కల్వకుర్తి, మే 30 : దేవుడు కనికరించినా..పూజారి కనికరించలేదనే నానుడి మక్క రైతులకు అతికినట్లు సరిపోతుంది. మక్క రైతులను దేవుడు కనికరించడంతో విపరీతమైన దిగుబడి వచ్చింది. చేసిన అప్పులు తీరిపోతా యి.. నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చనే ఆనందం కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షించడంలో ఆవిరైపోయింది. రోజుల తరబడి నిరీక్షించలేక, అకాల వర్షాల నుంచి మ క్కలను కాపాడుకోలేక రైతులు సతమతమవుతున్నారు.
మద్దుతు ధర దేవుడెరుగు..ఇలా నిరీక్షిస్తూ ఉంటే అసలుకే నిండా మునుగుతామని భావించిన రైతులు బహిరంగ మార్కెట్లో వ్యాపారులకు ఏదో ఒక ధరకు విక్రయిస్తున్నారు. పంట దిగుబడి అధికంగా వచ్చినా కొనుగోలు చేసే వారు లేక నిండా మునిగామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మాత్రం దాదాపు 80శాతం మ క్క ధాన్యం కొనుగోలు చేశామని ప్రకటన లు ఇస్తున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరో విధంగా ఉంది.
కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో కల్వకుర్తి, ఉర్కొండ రెం డు మండలాలు ఉన్నారు. ఈ రెండు మండలాల్లో 22వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగుచేశారు. అధికారుల అంచనా ప్రకారం 6.60 లక్షల కింటాళ్ల మక్క దిగుబడి వస్తుంది. మార్క్‌ఫెడ్ మక్కల కొనుగోలును కల్వకుర్తి పీఏసీసీఎస్కు అప్పగించింది. కల్వకుర్తి పీఏసీసీఎస్ ఇప్పటి వరకు 3.64 లక్షల బస్తాలు కొనుగోలు చేసింది.
6.60 లక్షల క్వింటాళ్లు అంటే.. 13.20 లక్షల బస్తాల మక్క దిగుబడికి కొనుగోలు చేసింది కేవలం 3.64 లక్షల బ్యాగులు మాత్రమే. దాదాపు 9.56 లక్షల సంచుల మక్క రైతుల వద్దనే ఉండాలి. ఎంఎస్పీ రూ.2400, బహిరంగ మార్కెట్లో 1600 మక్క ధాన్యాన్ని ప్రభుత్వం క్వింటాకు రూ.2400(ఎంఎస్పీకి) కొనుగోలు చేస్తుంది. కాకపోతే కొనుగోళ్లకు రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంటి పిల్లలను కాపాడినట్లు ధాన్యాన్ని కాపాడాల్సి ఉంటుంది. ధాన్యం తడిస్తే ఫంగస్ వచ్చి పనికిరాకుండా పోతుంది. కొనుగోళ్లలో రోజుల తరబడి నిరీక్షించలేని రైతులు..ఎదురుచూస్తు కూర్చుంటే అసలుకే మోసం వచ్చి నిండా మునిగిపోతామని భావించి బహిరంగ మార్కెట్లో రూ.1600 నుంచి రూ.1700లకు విక్రయించారు.
మక్కల కొనుగోలును మార్క్‌ఫెడ్ కల్వకుర్తి పీఏసీసీఎస్కు అప్పగించింది. కొనుగోలు కేంద్రం తెరిచినప్పటి నుంచి బాలారిష్టాలే.. గన్నీ బ్యాగుల కోసం, ఆల్‌లైన్ వద్ద రేయింబవళ్లు ఎదురుచూపులు, గోదాం వద్ద నిరీక్షణ, రోజులు తరబడి ధాన్యాన్ని కాపాడుకోలేని రైతులు బహిరంగ మార్కెట్లో మక్క ధాన్యాన్ని విక్రయించారు. క్వింటాకు రూ.800 నష్టానికి అమ్ముకున్నారు. కల్వకుర్తిలో మార్కఫెడ్ కేవలం 1.82 లక్షల కింటాళ్ల మక్క ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే.. రైతులు మాత్రం 4.68లక్షల కింటాళ్ల మక్కలను బహిరంగ మార్కెట్లో నష్టానికి అమ్ముకున్నారు. ఇప్పుడు మాత్రం రైతులు మక్కధాన్యాన్ని విక్రయించేందుకు ఎవరూ రావడం లేదని పీఏసీసీఎస్ సీఈవో వెంకట్‌రెడ్డి చెప్పారు.