CM KCR | తెలంగాణ సంక్షేమ సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్‌కర్నూల్‌కు రానున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా రూ.52కోట్లతో నిర్మించిన ఆధునిక సమీకృత కలెక్టరేట్, శ్వేత సౌధాన్ని తలపించేలా రూ.35 కోట్లతో చేపట్టిన పోలీస్ భవన సముదాయం, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం మంగళవారం ప్రారంభించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహణకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, కలెక్టర్ ఉదయ్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులు ఏర్పాట్లు చేయగా.. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. పట్టణం బీఆర్ఎస్ నేతల హోర్డింగ్స్, ఫ్లెక్సీలతో గులాబీమయంగా మారింది. కార్యాలయాలు విద్యుద్దీపాల వెలుగులో కాంతులీనుతున్నాయి.
Nagarkurnool2
మహబూబ్‌నగర్, జూన్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ సిద్ధించాక రాష్ట్రం ఇరిగేషన్, విద్య, వైద్య, అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నది. ఈక్రమంలో సీఎం కేసీఆర్ కందనూలును ప్రత్యేక జిల్లాగా ప్రకటించినప్పటి నుంచి అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. కందనూలులో సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయాలు రాచఠీవికి దర్పణంగా నిలుస్తున్నాయి. విద్య, వైద్యం, సాగునీరు, అభివృద్ధి కార్యక్రమాలతో నాగర్ కర్నూల్ ఇతర పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం పలు కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ప్రగతి ప్రదాత, సీఎం కేసీఆర్ నాగర్‌కర్నూల్‌కు వస్తున్నారు. ఈమేరకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.60కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, రూ.35కోట్లతో నిర్మించిన పోలీస్ హెడ్‌క్వార్టర్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, మెడికల్ కాలేజీని సీఎం ప్రారంభించనున్నారు. ఈమేరకు ఎమ్మెల్యే పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం వెలమ ఫంక్షన్‌హాల్ సమీపంలో నిర్వహించే ప్రగతినివేదన సభలో సీఎం ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు సీఎం సభను విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Nagarkurnool1
మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గువ్వల బాలరాజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున జనసమీకరణ చేయడానికి ఇప్పటికే సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో జనసమీకరణ చే యాలని పార్టీ నేతలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కాగా జిల్లాకేంద్రమంతా ఇప్పటికే బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లతో గులాబీమయమైంది. ప్రారంభోత్సవాల సందర్బంగా సమీకృత కలెక్టరేట్, ఇతర చోట్ల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో బాంబ్, డాగ్ స్వాడ్లతో తనిఖీలు చేపట్టా రు. సభకు భారీ సంఖ్యలో జనం వ చ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు.
పక్కనే కృష్ణమ్మ ప్రవహిస్తున్నా.. సాగునీటిని నిర్లక్ష్యం చేయడంతో వర్షాధారంపై ఆధారపడిన రైతాంగానికి తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ పుణ్యమా అని.. నాగర్‌కర్నూల్‌లో జలదృశ్యం ఆవిష్కృతమైంది. ఇటు కల్వకుర్తి, అటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో ఇప్పటికే రెండు పంటలను రైతులు ఆనందంగా సాగుచేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాకు తాగునీరు అందించే మిషన్ భగీరథ పథకం మెయిన్ చానల్ ఈ జిల్లాలోనే ఉండగా.. ఐదేండ్లుగా విజయవంతంగా సాగుతుండడంతో మంచినీటికి కొదువ లేకుండాపోయింది. ఇప్పటికే ఎంజీకేఎల్‌ఐతో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా.. మరో రూ.80కోట్లతో మార్కండేయ రిజర్వాయర్ మంజూరు కాగా ఇటీవలే పనులు ప్రారంభించారు. ఈ రిజర్వాయర్‌పై కొందరు రాజకీయనేతలు నానా హంగామా సృష్టించి భంగపడ్డారు. పీఆర్ఎల్ఐలో భాగంగా బిజినేపల్లి మండలం వట్టెం వద్ద వెంకటాద్రి రిజర్వాయర్ నిర్మాణం పూర్తికావొచ్చింది. జూలైలో రిజర్వాయర్‌ను నింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు పనుల్లో వేగం పెంచారు. 16 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ పూర్తయితే కందనూలు దశ మారిపోనున్నది.
స్వరాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక కందనూలు విద్య, వైద్యంలో ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది. సీఎం కేసీఆర్ జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేయగా.. ప్రస్తుతం తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. వెనుబడిన.. మావోయిస్టుల ప్రభావితం ఉన్న జిల్లాకు మెడికల్ కాలేజీ రావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే నర్సింగ్ కళాశాల మంజూరు చేయగా.. డయాగ్నొస్టిక్ కేంద్రం, టీహబ్‌ను ఏర్పాటు చేసి పేదలకు అన్ని రకాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు. గతంలో డాక్టర్‌గా ఉండి ఇక్కడి అమాయక ప్రజల ఓట్లను దండుకొని పదవులు అనుభవించిన ఓ యాక్టర్ నిజ స్వరూపాన్ని ఎమ్మెల్యే మర్రి బయటపెట్టారు. అదేవిధంగా జిల్లా దవాఖానను జనరల్ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. జిల్లా దవాఖాన గ్రేడ్‌ను పెంచి, ఏకంగా డయాలసిస్, పాలియేటివ్ కేంద్రాలు, క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్యాన్ని పేదల చెంతకు తీసుకొచ్చారు. వైద్యం కోసం ప్రైవేట్ దవాఖానలు, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే సకల సదుపాయాలతో ఆసుపత్రిని సిద్ధం చేశారు. త్వరలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా 500 పడకల టీచింగ్ దవాఖానను కూడా నిర్మిస్తున్నారు. కార్పొరేట్‌కు దీటుగా ఈ టీచింగ్ హాస్పిటల్ ఉండబోతోంది. వ్యవసాయ డిగ్రీ కళాశాల మంజూరు కాగా పాలెంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇటీవలే ప్రారంభించారు.
నాగర్‌కర్నూల్‌లో రూ.65కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపట్టారు. ఉమ్మడి జిల్లాలోనే తొలి ఈ డ్రైనేజీ వ్యవస్థ కలిగిన పట్టణంగా కందనూలు రికార్డు సృష్టించింది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి చొరవతోనే ఇది సాధ్యమైందని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. సుందరీకరణలో భాగంగా రూ.50కోట్లతో మున్సిపల్ పరిధిలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్లు వేశారు. గతంలో వీధుల్లో తిరగడానికి ఇబ్బందులు పడగా.. నేడు సీసీరోడ్లతో సమస్య తీరింది. రూ.60కోట్లతో జడ్చర్ల -నాగర్‌కర్నూల్ వయా సిర్సవాడ ఆర్అండ్బీ రహదారి పనులు నడుస్తున్నాయి. రూ.11కోట్లతో వెజ్, నాన్‌వెజ్ సమీకృత మార్కెట్ సముదాయం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ.1.20కోట్లతో పట్టణంలో జంక్షన్ల ఆధునీకరణ. ఉయ్యాలవాడ, కొల్లాపూర్ పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.35లక్షలతో కలెక్టరేట్ వద్ద మిషన్ భగీరథ పైలాన్‌ను ఏర్పాటు చేశారు. రూ.20లక్షలతో స్ట్రీట్ వెండింగ్ జోన్ నిర్మాణం, మరో రూ.50లక్షలతో కొత్తగా పనులు చేపట్టారు.
రూ.30కోట్లతో నిర్మించిన మినీ ట్యాంక్‌బండ్ జిల్లాకేంద్రానికే తలమానికంగా మారింది. నీటి మధ్యలో బుద్ధ విగ్రహం, పక్కనే బతుకమ్మ ఘాట్, బ్రిడ్జి పట్టణవాసులను ఆకట్టుకుంటున్నాయి. రూ.2.5లక్షలతో జాతీయజెండాను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆహ్లాదకర వాతవారణాన్ని ఆస్వాదించేందుకు వీలుగా పచ్చని మొక్కలను నాటగా.. సేదతీరడానికి బెంచీలు, కుర్చీలు, చిన్నారులు ఆడుకునేందుకు ఆట సామగ్రి వంటి సదుపాయాలను ఈ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేశారు. ఒకానొక సందర్భంలో భాగ్యనగరంలో ఉన్నట్లు అనుభూతి కలిగేలా ట్యాంక్‌బండ్ పరిసరాలను తీర్చిదిద్దారు. రూ.1.10కోట్లతో మున్సిపాలిటీ భవనాన్ని నిర్మించారు. జిల్లాకేంద్రంలో ఆధునీకరణలో భాగంగా డివైడర్లు, పచ్చని మొక్కలు, ఎల్ఈడీ బల్బులతో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుతో పట్టణం సుందరంగా మారింది. రూ.40లక్షలతో జెడ్పీ, జూనియర్ కళాశాలల్లో ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేయగా.. ఉదయం, సాయంత్రం వాకర్స్, క్రీడాకారులకు ఇవి ఉపయుక్తంగా మారాయి.