గద్వాల, డిసెంబర్ 24 : ‘పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదు.. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. పీఆర్ఎల్ఐలో ఒక్క కాల్వ కూడా తీయలేదని చెప్పడం విడ్డూరంగా ఉంది.. దాదాపు 80 నుంచి 90 శాతం పనులు పూర్తయ్యాయి’.. అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ నేత హనుమంతు నాయుడు నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ బాధ్యతగల వ్యక్తి అని.. అలాంటి నేత పాలమూరుపై అవాక్కులు.. చెవాక్కులు పేలడం సరికాదన్నారు.
అసలు ప్రాజెక్టులో కాల్వలు తవ్వనప్పుడు ఒక రిజర్వాయర్ నుంచి మరో రిజర్వాయర్‌కు నీళ్లు ఎలా పారుతాయని ప్రశ్నించారు. లక్ష్మీదేవిపల్లి వద్ద మినహాయిస్తే అన్ని రిజర్వాయర్లు పూర్తయ్యాయని, కాల్వల ద్వారానే వీటికి నీరు పారుతదన్న విషయాన్ని మంత్రి గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లు అవుతున్నా మిగిలిన వాటిపై దృష్టి సారించడం లేదని మండిపడ్డారు. రేవంత్ సర్కారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
మీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ ప్రాజెక్టు చేపట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసీలో చనిపోయిన వారి శవాలను నేటికీ బయటకు తీయలేని దద్దమ్మ ప్రభుత్వం మీదన్నారు. మీరు మమ్మల్ని విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. హెలికాప్టర్ లేకపోతే పర్యవేక్షణకు రాని చేతకాని వారు మీరన్నారు. 14 నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ తరపున అందరం వస్తాం.. మీరు పాదయాత్ర ద్వారా వస్తారా? లేక కార్లల్లో వస్తారో? పోదాం.. ప్రాజెక్టు పనులను శ్రీశైలం నుంచి పాలమూరు వరకు పరిశీలిద్దామన్నారు. 90 శాతం వర్క్స్ పూర్తి కాలేదని అధికారులు కానీ.. ప్రజలతో కానీ చెప్పిస్తే.. మేము దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.
జూరాల నుంచి కల్వకుర్తి, నెట్టెపాడ్, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండవనే ఉదేఏ్దశంతోనే శ్రీశైలం నుంచి పాలమూరుకు నీటిని తీసుకుంటున్నట్లు తెలిపారు. కాళేశ్వరం పిల్లర్లను కాంగ్రెస్సే ధ్వంసం చేసి కుంగిపోయిందంటూ కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు. కుంగిన పిల్లర్‌ను మీరు బాగు చేయరు? కాంట్రాక్టర్ చేస్తానంటే చేయించరు.. ఇదెకక్కడి చోద్యం అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి ఇష్టారీతిగా మాట్లాడితే ప్రజలు సహించరన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో ముందుగా రాజీనామా చేయించి ఎన్నికలు నిర్వహించి మీ బలం ఏమిటో నిరూపించుకోవాలని సూచించారు. సీఎం తన భాష మార్చుకుంటే బాగుంటది.. అంతేగానీ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నేతను అగౌరవపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
రెండేండ్లలో మీరు ప్రాజెక్టుల విషయంలో ఒరగబెట్టిందేమీ లేదన్నారు. పాలమూరు నీటి వాటా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ 45 టీఎంసీలు అంగీకరించమని, 90 టీఎంసీల నీటి వాటా అయితే ఒప్పుకొంటామన్నారు. సుష్మాస్వరాజ్ నాడు పాలమూరు పర్యటనకు వచ్చినప్పుడు నీటి వాటాల విషయంలో పాలమూరుకు అన్యాయం జరిగిందని చెప్పారని, ఈ విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు. పాలమూరు ప్రాజెక్టుకు బీజేపీ జాతీయ హోదా కల్పిస్తామని చెప్పి ఇప్పుడేమో ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు.
ఇప్పటికైనా జాతీయ హోదా కల్పించేందుకు కృషి చేయాలన్నారు. గద్వాల ప్రాజెక్టుల విషయం మాట్లాడుతూ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కాల్వలో ఒక్క చెట్టు కూడా తీయలేదు.. ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి వేయలేదని విమర్శించారు. గట్టు లిఫ్ట్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పనులే తప్పా.. మీరు చేసిందేమీ లేదన్నారు. గట్టు లిఫ్ట్ పనుల్లో మీ వాటా ఎంత పనులు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ర్యాలంపాడ్ రిజర్వాయర్ లీకేజీలను సరి చేయకపోవడంతో 4 టీఎంసీలు నిల్వ ఉండాల్సిన రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1.5 టీఎంసీలే ఉన్నాయన్నారు. దీంతో చివరి ఆయకట్టుకు నీళ్లు అందకయ రైతులు ఆందోళన చేసిన సంగతులు మరిచారా? అని ప్రశ్నించారు. తుమ్మిళ్ల ప్రాజెక్టుల్లో 80 శాతం పనులు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగాయన్నారు.
మీరు 20 శాతం పనులు చేయలేక పోయారని మండిపడ్డారు. నెట్టెంపాడ్ ప్రాజెక్టు పరిధిలోని 99, 107 ప్యాకేజీ పనులు పూర్తి చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటికి మీరు తట్టెడు మట్టి వేశారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గట్టు, తుమ్మిళ్లను పూర్తి చేసింది కేసీఆర్ అని తెలిపారు. నడిగడ్డలో ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రం మొత్తం అలాగే ఉందన్నారు. గతంలో ఇక్కడి ప్రజలు ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లేవారని, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వలసలు తిరుగుముఖం పట్టాయని గుర్తు చేశారు. అంతకు ముందు గుండెపోటుతో మృతి చెందిన గద్వాల మాజీ ఎంపీపీ ప్రతాప్‌గౌడ్ కుటుంబాన్ని శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు చక్రధర్‌రావు, రాజారెడ్డి, మోనేశ్, శ్రీరాములు, శేఖర్, వెంకటేశ్ నాయుడు, కోటేశ్ తదితరులు పాల్గొన్నారు.