ఊటూర్, ఆగస్టు 3 : సీఎం సొంత జిల్లాలో భూ నిర్వాసితుల నిరసనలు మిన్నంటుతున్నాయి. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల నిరసనలతో జిల్లా అట్టుడుకుతున్నది. ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న తమకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ గత నెల రోజులుగా భూ నిర్వాసితులు తమ నిరసనల గళం వినిపిస్తున్నారు.
భూ నిర్వాసిత రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆదివారం ఊటూ ర్ మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రైతుల నిరసనకు స్థానిక అఖిలపక్ష పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ అరవింద్ కుమార్‌తోపాటు వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ మక్తల్ ప్రాంత రైతుల పొట్ట కొట్టి సీఎం రేవంత్‌రెడ్డి తన స్వంత నియోజకవర్గం కొడంగల్‌కు ఎట్లాగైన సరే.. సాగునీటిని తరలించాలనే కుట్రలో భాగంగానే నిర్వాసితుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.
ఓ పక భూ నిర్వాసితులు నిరసనలు చేస్తుంటే మం త్రి వాకిటి శ్రీహరి చెకులను పంపిణీ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. భూ నిర్వాసితులకు సరైన న్యాయం అందించి మంత్రి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ చేశారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని నిర్బంధాల ను విధించిన భూ నిర్వాసితులకు సరైన పరిహారం అందే వరకు వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
భూ నిర్వాసితుల జిల్లా కమి టీ సభ్యులు ధర్మరాజుగౌడ్, గోపాల్‌రెడ్డి, మశ్చేంద ర్ మాట్లాడుతూ.. తమ తాతలు, ముత్తాతలు అప్పు, సప్పుచేసి కాపాడుకున్న కోట్ల విలువ చేసే భూములను ప్రభుత్వం ఎకరాకు రూ. 14లక్షల పరిహారం అందించి చేతులు దులుపుకుం టోం దని, తమ భూములు ప్రైవేటు మారెట్లో ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల ధర పలుకుతున్నాయని, ప్రభుత్వం బలవంతపు భూసేకరణను తక్షణమే నిలిపి సరైన పరిహారం అందించేందుకు ప్రత్యేక కమిషన్‌ను నియమించాలని డి మాండ్ చేశారు.
భూ నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రభుత్వం దిగిరాని పక్షంలో తమ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రాస్తారోకో చేపట్టిన రైతులకు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాస్తారోకోతో మక్తల్, నారాయణపేట పట్టణాల వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, వాహనాలు గంట పాటు బారులు తీరి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ప్రభు త్వం తక్షణమే దిగివచ్చి నిర్వాసితులకు సరైన నష్టపరిహారం అందించాలని, లేనిపక్షంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బాల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు దొబ్బ లి హనుమంతు, కిరణ్‌కుమార్, బీఆర్ఎస్ మం డల యువజన అధ్యక్షుడు ఆనంద్‌రెడ్డి, విద్యార్థి విభా గం జిల్లా అధ్యక్షుడు కోరం శివారెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు ఆశప్ప, కృష్ణయ్యగౌడ్, రఘువీర్, రైతు లు సురేందర్‌రెడ్డి, తరుణ్, అనిల్, రాఘవేందర్ గౌడ్, సంజప్ప, షేక్షమీ పాల్గొన్నారు.
మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం
నారాయణపేట, ఆగస్టు 3 : పేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు భూ నిర్వాసితుల పట్ల ప్రభు త్వం మొండిగా వ్యవహరిస్తుందని భూ నిర్వాసితుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రాం విమర్శించారు. భూ నిర్వాసితులకు బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని కోరు తూ ఆదివారం పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద భూ నిర్వాసితులతో కలిసి రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 రోజులుగా భూ నిర్వాసితులు రిలే దీక్షలు చేస్తున్నా, కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించినా ప్రభుత్వం భూ నిర్వాసితుల పట్ల మొండిగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ప్రభుత్వం ఇస్తామన్న ఎకరాకు రూ.14లక్షలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రాజెక్టుకు భూ ము లు ఇస్తున్న నిర్వాసితులను అన్యాయం చేయవద్దన్నారు. వారిని కన్నీళ్లకు గురిచేసి శాశ్వత వలసదారులుగా చేయరాదన్నారు. 2013 చట్టాన్ని అమలు చేసి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో పేరపళ్ల, సింగారం గ్రామాలకు చెందిన భూ నిర్వాసితులు ఆంజనేయులు, హన్మంతు, సత్యనారాయణగౌడ్, నరహరితోపాటు రైతులు పాల్గొన్నారు.