వనపర్తి టౌన్, నవంబర్ 7 : కళ్లుండి చూడలేని గుడ్డి ప్రభుత్వం కండ్లు తెరిచి విద్యార్థుల గోస చూడాలని బీఆర్ఎస్వీ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, బీసీ విద్యార్థి సంఘం, ఎంఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ సంఘాల నేతలు ఆరోపించారు. శుక్రవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ వెళ్లి గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలని కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సం ఘాల నేతలు రమేశ్, అరవింద్, గణేశ్, హేమంత్, పరశురాములు, లక్ష్మణ్, నరేశ్ మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడం తో ప్రైవేట్ కళాశాలలు మూసి వేశారని, దీని వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న రూ.8300 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాప్రతినిదులను రోడ్లమీద తిరుగనియ్యరని తక్షణమే ఫెండింగ్ బిల్లులను విడుదల చేయాలని లేకపోతే పోరాటాలు ఉధృతమవుతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు నరేశ్, వంశీ, గోపాలకృష్ణ, సూర్యవంశం గిరి, అరవిందు, బన్ని , దినేశ్, ప్రదీప్‌కుమార్, రాజుతోపాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కల్వకుర్తి రూరల్, నవంబర్ 7 : పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పాలమూరు చౌరస్తా నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన అనంతరం బైఠాయించి ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలన్నారు. లేదంటే విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.