కొత్తకోట, జూన్ 3 : ఉద్యమ స్ఫూర్తితో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని మాజీ హోం మంత్రి మహమూద్‌అలీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలకు నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చి మోసపోయారని, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బుధవారం కొత్తకోటలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన డిజిటల్ సభ్యత్వ నమోదుతోపాటు సర్ కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితోపాటు మాజీ ఉపముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు రక్షణ కవచం వీఆర్ఎస్ పార్టీ అని, రేపటి భవిష్యత్‌కు సభ్యత్వ నమోదుతో నాణ్యమైన సభ్యులను, కార్యకర్తలను తయారు చేయాలని కోరారు. భారత దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ 2022లో కేసీఆర్ నాయకత్వంలో 63లక్షల సభ్యత్వం కల్గి రికార్డు సాధించిందని అదే స్ఫూర్తితో సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల సభ్యత్వ నమోదు కన్వీనర్ మెట్టు శ్రీనివాస్, దేవరకద్ర నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి పల్లె రవి మాట్లాడుతూ ఈనెల 25 నుంచి జూలై 24 వరకు ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ఎస్ఐఆర్ కార్యక్రమంపై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి మన క్యాడర్ ఓట్లు తొలగిపోకుండా, దొంగ ఓట్లు నమోదు కాకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. జూలై 31న ఓటరు లిస్టు ఎలక్షన్ కమిషన్ విడుదల చేస్తుందని, ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు ఓటు రాకపోతే ఫిర్యాదు చేసుకొనే అవకాశం ఎన్నికల కమిషన్ ఇస్తుందని చెప్పారు. అక్టోబర్ 1న ఫైనల్ లిస్టు ప్రకటిస్తుందని అంతవరకు ఓట్లు తొలగిపోకుండా బీఆర్ఎస్ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే అటు రేవంత్‌రెడ్డినైనా, ఇటు పవన్‌కల్యాణ్ నైనా వదిలి పెట్టమని నాలుక కోస్తామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో ఎవరు పోటీ చేసినా ఆహ్వానిస్తామని, చంద్రబాబు వచ్చిన అభ్యంతరం లేదని తెలంగాణపై గీత దాటి మాట్లాడితే తెలంగాణ ప్రజలు క్షమించరని తమ తడాఖా చూపిస్తారన్నారు. పవన్ కళ్యాణ్ 2023లో తెలంగాణలో పోటీ చేసి అభాసుపాలయ్యాడరని గుర్తు చేశారు. రేవంత్ సర్కారులో ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యదాస్ తెలంగాణ ప్రభుత్వ సలహాదారునిగా, సాగునీటి రంగానికి సలహాదారునిగా ఉండడం వలన తెలంగాణ నయవంచనకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ హయాంలో 90 టీఎంసీలతో పూర్తి అయితే కేంద్రం పాలమూరు-రంగారెడ్డిపై కేంద్రం నీటి కేటాయింపుపై డీపీఆర్ ఇవ్వకుండా ఫైలు వాపస్ పంపితే 45 టీఎంసీలకు కుదించి పంపించారని ఆగ్ర హం వ్యక్తం చేశారు.
తెలంగాణ వా దం జాతీయవాదమని, తెలాంగా ణ వాదాన్ని ఎవరైనా ప్రాంతీయవాదం మంటే నాలుక కోస్తామని.. చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. స్వాతంత్య్రం కంటే ముందు తెలంగాణ స్వాతంత్య్ర రాజ్యమని, ఢిల్లీలో ఆనాడు హైదరాబాద్ హౌస్ ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణకు మొదటి ద్రోహి రేవంత్‌రెడ్డి అని, పవన్‌కల్యాణ్ తెలంగాణపై కించపరిచి మాట్లాడితే స్పం దించలేదని, మంత్రి పొన్నం ప్రభాకర్‌లా మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించేదని, తెలంగాణను ఎవరైనా కించపరిచి మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్‌రెడ్డి స్పందించాల్సి ఉండేదని నిరంజన్‌రెడ్డి సూచించారు. అనంతరం మాజీ ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పదేండ్ల కేసీఆర్ పాలన దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిందని గుర్తు చేశా రు. తెలంగాణలో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, రైతుబంధు, 24 గంటల విద్యుత్ వంటి పథకాలు దేశానికే ఆదర్శం గా నిలిచాయని వివరించారు.
గత ఎన్నికలలో 1.8శాతంతో ప్రభుత్వాన్ని కోల్పొయామని, దేవరకద్రలో 0.6శాతం ఓట్లతో ఓడిపాయామని చెప్పారు. తప్పులను సరిచేసుకొని సభ్యత్వ నమోదును ఉద్యమం లా చేపట్టిన దేవరకద్రలో మరోసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేద్దామని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్లు పొగాకు సుఖేశిని విశ్వేశ్వర్, బస్వరాజు, మాజీ ఎంపీపీ గుంత మౌనికామల్లేశ్, మాజి సీడీసీ చైర్మన్ బీసం చెన్నకేశవరెడ్డి, సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీలు రాజశేఖర్‌రెడ్డి, పొగాకు విశ్వేశ్వర్, గొల కృష్ణయ్య, ఇంద్రయ్యసాగర్, పొన్నకల్ సర్పంచ్ మహమూద్, మున్సిపల్ కౌన్సిలర్లు అయ్యన్న, ఎరుకలి తిరుపతయ్య, మంజుల రామకృష్ణ, న్యాయవాది అలీం, అజీం, చాంద్‌పాషా, వహీద్ అలీ, డాక్టర్ సాజిద్, తాహెర్ బాబాతో పాటు వివిధ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.