వనపర్తి, జూన్ 28(నమస్తే తెలంగాణ) : జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని, గేట్ల రోప్‌లు తెగడం అత్యంత సాధారణమని మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హడావుడిగా జూరాల ప్రాజెక్టుకు ఎందుకు వచ్చినట్లని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎలాగో వచ్చిన మంత్రి కనీసం స్పిల్‌వే, క్రస్ట్ గేట్లు, తెగిన ఐరన్ రోప్‌లు కూడా పరిశీలించకుండా పర్యటించడం అత్యంత బాధాకరమని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం చేపట్టిన జూరాల సందర్శనపై నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కేవలం మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారన్నారు.
ప్రాజెక్టుల మెయింటెన్స్ లోపాలపై అధికారులతో అంతా బాగుందనిపిస్తూ, కాంగ్రెస్ నాయకులు, మంత్రులు తోచింది మాట్లాడుతున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ధ్వంసమైన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ దేశంలోనే తెలంగాణను నెంబర్‌వన్ రాష్ట్రంగా నెలబెట్టారన్నారు. కేవలం ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో మళ్లీ సాగునీటి రంగాన్ని, వ్యవసాయాన్ని సమూలంగా నాశనం పట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కుట్రలకు ప్రజలు ఖచ్చితమైన సమాధానం చెబుతారని, అందుకు కోసమే ఎదురు చూస్తున్నారన్నారు.