హన్వాడ, నవంబర్ 12 : రైతులు ఆరుగాలం, రాత్రనకా.. పగలనకా.. తేడా లేకుండా కష్టపడి పండించిన పంటను పండించి అమ్మేందుకు తీసుకొస్తే ఎందుకు కొనుగోలు చేయడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం ఆవరణలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు చేయడం లేదని అక్కడి రైతులు శ్రీనివాస్‌గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా సాయాన్ని ఇవ్వకున్నా.. రైతులు అప్పులు తెచ్చి పంటలు సాగు చేశారని తెలిపారు. తీరా పండిన ధాన్యాన్ని విక్రయించేందుకు కేంద్రానికి తీసుకొస్తే కొనకపోవడం సిగ్గుచేటన్నారు.
కేంద్రాలను ప్రారంభించి వారం రోజులు కావస్తున్నా ఇంకా ఎందుకు కొనుగోళ్లు ప్రారంభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజాను కొంటామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం కొనడంలో ఎందుకు జాప్యం వహిస్తున్నట్లు వివరించాలన్నారు. రెండు పంటలకు రైతుభరోసా ఇవ్వలే.. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలే.. అని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.
వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వకుంటే రైతులతో కలిసి ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు చేశాక వారంలోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు ఎన్ని పెట్టి బెదిరించినా భయపడేది లేదని తేల్చిచెప్పారు. కాగా కేసీఆర్ ప్రభుత్వంలో ఠంఛన్‌గా రైతుబంధు వచ్చేదని, కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయామని.. మళ్లా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని పలువురు రైతులు అన్నారు. శ్రీనన్న వెంట మాజీ ఎంపీపీ బాలరాజు, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మయ్య, మాజీ ఎంపీటీసీ నాగన్న, మాజీ సర్పంచ్ చిన్న చెన్నయ్య, నాయకులు శ్రీనివాసులు, మాధవులుగౌడ్, వెంకటయ్య, చెన్నయ్య పాల్గొన్నారు.
కల్వకుర్తి రూరల్, నవంబర్ 12 : తర్నికల్ గ్రామం లో జాగీర్దారులనుంచి కొనుగోలు చేసిన భూముల ను తిరిగి తమకే ఇప్పించాలని కోరుతూ మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్‌కు తర్నికల్ గ్రామ రైతులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా తాము జాగీర్దారుల నుంచి కొన్న భూములను సాగుచేస్తూ ఉపాధిని పొందుతున్నామని, కొంతమంది భూకబ్జాదారులు ఆ భూములను తమవి అని చెప్పి లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారు లు స్పందించి అక్రమార్కుల చెర నుంచి మేము సాగు చేసుకుంటున్న భూములను ఇప్పించాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో తర్నికల్తోపాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా పాల్గొన్నారు.