మహబూబ్ నగర్ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేసవిలో ఎక్కడ కూడా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ జరపాలని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి సూచించారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే సత్వరమే పరిష్కరించాలన్నారు. ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ మంచినీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి వేసవిలో తాగునీటి సరఫరా ప్రణాళిక, రబీ పంటల సాగు నీటి సరఫరా, వ్యవసాయంతోపాటు గృహ, పారిశ్రామిక రంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా, రైతు భరోసా, రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ, వేసవికాలం సమీపిస్తుండటంతో అనునిత్యం తాగునీటి సరఫరాను నిశితంగా పర్యవేక్షించాలని, ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. జలాశయాలలో నీటి నిల్వలు అందుబాటులో ఉన్నందున వేసవిలో నీటి ఎద్దడి నెలకొనకుండా, లీకేజీలకు తావులేకుండా మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్టపర్చాలని సూచించారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన సమస్యల పరిష్కారానికై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో ఏర్పడే ఇబ్బందులను పరిష్కరించేందుకు అవసరమైన బృందాలను ఏర్పాటు చేయాలని, తాగునీటి సరఫరాకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి క్రమం తప్పకుండా సమాచారం సేకరించాలని కలెక్టర్లకు సూచించారు. అన్ని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు మిషన్ భగీరథ జలాలను సరఫరా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, స్థానికంగా అందుబాటులో ఉన్న జల వనరులను వేసవి సీజన్ చివరలో వినియోగించుకునేందుకు వీలుంటుందని అన్నారు.
పట్టణాలలో ఏర్పడిన నూతన కాలనీలు, చివరి ఆవాస ప్రాంతాలలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని శాంతి కుమారి చెప్పారు. ఇబ్బందులు ఉన్న ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అలాగే, రబీ పంటలు చేతికందే వరకు సాగు నీటి వసతి కల్పించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ సాగర్ ప్రాజెక్టు ద్వారా ఆయా జిల్లాలలోని నిర్దేశిత ఆయకట్టుకు నీటి సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి అక్రమ వినియోగాన్ని నిలువరించేందుకు వీలుగా పోలీసు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. వివిధ ప్రాజెక్టుల కింద కాల్వల వెంబడి నిఘా ఉంచాలని, తద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు జలాలు అందేలా కృషి చేయాలన్నారు. సాగు, తాగునీటి పథకాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రానున్న మార్చి, ఏప్రిల్, మే మాసాలలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశాలు ఉన్నందున ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించుకుని వ్యవసాయానికి, గృహావసరాలకు, పరిశ్రమలకు కోతలు లేకుండా నాణ్యమైన కరెంటు సరఫరా చేయాలని శాంతి కుమారి సూచించారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పాదకత ఉన్నందున, సరఫరా లోపాలను సవరించుకుని ఆయా రంగాలకు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. కాగా, సాగుకు యోగ్యమైన వ్యవసాయ భూమి కలిగి పంటలు పండిస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసా కింద ఆర్ధిక తోడ్పాటును అందించేందుకు చొరవ చూపాలన్నారు.
కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన గ్రామ సభలు, ఇతరత్రా మార్గాల ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్లకు శాంతి కుమారి హితవు చెప్పారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ అయ్యేలా వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించాలని సూచించారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పక్కాగా మెనూ అమలయ్యేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ విద్యుత్ సరఫరా, డిమాండ్‌పై ఎస్.పి.డి.సి.ఎల్ అధికారులతో సమీక్షించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో రోజూ సరాసరి విద్యుత్ వినియోగం 7.16ఎంయూ ఉంటే,ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రతి రోజూ సరాసరి వినియోగం 7.98ఎంయూ ఉందని తెలిపారు. జిల్లాలో క్రిటికల్ ఓవర్ లోడెడ్ సబ్ స్టేషన్ ఒకటి, 13కేవీ ఫీడర్లు 4, 11 కేవీ పీడర్లు రెండు, ఆరు పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. వాటిని ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని అన్నారు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పనులు మార్చి నెలాఖరు లోగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
విద్యుత్ ఎస్ఈ, టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో 24×7 కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విజయేందిర బోయి చెప్పారు. 9440768923, 9491061101 మొబైల్ నెంబర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం,24×7 ఫిర్యాదులు పరిష్కారానికి నాలుగు అత్యవసర విద్యుత్ వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.