RDS | అయిజ, డిసెంబర్ 29 : ఆర్డీఎస్ నీటి వాటాను కర్ణాటక రైతులు అక్రమంగా తోడేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లే కర్ణాటకలో ఏర్పాటు చేసిన లిప్టులు, మోటర్ల ద్వారా అక్కడి రైతులు మళ్లించుకుంటున్నారు. దీంతో ఆర్డీఎస్కు నీరు చేరడం గగనంగా మారింది. జోగుళాంబ గద్వాల, అలంపూర్ నియోజకవర్గంలో పరిధిలో సాగు చేసిన 37 ఎకరాలకు పంటలకు సాగునీరు అందించేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆర్డీఎస్ నీటి వా టాలో 1.078 టీఎంసీల నీటిని తుంగభద్ర డ్యాం ఈ నెల 26న నుంచి విడుదల చేయించారు.
జనవరి 5 వర కు కొనసాగనున్నది. అయితే విడుదలైన నీరంతా శనివారం రాత్రి ఆర్డీఎస్కు చేరాల్సి ఉన్నా ఇంకా రాలేదు. కర్ణాటక రైతులు మాన్వి, సిరిగుప్ప, గబ్బూరు గ్రామాల్లోని ఎత్తిపోతల పథకాలతోపాటు స్థానిక రైతులు మో టార్ల ద్వారా పంటల సాగుకు నీటిని వినియోగిస్తున్నా రు. దీంతో ఆనకట్టకు నీరు రాలేదని తెలంగాణ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన నీటిని వచ్చినట్లే తోడేస్తే రైతులకు సాగునీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. కన్నడ లిఫ్ట్‌లకు నీటిని ఎత్తిపోయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
రెండు రాష్ర్టాల జాయింట్ ఇండెంట్తోనే తెలంగాణలోని ఆర్డీఎస్ ఆయకట్టుతోపాటు ఏపీలోని కర్నూల్ జి ల్లా కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు ప్రయోజనం కలుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బ్రి జేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు టీబీ డ్యాం నుంచి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఆర్డీఎస్, కేసీ కెనాల్ నీటి వాటాను ప్రతి ఏటా 60-40 రేషియో ప్రకారం టీబీ డ్యాం నుంచి జాయింట్ ఇండెంట్ విడుదల చేయాల్సి ఉంటుంది. గతేడాది నుంచి ఏపీ ప్ర భుత్వం ఆర్డీఎస్ ఇండెంట్‌తో కలిసి కేసీ కెనాల్ ఇండెంట్‌ను టీబీ డ్యాం ద్వారా తీసుకోకపోవడంతో ఇరు రాష్ర్టాల రైతులు నష్టపోతున్నారు.
ఏపీలోని కర్నూల్ ఇరిగేషన్ అధికారులు కేసీ కెనాల్ ఇండెంట్‌ను ఆర్డీఎస్ ఇండెంట్‌తో కలిసి వినియోగించకుండా హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాల్వల ద్వారా కేసీ కెనాల్ నీటి వాటాను వినియోగిస్తుండటంతో ఆర్డీఎస్ కర్షకులతోపాటు ఏపీలోని తుంగభద్ర నదీతీర ప్రాంతాల రైతులు లబ్ధి పొందడం లేదు. 60 శాతం కర్నూల్లోని కేసీ కెనాల్, 40 శాతం ఆర్డీఎస్ నీటి వాటాను టీబీ డ్యాం నుంచి విడుదల చేసేందుకు కలిసి రావాలని రైతులు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం జాయింట్ ఇండెంట్‌కు మొగ్గుచూపాలని ఇరు రాష్ర్టాల రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.