కల్వకుర్తి, ఆగస్టు 7 : గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీవన చిత్రం మారిపోతోంది. వెట్టి బతుకులయ్యాయని బోధన సిబ్బంది మథన పడుతున్నది. బోధన, బోధనేతర పనులన్ని తమపై రుద్దుతుండటంతో రౌండ్‌ది క్లాక్ డ్యూటీలయ్యాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా గురుకులాల్లోనే మగ్గిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయని వాపోతున్నారు. పడుకున్నా..కలలో కూడా తరగతి గదులు, విద్యార్థులు, వంట గదులే వస్తున్నాయని గుర్తుచేసుకుంటున్నారు. ఈ పనులు సరిపోవన్నట్లు గురుకుల టీచర్లు వాష్‌రూంలు పర్యవేక్షించాలి.. రాత్రి వేళ ప్రతి రెండు గంటలకు విద్యార్థుల డార్మెటరీ గదులను పరిశీలించాలని మైనార్టీ గురుకులాల కార్యదర్శి సర్కూలర్ జారీ చేశారు. సర్కారు వివాదాస్పద నిర్ణయంపై గురుకులాల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు .గురుకుల టీచర్లా…వాచ్‌మెన్‌లా అనే శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన వార్త పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
బోధన, బోధనేతర కృత్యాలు..
బోధన, బోధనేతర కృత్యాలనేవి నాణేనికి రెండు వైపులు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి రెండు కృత్యా లు చాలా అవసరం. ఇందుకనుగుణంగానే విద్యాలయాల్లో నియామకాలు ఉంటాయి. స్కూల్ అడ్మినిస్ట్రేషన్‌లో కరికులం, కో కరికులం అనే అంశాలపై స్పష్టమైన విధానాలు ఉన్నాయి. పాఠశాల సమయం, తరగతుల నిర్వహణ, ఆటలు, పాటలు, వ్యాయామం, భోజనం ఇలా అన్ని రకాలుగా నిర్వహణ ఉంటుంది. వీటన్నింటిలో ఏది సరిగ్గా లేకపోయినా చివరకు విద్యార్థుల అభ్యసన ప్రక్రియకు భంగం వాటిళ్లుతుంది. సరిగ్గా గురుకులాలలో కూడా ఇదే జరుగుతుంది. బోధన, బోధనేతర పనులన్ని బోధన సిబ్బందికి అప్పగించడంతో విద్యార్థుల బోధనాభ్యాసానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఇదే గాకుండా గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తీవ్రస్థాయిలో పని ఒత్తిడికి గురై మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
గురుకులాల్లో రౌండ్ ది క్లాక్ పనులు
నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు విపరీతమైన స్పందన లభించింది. చాలా మంది అధ్యాపకులు నమస్తే తె లంగాణ ప్రతినిధులకు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పారు. తాము ఎదుర్కొంటున్న పనిభారాన్ని, మానసిక ఒత్తిడిని నమస్తే తెలంగాణ దృష్టికి తీసుకొచ్చారు. గురుకులాల నిర్వహణ బాధ్యత అంతా తమపైనే పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ విధులు రౌండ్ ది క్లాక్ అని, గడియారం ముల్లులాగానే 24గంటలు తిరగాల్సిందేనని వాపోయారు. తరగతి గదులలో విద్యాబోధన తామే చూడాలి..విద్యార్థుల డార్మెటరీ, విద్యార్థుల భో జనం, వారికి కాపలా అన్ని మేమే చూడాలి. విపరీతమైన పనిఒత్తిడి ఏర్పడింది. ఉదయం అంతా విద్యాబోధన కార్యక్రమాలు చేపట్టాలి. ప్రతి రోజూ సాయంత్రం ఉపాధ్యాయుల సంఖ్యలో మూడో వంతు టీచర్లు సాయంత్రం డ్యూటీలు చేయాలి. రాత్రి ఒకరు విద్యార్థులకు తోడుగా అక్కడే పడుకోవాలి. ఇవన్ని ప్రతి నిత్యం ఉండే కార్యక్రమాలని, తీరిక లేకపోవడంతో మానసిక భయాందోళనకు గురవుతున్నామని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు.
కలలోనూ తరగతి గదులే గుర్తుకువస్తున్నాయి..
కలలో కూడా తరగతి గదులు, హాస్టల్, విద్యార్థులు గుర్తుకు వస్తున్నారని కల్వకుర్తిలోని ఓ గురుకుల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు వాపోయింది. పని ఒత్తిడి పెరిగిపోయిందని కాస్తంత కనికరం చూపాలని ఏదైన సమావేశంలో తమ శాఖ ఉన్నతాధికారులను పొరపాటున కోరితే తమను టార్గెట్ చేసి వేధిస్తున్నారని, అందుకే ఎంత ఇ బ్బంది గురైనా భరిస్తూ పనిచేస్తున్నామని సదరు ఆధ్యాపకురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు అందరూ బాగానే ఉంటారు.. ఏదైన చిన్న పొరపాటు జరిగితే తమను బాధ్యత చేస్తారని మరో అధ్యాపకురాలు వాపోయారు. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే..ఉద్యోగాన్ని పక్కన బెట్టి నాలుగు బర్రెలను కొనుక్కొని వాటి పాలు అమ్ముకుని బతుకుతే నాలుగు కాలాలు సుఖంగా బతుకవచ్చని చెప్పడం చూస్తుంటే ఉపాధ్యాయురాలి కష్టాలు ఏ విధంగా ఉన్నాయో సులభంగా అర్థమవుతుంది.
ఫుల్ టైం డ్యూటీతో..
గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కుటుంబాల్లో కలహాలు వస్తున్నాయి. కుటుంబానికి టైం కేటాయించక పోవడంతో కుటుంబ సభ్యులు మధ్య దూరం పెరిగిపోయే దయనీయ పరిస్థితులు వచ్చాయి. ఆదే విషయాన్ని మరో ఉపాధ్యాయురాలు వివరించింది. ఉద యం 8 గంటలకు గురుకులానికి వస్తే, సాయంత్రం ఇం టికి వెళ్లే వరకు సాయంత్రం 6గంటలు అవుతుంది. ఇంటికి వెళ్లినా ఏ మాత్రం నిమ్మలం ఉండదు. గురుకులం నుంచి ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. ఏదో సమస్య చెబుతారు. సాయంత్రం డ్యూటీ ఉంటే 7గంటల వరకు తిరిగి గురుకుల పాఠశాలకు వెళ్లాలి, రాత్రి డ్యూటీ ఉంటే అక్కడే విద్యార్థులతో కలిసి ఉదయం వరకు అక్కడే ఉండాలి. ఇదంతా నిత్యకృత్యంగా ఉండటంతో ఏంచేయాల్లో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. ఈ ప్రభావం విద్యార్థుల విద్యాభ్యాసంపై పడుతుందని సదరు అధ్యాపకురాలు చెప్పారు.
కేర్ టేకర్లు నియమించకపోవడం వల్లనే..
గురుకులాల్లో ప్రసుత్తం బోధన సిబ్బందిపైనే పూర్తి భారం పడింది. బోధనేతర సిబ్బందిని, కేర్ టేకర్లను నియమిస్తే చాలా వరకు సమస్య పరిష్కారమవుతుందని అధ్యాపకులు పేర్కొంటున్నారు. బోధన సిబ్బంది విద్యార్థుల అభ్యాసన ప్రక్రియపై మరింత దృష్టి సారిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని వారు చెబుతున్నారు. బోధన సిబ్బంది పనివేళలు పాఠశాలల పనివేళల్లో మాత్రమే ఉండాలని అప్పుడే విద్యార్థుల బోధనాభ్యాస ప్రక్రియ సులువుగా సాగుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. తమకు బాధ్యతలు మాత్రమే ఉన్నాయని ఎలాంటి హక్కులు లేకుండా పనిచేస్తున్నామని వారు వాపోయారు. పనికి తగ్గ వేతనమైనా ఇవ్వాలి.. లేకుంటే వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాలని గురుకుల ఉపాధ్యాయులు ప్రజాపాలన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రజాపాలన ప్రభుత్వం ఉపాధ్యాయులు గౌరవానికి భంగం కలిగించే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని విద్యాభిమానులు డిమాండ్ చేస్తున్నారు.