కోస్గి, నవంబర్ 10 : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలిచిందని భూగర్భ, గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.. శుక్రవారం కోస్గి పట్టణంలో మున్సిపల్ నాయకులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోస్గి మున్సిపల్ పరిధిలోని 16వ వార్డులో ఇన్చార్జీలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కొడంగల్‌లో ఐదేండ్లలో పట్నం నరేందర్‌రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలుపాలన్నారు. కోస్గి మున్సిపాలిటీకి రూ.80కోట్లతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ కరెంటు ఇవ్వలేక, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరెంటు లేక పంటలు ఎండి రైతులు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ మన రైతాంగానికి 24గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమాతో అండగా నిలుస్తున్నారని తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలని కోరారు. హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయొద్దీన్ మాట్లాడుతూ కోస్గి మున్సిపాలిటీలో నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పర్యటించి బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలన్నారు. పట్నం నరేందర్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలించాలని కోరారు. సమావేశంలో ఈజీఎస్ స్టేట్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, దౌల్తాబాద్ జెడ్పీటీసీ మైపాల్, మున్సిపల్ అధ్యక్షుడు రాజేశ్, కౌన్సిలర్లు శ్రీనివాస్, బాలేశ్, నాయకులు హరి, రాజేందర్‌రెడ్డి, కుమార్, వెంకట్‌నర్సింహులు, డీకే రాములు, విజయ్, వెంకట్రాములు పాల్గొన్నారు.