వనపర్తి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : ఒక్కసారి అవకాశం ఇవ్వండని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఓట్లేసిన ప్రజలను వంచించి పాలన కొనసాగిస్తున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం పట్టణంలోని 1,2,9,13,14, 27,28,29 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కాగితాల శారద, ఉందేకోటి శివ, పీ రాజు, పవిత్ర, బీ అనిత, ఏ శ్రీలత, మాధవి, భారతిని గెలిపించాలని పట్టణంలోని పలు చౌరస్తాల్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్స్‌లో ప్రజలను కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని, కాంగ్రెస్ చూపించిన పథకాలకు ఆశపడి మోసపోయామని ప్రజలు తెలుసుకున్నారని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రంలో వందేళ్ల వరకు తాగునీటి ఇబ్బందులు రాకుండా మిషన్ భగీరథ ఏర్పాటు చేశారని, అలాగే విద్యుత్ సరఫరాలోనూ ఎనలేని మార్పులు తెచ్చి నిరంతరాయంగా కరెంట్ ఉండేలా చేశారన్నారు. రెండేళ్లుగా మళ్లీ కరెంట్ కష్టాలు మొదలయ్యాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. పదేండ్లు పక్కాగా పాలన సాగిన రాష్ట్రం లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని నడిపించడంలో రేవంత్ విఫలమయ్యాడన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్లీ ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్‌ను ఓటర్లు నిలదీయాలని, కొత్త జిల్లాను ఏర్పాటు చేసుకుని సౌలభ్యంగా ప్రజలు సేవలు పొందుతున్న వనపర్తి జిల్లాను తొలగిస్తానని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారన్నారు.
వనపర్తి చిన్నప్పుడు తాను చదుకున్న ప్రాంతమని చెబుతున్న రేవంత్ ఏ ఒక్క పని కూడా ప్రత్యేకంగా అందించింది ఏముందని ప్రశ్నించారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కాంగ్రెస్ నిలిచిందని, అలాంటి నాయకులకు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధ్ది చెప్పాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు 42శాతం వేతనాలు పెంచి వారి ప్రతిష్ట పెంచారని, లక్షా 63 వేల ఉద్యోగాలు ఇచ్చి కేసీఆర్ ఆదుకున్నాడని గుర్తు చేశారు. కేసీఆర్ సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే కారు గుర్తుకు ఓటేయాలని నిరంజన్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు బీ లక్ష్మయ్య, రమేశ్‌గౌడ్, అశోక్, వేణుగోపాల్, గులాం ఖాదర్, నీలస్వామి, ప్రేమ్‌కుమార్, జమీల్, హుస్సేన్, రాము, నాగ మ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి టౌన్, ఫిబ్రవరి 6 : గత బీఆర్ఎస్ పాలనలో ముస్లిం సోదరుల జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆర్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అక్షా, ఈద్గా, మదీనా మసీదులలో ముస్లింలను మాజీ మంత్రి కలుసుకొని మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ముస్లింల సంక్షేమం పరుగులు పెట్టిందని, షాదీఖానాలు, మైనార్టీ గురుకులాలు, విద్యార్థులకు విద్యా భరోసా, షాదీ ముబారక్, రంజాన్‌తోఫా, బక్రీద్ ఇనాం వంటి వినూత్న పథకాలు అందించారని గుర్తు చేశారు. అదేవిధంగా మైనార్టీలకు ప్రత్యేక డబుల్ బెడ్రూం ఇండ్లు, రాజకీయ రిజర్వేషన్లు కల్పించి వారి అభివృద్ధికి కృషి చేశామన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. వనపర్తి నియోజవకర్గంతోపాటు వనపర్తి పట్టణాన్ని బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ సహకారంతో ఎంతో అభివృద్ధి చేశామని అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మాజీ మంత్రివెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు వాకిటి శ్రీధర్, పలుస రమేశ్‌గౌడ్, నందిమల్ల అశోక్, వేణు, గోపాల్, ప్రేమ్‌కుమార్, ఆరీఫ్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, ఆవుల రమేశ్, నాగన్నయాదవ్, మెకానిక్ శ్రీను, జహంగీర్, శ్రీకర్‌గౌడ్, పోతులపల్లి రాజు, జోహెబ్హుస్సేన్, ఎరువ అరుణ, రహీం, ముస్లిం మత పెద్తలు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.