మానవపాడు, మార్చి 6: పరీక్షా కేంద్రానికి రావడానికి విద్యార్థులు నానా యాతన పడుతున్నారు. మండల కేంద్రంలోని గంగు వెంకటకృష్ణారెడ్డి జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మానవపాడు, కేజీబీవీ, ఇటిక్యాల కళాశాలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షా సమయానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు గూడ్సు వాహనాల్లో వచ్చి పరీక్ష రాస్తున్నారు.
ఇటిక్యాలకు చెందిన విద్యార్థులు బుధ, గురువారం బొలేరోలో పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఒక్కో వాహనంలో సుమారు 60నుంచి 70 మంది విద్యార్థులు బొలేరోలో పరీక్షా కేంద్రానికి చేరుకొని పరీక్ష రాశారు. ఆర్టీసీ వారు పరీక్ష రాసేవారికి బస్సు సౌకర్యం కల్పించక పోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. గూడ్సు వాహనాల్లో తరలిస్తుండడంతో విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.