడా రాలేదు. ఎప్పటికప్పుడు కంప్యూటర్ల ఎక్కించి పాలుభాగాలు పంచి ఇస్తే అందరికీ సరిగ్గా భూమి వచ్చింది. రైతుబంధు గిట్ల అందరికీ వస్తుంది. అదే పాత పద్ధతైతే రికార్డుల్లో పేర్లు మార్చనింకె ఎన్ని నెలలు తిరుగుతుంటిమో. లెక్కలు సరిగ్గా చేయకుండా ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ భూమి ఇచ్చి పట్వారీలు ఆడిందే ఆట.. పాడిందే పాట.. ఇప్పుడా పరిస్థితి లేకుండాపోయింది. ఆన్లైన్లో భూమి భద్రంగా ఉంటుంది. మనకి తెల్వకుండా ఏమీ చేయనింకె లేకుండా పోయింది. లేకపోతే ఎవరు చెబితే వాళ్లు ఇష్టమొచ్చినట్లు రికార్డుల్లో పేర్లుమార్చి ఊకె సతాయించి పైసలు తింటుండ్రి. పైరవీకార్లకు, పట్వారీకి, ఆఫీసర్లకు ఎన్ని పైసలిచ్చినా పట్టా బుక్కు రాకుండె. ఇప్పుడు ఒక వేలిముద్ర పెడితే చాలు గంటలోపే మన పేరుమీద భూమి మారిపోతుంది. ఇంటికాడికి పట్టా పుస్తకం వస్తుంది. అప్పట్ల ఆ పాసు పుస్తకం ఇయ్యనింకె కూడా లంచం ఇయాల్సి ఉంటుండె. సీఎం కేసీఆర్ పుణ్యంతో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్‌తో మంచిగుంటున్నం. కరెక్ట్ టైమ్‌కు పెట్టుబడి సాయం పడుతుంది. ధరణి గిట్ల తీసేస్తే మళ్ల పటేల్, పట్వారీల దోపిడీ వ్యవస్థ వచ్చి పడ్తది. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితిలో కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముతో భూములు కొనుక్కున్నోళ్లు ఆగమైపోతారు. వయసై పోయి ఎవుసం చేయలేని వాళ్లు భూమిని కౌలుకు ఇస్తారు. కౌలుదార్ల పేరిట రికార్డులకి ఎక్కిస్తే ఆ భూమికి ఓనర్ ఎవ్వరైతరు. కాంగ్రెస్సోళ్ల మాటలు వింటే అస్సలు రైతులకు రైతుబంధు తీసేసి కౌలు రైతులకు పైసలిస్తరు. రైతులు, కౌలురైతులు ఎప్పుడు కొట్లాడుకుంటా ఆఫీసుల చుట్టూ పంచాయితీలకు తిరగాల్సి ఉంటది. అప్పట్ల ఐదేండ్లకోసారి కూడా రికార్డులు చూసుకునేటోళ్లం కాదు. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మీసేవకు పోయి భూమికి సంబంధించిన మొత్తం వివరం తెల్సుకోవచ్చు. ధరణితో ఎలాంటి సమస్యల్లేవు. కబ్జా కాలం కూడా లేదు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తీసుకొచ్చిన ధరణి రైతుల పాలిట వరం. రైతులందరూ ఆలోచించి ఈసారి కూడా కేసీఆర్ సార్నే గెలిపియ్యాలె. అప్పుడే రైతులు బాగుంటారు.
తెలంగాణ వచ్చినంక కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులకు భూములపై ధైర్యం వచ్చింది. గతంలో ఉన్న వీఆర్వో వ్యవస్థ వల్ల భూ రికార్డులు మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే మస్తు ఇబ్బందులు పడేటోళ్లం. రిజిస్ర్టేషన్ సమయంల రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఆఫీసులల్ల ప్రతి ఫైల్‌కు అంతో ఇంతో ముట్టజెప్పకుంటే పని కాకుండె. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు డాక్యుమెంట్ రైటర్లకు, ఆఫీస్‌ల మామూళ్లు ఇయ్యాల్సిందే. ధరణి వచ్చినంక స్లాట్ బుక్ చేసుకుని నేరుగా తాసీల్దార్ కాడికి పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నం. ఇప్పుడు ఎవరికి రూపాయి ఇయ్యాల్సిన పనిలేదు. రిజిస్ట్రేషన్ అయినంక ఇదివరకే పాస్ బుక్ ఉంటే వెంటనే ఎంట్రీ చేసి ఇస్తున్నరు. కొత్తదైతే 15 రోజులళ్ల నేరుగా ఇంటికొస్తుంది. పైరవీకారుల బెడద తప్పింది. లంచం ఇయ్యాల్సిన పని కూడా లేదు. రైతు వేలిముద్ర లేకుంటే మన భూమి మారే ఆస్కారమే లేదు. తాసీల్దార్, కలెక్టర్ కూడా యజమాని అనుమతి లేకుండా భూమికి సంబంధించి మార్పులు చేయలేరు. పూర్తి హక్కులు రైతులకొచ్చినయ్. కాంగ్రెసోళ్లు ధరణిపై అవగాహన లేక ఏవేవో మాట్లాడుతున్నరు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతమంటున్నరు. ముందు ఆ పార్టీనే బంగాళాఖాతంలో కలుపుదాం. ధరణితోనే భూ రికార్డులు పదిలం. ఎవరు ఏమన్నా ధరణి మంచిగుంది. రేవంత్‌రెడ్డి వద్దు.. భూ మాత వద్దు.. మూడు గంటల కరెంట్ వద్దు.. రేవంత్ నీకో దండం.. మీ పార్టీకో దండం.. మాకు ధరణినే ముద్దు.. ధరణి ఉంటేనే మా భూములకు రక్ష. మాకోసం ఎంతగానో ఆలోచిస్తున్న సీఎం కేసీఆర్ సార్ వెంటే మేమంతా ఉంటాం.