నారాయణపేట, ఆగస్టు 6 : ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కు విద్యా సంవత్సరం ప్రారంభ మై 50 రోజులు దాటుతున్నా యూనిఫామ్స్ అందకపోవడంతో విద్యార్థులు తీ వ్ర ఇబ్బందులు ఎదురొంటున్నా రు. ప్ర తి విద్యా సంవత్సరం ప్రారంభం రోజుల్లో నే విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకా లు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ తదితర సా మగ్రిని అందించాల్సి ఉండగా, ఈసారి డ్రెస్ లు పంపిణీ మాత్రం ఆలస్యమవుతున్నాయి.
పాఠశాలలు ప్రారంభమైనా..
విద్యార్థులు గతేడాది యూనిఫామ్స్తోనే పాఠశాలలకు హాజరవుతుండగా, మరికొందరు సాధారణ దుస్తులతోనే బడికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా ఉచితంగా రెండు యూనిఫామ్స్ అందించే పథ కం ఉన్నప్పటికీ, పంపిణీలో జాప్యంతో ప్రయోజనం సకాలంలో అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
తల్లిదండ్రులపై అదనపు భారం..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో ఎకువ మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెం దినవారే. ఉచితంగా యూనిఫామ్స్ అందుతాయని ఆశించిన తల్లిదండ్రులు పిల్లలకు ప్రత్యేకంగా దుస్తులు కొనుగో లు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వారికి అదనపు ఆర్థిక భారం పడుతోంది. పాఠశాలల్లో యూనిఫాం తప్పనిసరిగా ధరించాలని సూచిస్తుండడంతో తల్లిదండ్రు లు అప్పులు చేసి అయినా యూనిఫామ్స్ కొనుగోలు చే యాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. యూనిఫా మ్స్ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నా రు. సరఫరా ప్రక్రియ ఎకడ నిలిచిపోయింది? కుట్టు పని పూర్తయిందా? పాఠశాలలకు ఎప్పుడు చేరుతాయి? విద్యార్థులకు ఎప్పటిలోగా పంపిణీ చేస్తారు? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేక అయోమయం నెలకొన్నది.
విద్యార్థులపై ప్రభావం..
యూనిఫాం అనేది కేవలం దుస్తులు మాత్రమే కాకుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో సమానత్వ భావనను పెం పొందించే అంశంగా అధికారులు చెబుతారు. అయితే పాఠశాలలు ప్రారంభమైన తర్వాత కూడా యూనిఫామ్స్ అందకపోవడం వల్ల విద్యార్థుల్లో అసంతృప్తి నెలకొందని తల్లిదండ్రులు అంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే యూనిఫామ్స్‌తో హాజరవుతుంటే, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రం ఆల స్యం కావడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధికారులు స్పందించాలి..
యూనిఫామ్స్ సరఫరా పంపిణీ ప్రక్రియపై వి ద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన యూనిఫామ్స్‌ను వెంటనే చేరవేసి, విద్యార్థులందరికీ సకాలంలో పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 50 రోజులుగా ఎదురు చూపులు చూస్తున్న విద్యార్థులకు ఇకనైనా యూనిఫామ్స్ అందుతాయా? లేక కొంత కాలం వేచి చూడాలా? అన్నది అధికారుల చర్యలపై ఆధారపడి ఉంది.
హాస్టల్ విద్యార్థులకు ఒక జతతోనే సరి..
నారాయణపేట, మక్తల్, మద్దూరు, కోస్గి పట్టణాల్లోని సోష ల్ వెల్ఫేర్, గురుకుల హాస్టల్ విద్యార్థులకు మెప్మా ఆధ్వర్యం లో మహిళా సంఘాల సభ్యులకు సూల్ యూనిఫామ్స్ కుట్టి ఇచ్చే బాధ్యతను అప్పగించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యుషన్ సొసైటీ హాస్టల్ విద్యార్థులకు సంబంధించి ఈ నాలుగు మున్సిపాల్టీలో మొత్తం 1950 విద్యార్థులకు రెండు జతల క్లాత్ రా వడం జరిగింది. ఇందులో ఒక జత సూల్ యూనిఫామ్స్ కుట్టి సూల్లకు అందించారు. కేజీబీవీలకు సంబంధించి 1056 విద్యార్థులకు రెండు జతల క్లాత్ వచ్చింది.
ఇందులో ఒక జత యూనిఫాం కుట్టి సూల్కు అందించారు. మహా త్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్ వార్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ హాస్టల్లకు సంబంధించి 1557మంది విద్యార్థులకు రెండు జతల క్లాత్ రావడం జరిగింది. ఇందులో ఒక జత సూల్ యూనిఫామ్స్ కుట్టి సూల్లకు అందించారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యుషన్ సొసైటీ హాస్టల్‌కు సంబంధించి 1900 విద్యార్థులకు రెండు జతల క్లాత్ రావడం జరిగింది. ఇందులో ఒక జత సూల్ యూనిఫామ్స్ కుట్టి సూల్స్కు అందజేశారు. అన్ని హాస్టల్ విద్యార్థులకు మరో జత డ్రెస్ అందించాల్సి ఉండ గా, ఎప్పటి వరకు అందిస్తారనేది తెలియడం లేదు. ఇది ఇలా ఉండగా జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల పరిధిలోని సూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోని సూల్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు క్లాత్ సరఫరా కాలేదు. క్లాత్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు కుట్టి ఇవ్వాలన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అందని డ్రెస్సులు
నారాయణపేట జిల్లాలో మొత్తం 54వేల మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 13 మండలాలు ఉండగా కేవలం నాలుగు మండలాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు సంబంధించి అది కూడా ఒక డ్రెస్‌కు సరిపడిన క్లాత్ మా త్రమే వచ్చింది. మిగతా తొమ్మిది మండలాలకు సంబంధించి ఒక డ్రెస్‌కు సరిపడని క్లాత్ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సరఫరా కాలేదు.
నాలుగు మండలాలకే మెటీరియల్
జిల్లాలో మొత్తం 13మండలాల పరిధిలో స్కూ ల్ ఎడ్యూకేషన్ శాఖలో 54వేల మంది విద్యార్థులు ఉన్నారు. మెటీరియల్ సరఫరాదారుడి నుంచి ఇప్పటి వరకు కేవలం నాలుగు మండలాలకు మాత్రమే యూనిఫాం మెటీరియల్ వ చ్చింది. మరో 9 మండలాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన యూనిఫాం మెటీరియల్ రావాల్సి ఉంది. కృష్ణ, మాగనూర్, ధన్వాడ, కొత్తపల్లి మండలాలకు సంబంధించి 64 వేల మీటర్ల క్లాత్ వచ్చింది. డ్రెస్‌లను కుట్టే బాధ్యతను డీఆర్డీవో పరిధిలోని మహిళా సమాఖ్యల అప్పగించారు. వాళ్లు కుట్టి ఇచ్చిన తర్వాత విద్యార్థులకు అందిస్తాం. ఇది వరకు ఉన్న క్లాత్ క్వాలిటీని అదే విధంగా కలర్‌ను కూడా మార్చడం జరిగింది. ప్రభుత్వం క్లాత్ అందించిన ప్రకారం మహిళా సమాఖ్యలకు డీఆర్డీవో అప్పగించడం జరుగుతూ వస్తుంది.
– గోవిందరాజులు, డీఈవో, నారాయణపేట జిల్లా
ఆగస్టు 15 లోపు జత యూనిఫాం అందిస్తాం..
విద్యార్థుల యూనిఫామ్స్ సంబంధించి రెసిడెన్షియల్ పాఠశాలల మెటీరియల్ వచ్చింది. ఆలస్యంగా రావ డంతో కుట్టడం లేట్ అవుతోంది. మెటీరియల్ ఇచ్చి నెల రోజులైంది. ఆగస్టు 15లోపు జత యూనిఫాం ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి. ఇందుకుగానూ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల రెసిడెన్షియల్స్‌కు జత యూనిఫాం అందించాం. రెండో జత డ్రెస్‌లు కుడుతున్నారు. పాఠశాలలకు సంబంధించి ఇంత వరకు మెటీరియల్ రాలేదు. మెప్మా పరిధిలో జిల్లా మొత్తంలో 12 రెసిడెన్షియల్స్ ఉన్నాయి. 1,580 బాలురు, 4,240 బాలికలు కలిపి మొత్తం 5,820 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ జత యూనిఫాం అందించడం జరిగింది. అదే విధంగా నాలుగు మున్సిపాల్టీల్లో 59 సూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పాఠశాలలు ఉన్నాయి. 4,575 మంది బాలురు, 4,751మంది బాలికలు కలిపి మొత్తం 9,326 విద్యార్థులు ఉండగా ఒక విద్యార్థికి కూడా ఇప్పటి వరకు యూనిఫాం క్లాత్ రాలేదు.
– శంకర్, మెప్మా పీడీ, నారాయణపేట జిల్లా