మహబూబ్‌నగర్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మా ఉప ముఖ్యమంత్రి అడుగుతున్నా.. మా ఇన్చార్జి మంత్రి దామోదర్ అన్నను కోరుతు న్న.. సహచర మంత్రులు కూడా ఇక్కడున్నారు.. మా పాలమూరు అభివృద్ధికి ఏటా రూ.20వేల కో ట్లు ఇవ్వండి.. ఈ ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు అయితయి.. జిల్లా అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా.. మీ తరఫున అందరినీ అడుగుతున్నా.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన రైతుపండుగలో మాట్లాడిన మాటలివి.. ప్రతిఏటా రూ.20వేల కోట్లతో జిల్లా స మగ్రాభివృద్ధికి పాటుపడతారని అందరూ మంత్రుల సాక్షిగా ఇచ్చిన మాట నీటి మూటేనా అంటూ ఉమ్మడి జిల్లా ప్రజలు నిలదీస్తున్నారు.
బుధవారం రాష్ట్ర శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లా అభివృద్ధి నిధుల ఊసే లేకపోవడంతో జిల్లా ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. నేను మీ బిడ్డను.. ఈ జిల్లా అభివృద్ధికి మీరంతా అడిగితే మా మంత్రులు ఇవ్వరా కొట్టండి చప్పట్లు అంటూ కొట్టించి చివరకు బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించకపోవడం.. మా చప్పట్లన్నీ వృథా అయ్యాయని మండిపడుతున్నారు. పాలమూరు జిల్లా వరప్రదాయిని అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపించింది. బడ్జెట్లో ఆశించినంత కేటాయించకపోవడంతో ఈ ప్రాజెక్టు పనులు ఈసారి కూడా నిలిచిపోయే అవకాశాలున్నాయి.
ఈ పథకంలో భాగంగా ఉదండాపూర్ జలాశయం కింద రైతులు పరిహారం కోసం పరితపిస్తుంటే రూపాయి కూడా కేటాయించలేదు. సీఎం మానస పుత్రిక అయిన కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో మిగతా ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ నిధు లు తప్పితే ఇతర పద్ధతులు ఏమీ కేటాయించకపోవడంతో రైతాంగం తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తుంది. ఒక్క కల్వకుర్తికి తప్పితే కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు ఇతర ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం మె యింటెనెన్స్ ఖర్చులు మాత్రమే పద్దుల్లో చూపింది. ప్రభుత్వమిచ్చిన ఆరు గ్యారెంటీల ఊసే లేకపోవడంతో మహిళలు మండిపడుతున్నారు. యువతకు కూడా జీవనభృతి కల్పించే అంశంపై కూడా బడ్జెట్ లో కేటాయింపులు లేకపోవడంతో ఉమ్మడి జిల్లా యువత నిరాశ చెందుతోంది. దివాళాకోరు బడ్జెట్ అని బీఆర్ఎస్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పాలమూరుకు మళ్లీ మొండిచేయి
మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో 12లక్షల ఎకరాలకు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేవలం రూ.2547 కోట్లు మాత్రమే కేటాయించారు. సంగెంబండ, కోయిల్‌సాగర్, భీమా లిఫ్ట్ టు.. నెట్టెంపాడు ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ ఖర్చు లు మాత్రమే కేటాయించినట్లు సమాచారం. ఇతర ప్రాజెక్టులకు చిల్లిగవ్వ కేటాయించలేదు. ఎన్నో రోజులుగా జడ్చర్ల మండలం ఉదండాపూర్‌లో పునరావాస ప్యాకేజీకి ఆందోళన చేస్తున్న వారికి బడ్జెట్లో ఊరట కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
20వేల కోట్లు ఏమయ్యాయి?
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి ఏటా రూ.20వేల కోట్లు కేటాయిస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రుల సాక్షిగా ప్రకటించారు. కానీ బడ్జెట్లో మాత్రం ఈ ఊసే కనిపించడం లేదు. అందరూ మంత్రులు వేదికపై ఉండగా.. వారిని జిల్లా ప్రజల తరఫున అడుగుతున్నానని చెప్పి జనం సాక్షి గా చప్పట్లు కొట్టించారు. దాదాపు 5నిమిషాలు చప్ప ట్లు కొట్టించి బడ్జెట్లో చిల్లి గవ్వ కేటాయించకపోవడంతో జిల్లా ప్రజలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ బడ్జెట్లో తగిన న్యాయం జరగలేదని ఆరోపిస్తున్నారు.
ఆరు గ్యారెంటీలకు నో గ్యారెంటీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలకు నిధులు కేటాయించకపోవడంతో తీవ్ర నిరాశ కలుగుతుంది. మహిళలకు కనీసం నెలకు 2500 భృతి, పింఛన్లు 4000 అవుతాయని ఆశపడ్డవారికి నిరాశే మిగిలింది. ఈ బడ్జెట్లో ఈ స్కీములకు డబ్బులు కేటాయించలేకపోవడంతో ఈ ఏడాది కూడా అమలు అసాధ్యమేనని తెలుస్తోంది. రైతుభరోసా పథకానికి కూడా మంగళం పాడే విధంగా బడ్జెట్లో కేటాయింపులు అంతంతమాత్రంగానే ఉన్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా యువకులకు నిరుద్యోగ భృతి విషయంలో కూడా భరోసా కల్పించలేదని యువజన సంఘాలు విమర్శిస్తున్నాయి. ఉ మ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఎలాంటి ప్రయోజనం లేకుం డా పోయిందని.. వడ్డించేవాడు మనోడైనా నిధులు తేవడంలో ఎమ్మెల్యేలు విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి.
అసెంబ్లీ సాక్షిగా అబద్ధాల చిట్టా..
మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, మార్చి 19(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్దాల చిట్టాగా ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలన వికాసాన్ని 15నెలల కాంగ్రెస్ పాలనలో చిద్రం చేశారని విమర్షించారు. బుధవారం ప్రవేశపెట్టిన రేవంత్ సర్కార్ బడ్జెట్‌పై స్పందించారు. ఒక మధ్యంతర బడ్జెట్‌తో కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం మూడో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన గడువక ముందే ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, 2050 తెలంగాణ రైజింగ్ ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లలో తెలంగాణలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో పాలన వికేంద్రీకరించబడిందని, అన్నిరకాల వనరులను సమీకరించుకొని దేశంలోనే తలసరి ఆదాయంలోనూ, విద్యుత్ వినియోగంలోనూ నెంబర్‌వన్‌గా నిలిచిందని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యా, వైద్యరంగాల్లోనూ అనూహ్య మార్పులు, ప్రాజెక్టుల నిర్మాణం, సాగునీటి సదుపాయాల కల్పన మూలంగా పంటల ఉత్పత్తిలో తెలంగాణను అగ్రభాగాన కేసీఆర్ నిలిపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
పచ్చబడగొట్టిన తెలంగాణను ఎండబెట్టి కాంగ్రెస్ చోద్యం చూస్తున్నదని, ప్రతిఇంటికి నల్లా నీటితో పరవశించిన ఆడపడచులు.. మళ్లీ నేడు బిందెలు చేతిలో పట్టుకొని పరుగులు తీసే పరిస్థితిని కాంగ్రెస్ కల్పిస్తున్నదని విమర్షించారు. పట్టణ ప్రగతి.. పల్లెప్రగతి కార్యక్రమాలతో కళకళలాడిన పట్టణాలు, పల్లెలు నేడు పారిశుధ్యం లోపించి కంపు కొడుతున్నాయన్నారు. హరితహారం మొక్కులు ఎండిపోతున్నాయని, పచ్చని పార్కులు పడావుగా మారాయన్నారు. పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీ, ఆశ వర్కర్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఆశలపల్లికిలో ఊరేగించే అంధఃపాతాళానికి కాంగ్రెస్ విసిరేసిందన్నారు. రూ.2లక్షల రుణమాఫీ ఆశ చూపి రైతులను మోసం చేశారని, ఎకరాకు ఏడాదికి రూ.15వేల రైతుభరోసా అంటూ అన్నదాతలను దగా చేశారన్నారు.
కూలీలకు రూ.12వేలు, కౌలు రైతులకు ఏడాదికి 15వేలు, ఏడాదిలో రూ.2లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పిన హామీలన్నీ నేటికి మొదలు కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ పాపాలతో రాష్ట్రంలో 450మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, గురుకుల విద్యాలయాల్లో మరో 50మందికి పైగా విద్యార్థులు వివిధ కారణాలతో మరణించారని దుయ్యబట్టారు. కేవలం రూ.15నెలల పాలనలో రూ.లక్షా 50వేట్లు అప్పు చేసి ఏ ఒక్క పథకాన్ని అమలు చేయడం కానీ, ప్రాజెక్టును పూర్తి చేసిన దాఖలాలు లేవన్నారు. రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను అబద్దాలతో వండి వార్చారని, ధ్వంసం, విధ్వంసాన్ని కాంగ్రెస్ రచిస్తే.. తెలంగాణ నవనిర్మాణాన్ని నరనరాన నింపుకొని కేసీఆర్ ప్రభుత్వం పని చేసిందని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విమర్శించే నైతికహక్కు లేదని పేర్కొన్నారు.
అంకెల గారడీగా బడ్జెట్
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంకెలగారడిగా ఉంది. రూ.3,04,965 కోట్ల బడ్జెట్‌తో రాష్ట్రంలోని ప్రజానీకాన్ని మరోసారి కాంగ్రెస్ మోసం చేసేందుకు సిద్ధమైంది. బడ్జెట్ క్షుణ్ణంగా పరిశీలిస్తే పరోక్షంగా కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకొనేందుకు ఉన్నంది. రైతు సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్లో రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ, రైతుభరోసా చేయకుండా కోతలు పెట్టేందుకు అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా నిర్మాణం రంగంపై బడ్జెట్ ప్రణాళిక కనవబడడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం సంపదను సృష్టించే విధంగా గత బడ్జెట్లను ప్రవేశపెడితే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సంపదను కార్యకర్తలకు పంచిపెట్టే విధంగా బడ్జెట్ రూపొందించినట్లు ఉంది. కొల్లాపూర్ ప్రాంతంలోని మినీలిఫ్ట్లతోపాటు సాగునీటి రంగానికి, కొల్లాపూర్ ప్రాంతంలో రాష్ట్ర సాంకేతిక విద్యాసంస్థలకు నిధులు కేటాయించలేదు.
– హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొల్లాపూర్
మహాలక్ష్మి పథకం ఏదీ?
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2500 ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో ఈ పథకం ప్రవేశపెడతారని నిధులు కేటాయిస్తారని అనుకున్నాం. కానీ రూపాయి కూడా ఇవ్వలేదు. మహిళలకు ఒక బస్సు మాత్రమే ఇచ్చి మిగతా పథకాలాన్ని అటకెక్కించారు. ఈ జిల్లాకు చెందిన సీఎం ఉన్నాడని మురిసిన మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. గ్యాస్ సిలిండర్ పథకం కొంతమందికే వస్తుంది.. 200 యూనిట్ల గృహజ్యోతి పథకం కూడా కొంతమందికి ఇస్తున్నారు. మహిళలకు మాత్రం మళ్లీ మొండిచేయి చూపించారు.
– లక్ష్మమ్మ, ఏనుగొండ మహబూబ్‌నగర్ జిల్లా
నిరాశపరిచిన బడ్జెట్
అస్లెంబ్లీలో బుధవారం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ తీవ్ర నిరాశ ను మిగిల్చింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా మహిళల కు ప్రతినెలా రూ.2500 ఇస్తా మన్న హామీ ఊసేలేదు. ప్రభు త్వం నిర్మించి ఇస్తామన్న 4లక్షల50వేల ఇండ్లకు రూ.8వేల కోట్లు ఏమాత్రం సరిపోవు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 22వేల కోట్లు కేటాయిస్తేనే సరిపోతుంది. ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వ వా టాగా పదిశాతం నిధులు కేటాయించాలి, కాని నయా పైసా కేటాయించలేదు
– గోపాల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, నారాయణపేట
అన్నివర్గాలను నిరాశ పెట్టిన బడ్జెట్
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అన్నివర్గాలను నివాశ పరిచింది. ఆరు గ్యారెంటీల అమలుకు సరిపడా నిధుల కేటాయించలేదు. పాలమూరులో జరిగిన రైతు సదస్సులో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పి ఏం కేటాయించలేదు. ఇప్పటికైనా జూట మాటలు ఆడకుండా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.
– గవినోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, సామాజిక కార్యకర్త, దామరగిద్ద,నారాయణపేట జిల్లా