కల్వకుర్తి, జూలై 1 : కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల తాసీల్దార్ నాగార్జున, అటెండర్ యాదగిరి బుధవారం సాయంత్రం ఏసీబీకి చిక్కారు. బాధితుడు వెంకటయ్య నుంచి రూ.10వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన బాధితుడు 22గుంటల పొలం రిజిస్టర్ చేసేందుకు తాసీల్దార్ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు తమను ఆశ్రయించాడని డీఎస్పీ చెప్పాడు.
తాసీల్దార్ ఆదేశాలతో బాధితుడి నుంచి అటెండర్ యాదగిరి రూ.10వేలను తీసుకున్నాడని డీఎస్సీ వివరించారు. యాదగిరి సదరు డబ్బును తాసీల్దార్‌కు ఇచ్చాడని డీఎస్పీ చెప్పాడు. కెమికల్ టెస్ట్ ఆధారంగా వారిని అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు. వీరిని బుధవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు.
తాసీల్దార్ కార్యాలయం ఎదుట సంబురాలుఏసీబీకి తాసీల్దార్ చిక్కడంతో రైతులు తలకొండపల్లి రెవెన్యూ కార్యాలయం ఎదుట పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. తమ మండలానికి పట్టిన శని పీడ విరగడైందని నినాదాలు చేశారు. ప్రతి చిన్న పనికి తాసీల్దార్ డబ్బుల కోసం వేధించేవాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.