Kollapur | కొల్లాపూర్ రూరల్ : రాజకీయ కక్ష సాధింపు చర్యలతో ఆస్తులను కూలగొట్టేందుకు వస్తే వచ్చిన వారిపై పెట్రోల్ పోసి తాము కూడా పోసుకుని నిప్పంటించుకుంటామని బాధితులు హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో సొంత పొలంలో ఇండ్ల నిర్మాణం చేసుకొని జీవన ఉపాధి పొందుతున్న బీఆర్ఎస్ నాయకులు సందు ఆంజనేయులు, బిజెపి నాయకులు సందు రమేశ్‌ల ఇండ్లను కూలగొట్టేందుకు శనివారం ప్రభుత్వ అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలియడంతో కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు 200 మంది దాకా పెట్రోల్ డబ్బాలను పెట్టుకొని తమ ఇండ్ల ముందు కూర్చున్నారు.
గత ఎన్నికలలో అధికార పార్టీకి పనిచేయలేదని కక్షతో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తమ ఇండ్లపైకి బుల్డోజర్లను పంపించారని వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమను జైలుకు పంపించిన సంతోషిస్తాం కానీ తమ కుటుంబానికి జీవనాధారమైన ఆస్తులపై దాడులు చేస్తే ఎలా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు ఏళ్లేని సుధాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలపడంతోపాటు ఇండ్ల పైకి బుల్డోజర్లను తీసుకొని వస్తే తీవ్ర పరిమాణాలు ఉంటాయని వారు హెచ్చరించారు.