మహబుబాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్)లో ఓటర్లు భాగస్వాములై వారి వివరాలు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు సూచించారు. గురువారం మానుకోట పట్టణంలోని పలు వార్డుల్లో జరుగుతున్న సర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఓటర్ల్లకు బీఎల్వోలు అందించిన ఎన్యుమరేషన్ ఫామ్స్‌లో పూర్తి వివరాలు పొందుపరిచి తిరిగి ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
ఈఎఫ్‌లు ఎలా నింపాలో ఇప్పటికీ తెలియక ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని, అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, బీఎల్వోలు అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 24 వరకు గడువు ఉందని, అప్పటిలోగా ఫామ్స్ నింపి బీఎల్వోలకు అందించాలన్నారు. బీఎల్ఏలు కూడా సర్‌పై అప్రమత్తంగా ఉండాలని, అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూడాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనదని, దానికి కాపాడుకోవాలని తక్కళ్లపల్లి తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రాంమ్మోహన్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, కౌన్సిలర్ చిట్యాల జనార్దన్ తదితరులున్నారు.