మహబూబ్‌నగర్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈయాల యూరియా కోసం రాష్ట్రం అల్లాడుతున్నదని, యూరియా ఫ్రీగా సప్లయి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఎరువుల కోసం క్యూలో నిల్చున్న రైతుల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రైతు పండించకపోతే తిండి లేక సస్తారు జనం.. ఈ మాత్రం మంత్రులకు సోయి లేదా? అంటూ నిలదీశారు. ఇంత పెద్ద దేశంలో సగం జనాభాకు తెలంగాణ నుంచే వరి పండించి ఇస్తుండ్రు.. 23వ స్థానం నుంచి దేశంలో నెంబర్‌వన్ స్థానానికి కేసీఆర్ తె చ్చిండు.. నీళ్లు ఇచ్చిండు.. కరెంటు ఇచ్చిండు.. పిండి సంచులు ఇచ్చిండు.. రైతు వేదికలు కట్టించిండు.. వడ్లు కొన్నాడు.. భయంకరమైన కరోనాలో కూడా.. వడ్లు కొనుక్కొని బ్యాంక్ అకౌంట్లో పైసలు వేసిండు..
పిండి సంచుల గురించి ఎప్పుడూ ఆలోచించలే మన రైతులు అని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఉండే.. ఇయాల ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మళ్లా పునరావృతమైందన్నారు. ఉన్నమాట అంటే ఉలిక్కి పడతారు.. ఊళ్లల్లో తిరగండి.. యూరియా కొరత ఉందో లేదో తెలుస్తది.. ఒక మంత్రి బాధ్యత లేకుండా మాట్లాడుతాడు.. ఇదేనా రైతులపై మీకున్న చిత్తశుద్ధి అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లు రాజకీయం చేయడానికి పంపిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నారు.. రాష్ట్రంలో సరిపడా యూరియా ఎందుకు సరఫరా చేయడం లేదని నిలదీశారు.
యూరియా కోసం రాత్రికి ఇక్కడే పడుకొని ఒక రైతుకు ఫిట్స్ వచ్చింది.. రైతులు చనిపోతే ఎవరు బాధ్యులు అని నిలదీశారు. ఇష్టానుసారంగా నోరు ఉంది కదా అని మాట్లాడితే సరిపోదు.. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఖరాబ్ అయిందట.. అందుకే యూరియా కొరతా వచ్చిందని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు పడుతుం టే.. ఆ ఫ్యాక్టరీ బాగుందా? లేదా? అని పర్యవేక్షించారా ఎవరైనా? అంటూ ప్రశ్నించారు. యూరియా రావడానికే 10 రోజు లు అయితదట.. రైతులపై సర్కారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.
సరైన సీజన్లో యూరియా వేస్తేనే పంటలు పండుతాయి.. నాటు వేయగానే సల్తరు.. అవసరం ఉన్నప్పుడు యూరియా సరఫరా చేయకపోతే జరిగే నష్టానికి ఎవరూ బాధ్యులు అంటూ మంత్రులను ప్రశ్నించారు. అవగాహన లేకుండా ఇష్టానుసారంగా.. బాధ్యత మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక్క ఓటు వేసిన పాపానికి రైతులకు ఇన్ని కష్టాల అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఎన్ని ఎకరాల్లో నాట్లు వేశారు? అనేది వ్యవసాయ శాఖ వద్ద వివరాలు ఉన్నాయి.. దాని ప్రకారం రైతులకు ఎంత యూరియా సప్లయి చేయాలో అంచనా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సకాలంలో యూరియా చల్లకపోతే రైతుల పంట నష్టపోవాల్సి వస్తుందన్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు క్షమాపణ చెప్పి బాధ్యత తీసుకొని యూరియా సరఫరా చేస్తారో లేదో సర్కారు చెప్పాలన్నారు.
ఎరువుల కోసం ఓ రైతు క్యూలో నిలబడి ఫిట్స్ వచ్చి కిందపడ్డాడు.. అతడిని దవాఖానకు తరలించేందుకు అంబులెన్స్‌కు కాల్ చేస్తే అర్ధ గంట తర్వాత వచ్చింది.. కనీసం ప్రభుత్వం అంబులెన్స్‌ల నిర్వహణ కూడా సరిగా చేయడం లేదని విమర్శించారు. గతంలో మేమంతా గిఫ్ట్ ఏ స్మైల్ కింద 8 అంబులెన్సులను ఉచితంగా అందజేస్తే.. దాని మీద ఉన్న మా ఫొటోలు కూడా తొలగించారు… సరే మా ఫొటోలు తీసి మీ ఫొటోలు పెట్టుకున్నారు.. కనీసం నిర్వహణనైనా చేయండి.. అంటూ చురక అంటించారు. మూసాపేట్లో ఓ వ్యక్తి అంబులెన్స్‌లో ఆక్సిజన్ అందక చనిపోయాడని గుర్తు చేశారు. కోస్గిలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది.. ఇదేమి దౌర్భాగ్యం అంటూ నిలదీశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అంబులెన్స్ రాక పేషెంట్ చనిపోయాడని చెబుతున్నారూ..? ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు.
వలసల జిల్లా అయిన పాలమూరులో అష్టకష్టాలు పడి కాపాడుకొని ఈ స్థితికి తీసుకొచ్చామని.. ఉమ్మడి జిల్లాలో 90 శాతం ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి పెడితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 10 శాతం పనులు కూడా పూర్తి చేస్తలేదని విమర్శించారు. దీనికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలి.. ఓటేసిన పాపానికి కష్టాలు అనుభవిస్తున్నారన్నారు. అనంతరం మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని హన్వాడ, మన్యంకొండ గ్రామాల్లో యూరియా కోసం లైన్లో నిలబడిన రైతుల వద్దకు వెళ్లి పలకరించారు. వ్యవసాయ శాఖాధికారులతో మాట్లాడి రైతులందరికీ యూరియా సరఫరా చేయకపోతే ఆందోళన చేస్తామని హె చ్చరించారు. మాజీ మంత్రి వెంట గ్రంథాలయ సంస్థ జిల్లా మా జీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, గణేశ్ పాల్గొన్నారు.