జనగామ, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : ‘చేపా..చేపా’.. చెరువుకు చేరేదెన్నడు? అని మత్స్య కారులు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపల పంట పండించిన మత్య్స సొసైటీలు ఇప్పుడు పనిలేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. కుల వృత్తులకు జీవం పోయాలనే లక్ష్యంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చెరువులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసేది. ఫలితంగా జనగామ జిల్లాలోని మత్స్య సంఘాల సంపద ఏటా దాదాపు రూ.100 కోట్ల వరకు ఉండేది. వానకాలంలో ఓ మోస్తరు వర్షాలు కురిసి కొన్ని చెరువులు నిండినా.. దేవాదుల ప్రాజెక్టు నీటితో నీటి వనరులన్నీ జలకళ సంతరించుకునేవి. 282 చెరువుల్లో 3.40 కోట్ల చేప సీడ్‌ను ఉచితంగా పోయగానే మే చివరి నాటికి పంట చేతికి వచ్చేది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా చెరువుల్లో చేపల విడుదలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. గత ఏడాది నీటి వన రుల్లో జలకళ ఉన్నా అధికారులు చేప పిల్లల టెండర్లను ఆలస్యం చేయడంతోపాటు పంపిణీ లోపభూయిష్టంగా ఉండడంతో మత్స్యకారుల ఉపాధికి గండిపడింది. ఈ ఏడాది సైతం దేవాదుల నీటి విడుదలలో ప్రభుత్వం జాప్యం చేయడం, ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు, కుంటల్లో ఆశించిన మేరకు నీరు చేరలేదు. ఉన్న కొద్దిపాటు నీటి వనరుల్లో అయినా ఇప్పటికే చేప పిల్లలను విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటికీ ప్రతిపాదనలకే ప్రభుత్వం పరిమితమైంది.
జనగామ జిల్లాలో 15,143 మంది సభ్యులతో 146 మత్స్య పారిశ్రామిక సంఘాలు ఉంటే ప్రత్యేకంగా 3,088 మంది మహిళలతో మత్స్యకార సంఘాలు ఏర్పాటు చేశా రు. 5 చేపల మార్కెట్ సంఘాల్లో 395 మంది ఉండగా వీరందరూ పూర్తిగా చేపల పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలోని 723 చెరువులు, కుంటలు, 9 రిజర్వాయర్లల్లో మీనాల పెంపకం చేపటాల్సి ఉంది. వీటిన్నంటికి 2.73 కోట్ల చేప పిల్లల అవసరం ఉండగా, మత్స్యకారు లకు 2016 నుంచి అప్పటి కేసీఆర్ సర్కారు ఉచితంగా పంపిణీ చేసేది. గతంలో ఆగస్టు మాసం లో చేప పిల్లల పంపిణీ చేపట్టి చెరువులు, కుంటల్లో వదిలేవారు. ప్రక్రియకు మే మాసంలోనే సర్కార్ జిల్లాల వారీగా ప్రతిపాదనలు చేపట్టి కార్యక్రమం రూపొందించేది.
ఆగస్టు గడుస్తున్నా నేటి వరకు సర్కారు ప్రతిపాదనలు పూర్తిస్థాయిలో చేయకపోవడంతో ఈ ఏడాది జిల్లాలో చేప పిల్లల పంపిణీపై సందగ్ధత ఏర్పడింది. అధికారులు ప్రతిపాదనలకే పరిమితం కావడం.. సర్కారు టెండర్లు ఆహ్వానించకపోవడంతో ఈసారి పంపిణీ ఉంటుందో? లేదో తెలియక గ్రామాల్లో మత్స్యకారుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తమకు నాణ్యమైన చేప పిల్లలు అం దించి ప్రభుత్వం వద్ద ఎక్కువ ధర తీసుకొని కాంట్రాక్టర్లు లాభపడేవారని, వారిచ్చిన చేప పిల్లల్లో 25 నుంచి 30 శాతం వరకు ఎదుగుదల లేకపోవడం, మృతి చెందాయని అంటున్నారు. కాంట్రాక్టర్ల బెడద నుంచి తమకు ప్రయోజనం కలిగేలా సంఘాలకు నేరుగా ప్రభుత్వం నగదు అందిస్తే నాణ్యమైన చేపలు ఉత్పత్తి చేయవచ్చని అంటున్నారు. స్థానిక మార్కెట్‌కు అనుగుణంగా అవసర మైన చేప పిల్లల రకాలను పెంచుకునే అవకాశం తమకు ఉండాలని మత్స్యకారులు అభిప్రాయ పడుతున్నారు. ఇదే అంశాన్ని ప్రభుత్వానికి సంఘాల నాయకులు వినతులు సమర్పించినా ఎలాంటి స్పందన లేదని మత్స్యకారుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో నీలి విప్లవం..
తొమ్మిదేండ్ల పాలనలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అమలు కరువునేలపై నీలి విప్లవం తీసుకువచ్చి మత్స్యకారులకు ఉపాధి కల్పించి వారి కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబన కల్పించింది. జిల్లాలోని దేవాదుల రిజర్వాయర్లు, చెరువుల్లో నూరుశాతం సబ్సిడీపై చేప పిల్లలను పోసి మత్స్యకార్మికులకు చేతి నిండా పని కల్పించింది. జిల్లాలోని 775 చెరువుల్లో ప్రతి ఏడాది 2.92 కోట్ల చేప పిల్లలను పోసి అశ్వరావుపల్లి, చీటకోడూరు, మల్లన్న గండి, బొమ్మాకూరు, కన్నెబోయినగూడెం, వెల్దండ, నవాబ్‌పేట, బయ్యన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, రాజవరం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మత్య్సశాఖ గుర్తించిన 678 చెరువుల్లో 2 కోట్ల 43 లక్షల చేప పిల్లలు పంపిణీ జరిగేది. చేప పిల్లల వృద్ధికి వీలుగా ఉండే 5ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిండిన 382 చెరువులు, రిజర్వాయర్లను ఎంపిక చేసి కోటి 62 లక్షల 45వేల వివిధ రకాల సీడ్ వేయడంతో జల పుష్పాలతో నీటి వనరులు మెరిసిపోతుండేవి. చేపల పెంపకం, అమ్మకం వృత్తిపై ఆధారపడిన మత్య్సకార్మికులకు మత్స్య సంపద ద్వారా పెద్దఎత్తున ఆదాయం సమకూరేది. ప్రభుత్వం ఏటా 1.03 కోట్ల విలువైన చేప పిల్లలను పంపిణీ చేస్తే రూ.3.60కోట్ల ఆదాయాన్ని మత్స్యకార్మిక కుటుంబాలు పొందేవి.
నాడు వెలుగులు..నేడు వెలవెల
మత్స్య పరిశ్రమ అభివృద్ధికి బాటలు వేసిన అప్పటి ప్రభుత్వ చర్యలతో ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో నిరాదరణకు గురైన మత్స్యకార్మికుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండాయి. బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో మెదిలిన ఆలోచన మేరకు రూపుదిద్దుకున్న ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంతో వలసబాట పట్టిన మత్స్యకారుల కుటుంబాలు స్వగ్రామాలకు తిరిగివచ్చి కులవృత్తులు కొనసాగిస్తూ తలెత్తుకొని జీవించారు. ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతం నుంచి చేపలను తెచ్చుకొని అమ్ముకునే దుస్థితి నుంచి తెలంగాణ ఏర్పడి తర్వాత మన చెరువులు, మన నీటి వనరుల్లో చేపలు పెంచుతూ ఏటేటా మత్స్యసంపదను వృద్ధి చేసుకునే స్థాయికి ఎదిగింది. మత్స్యకార్మికులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను ప్రతి ఏడాది ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మత్స్యశాఖ ద్వారా పంపిణీ చేసింది.