దవాఖాన ప్రారంభానికి సిద్ధమైంది. రెండు ఎకరాల స్థలంలో విశాలమైన భవన నిర్మాణం పూర్తి చేసుకున్నది. సకల సౌకర్యాలు.. ఆధునిక హంగులతో నిర్మించారు. ఆరు వెయిటింగ్ హాళ్లు.. ఆపరేషన్ థియేటర్లు.. అత్యవసర చికిత్సలు, పిల్లల విభాగాలు ఏర్పాటు కానున్నాయి. ఆరు నెలల కిందట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయగా.. స్థానిక ఎమ్మెల్యే అబ్రహం పర్యవేక్షణతో పనులు శరవేగంగా పూర్తయ్యాయి. త్వరలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభించేలా సన్నాహాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. దీంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అలంపూర్, సెప్టెంబర్ 25 : ఉమ్మడి రాష్ట్రంలో వైద్యంలో కోసం ఇబ్బంది పడిన అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు త్వరలో ఆధునిక వైద్యం అందుబాటులోకి రానున్నది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ సుమారు రూ.25 కోట్లతో వంద పడకల దవాఖానను ఏర్పాటు చేశారు. సకల సౌకర్యాలు గల దవాఖాన పనులకు ఆరు నెలల కిందట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయగా స్థానిక ఎమ్మె ల్యే అబ్రహం పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. మరో పది రోజుల్లో రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నది.
వైద్యం కోసం అవస్థలు ఉండవు
అలంపూర్ నియోజకవర్గంలో గతంలో ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే సుమారు 70 కి.మీ. దూరం ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్లి చికిత్సలు చేయించుకొనే పరిస్థితి. లేదంటే పక్క రాష్ట్రమైన కర్నూలుకు వెళ్లాల్సిన వచ్చేది. రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు సర్కారు దవాఖానలో ఆరోగ్య సేవల విషయంలో తెలంగాణ ప్రజలు చాలా అవమానాలు, అవస్థలు ఎదుర్కొన్న సందర్భాలు లేకపోలేదు. సరిహద్దు ప్రాంతంలో ఉన్న ప్రజలు అలా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నియోజకవర్గంలోనే వంద పడకల దవాఖాన ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో అవసరమైనన్నీ గదులు ఆరు వెయిటింగ్ హాళ్లు, ఆపరేషన్ థియేటర్లు, అత్యవసర చికిత్స విభాగం, అడ్మిషన్ కోసం వంద పడకలు, చిన్న పిల్లల విభాగం వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నియోజకవర్గ నడిబొడ్డులో..
అలంపూర్ నియోజకవర్గంలో సుమారు ఎనిమిది మండలాలు ఉన్నాయి. అన్ని మండలాల్లోని ఆయా గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్సలు అందించే విధంగా 44వ జాతీయ రహదారి పక్కన అలంపూర్ చౌరస్తాలో రెండు ఎకరాల భూమిలో వ్యవసాయ మార్కెట్ యార్డులో వంద పడకల దవాఖానను నిర్మించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అలంపూర్ మండల ప్రజలు కొంత వ్యతిరేకించినప్పటికీ ప్రస్తుతం అందరూ సంతోషంగానే ఉన్నారు.
మెరుగైన వైద్యం అందనున్నది
ప్రభుత్వం అలంపూర్ చౌరస్తాలో వంద పడకల దవాఖాన నిర్మించడం అభినందనీయం. ఈ దవాఖానతో మారు మూల ప్రాంతాల ప్రజలకు మె రుగైన వైద్యం అందనున్నది. గతంలో ఏ ప్రమాదం జరిగినా, ఏదైనా రోగం వచ్చినా వైద్య సేవల నిమిత్తం కర్నూ ల్, మహబూబ్‌నగర్ లాంటి ప్రాంతాలకు పోయే పరిస్థితి ఉం డేది.ఇకపై వైద్య సేవల కోసం పొరుగు రాష్ర్టాల దవాఖానలపై ఆ ధారపడాల్సిన అవసరం లేదు. మన దగ్గరే కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతాయి. మధు, న్యాయవాది, బొంకూరు.
సీఎం కేసీఆర్ హామీ నెరవేర్చారు
అలంపూర్‌లో వంద పడకల దవాఖాన అనేది ప్రజల చిరకాల వాంచ. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తరచూ వంద పడకల దవాఖాన మంజూరు చేయించాను. ఆరోగ్య సమస్యలపై నియోజకవర్గ ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చే యించాం. త్వరలో మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించిన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం.
-డాక్టర్ అబ్రహం, ఎమ్మెల్యే అలంపూర్