హన్వాడ, మే 2 : సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలతో రైతులు నిండా మునిగారని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం హన్వాడ మండల కేంద్రంలోని రైతు సేవాసహకార సంఘం ఆవరణలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ను వేగవంతం చేస్తే రైతులు నష్టపోయేవారు కాదన్నారు.
సర్కారు నిర్లక్ష్యం కారణంగా కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, కొనుగోలు చేసి లారీలకు ఎత్తని ధాన్యం సైతం తడిసి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై కాంగ్రెస్ సర్కారు కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నదని, రైతులను గోసపెడితే అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. గన్నీ బ్యాగులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో సర్కారు ఉండడం సిగ్గుచేటని, రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే కళ్లకు కనబడడం లేదా అంటూ మండిపడ్డారు. బోనస్ ఇస్తామని బోగస్ చేశారని ఆరోపించారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40వేలు అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేదంటే వారిపక్షాన ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తి చేశామని, మిగిలిన 10శాతం పూర్తి చేసేందుకు కాంగ్రెస్ సర్కారు ముందుకు రాకపోవడం సిగ్గుచేటన్నారు.
కేసీఆర్ సర్కారు కాల్వలకు టెండర్లు పిలిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా గన్నీబ్యాగులిచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ వెంకటయ్య, నాయకులు నరేందర్, లక్ష్మయ్య, శ్రీనివాసులు, అనంతరెడ్డి, మాధవులు తదితరులు పాల్గొన్నారు.