వపపర్తి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ‘ఎవరి సంతోషం కోసం వనపర్తికి వచ్చి దుర్భాషలాడుతున్నావు.. డూప్లికేట్ కాంగ్రెస్ నాయకుల మాటలకు వంత పాడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు.. రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నా.. అవేవి మీ కళ్లకు కనిపించడం లేదా..? మా నాయకుడు కేసీఆర్ కూతురుగా నిన్ను గౌరవిస్తుంటే దానిని కాపాడుకోవడం లేదు.. నీళ్ల బిరుదును నేను తెచ్చుకున్నది కాదు.. పెట్టుకున్నది అంతకన్నా కాదు.. కేసీఆర్ చొరవతో వన పర్తి నియోజకవర్గంలో లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరు తెచ్చా.. నీవు జైలుకు వెళ్లిన రోజు బాధపడ్డ.. వారినే లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నావు’.. అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వనపర్తి జనంబాటలో చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కవిత చేసిన ఆరోపణలపై సోమవారం సాయంత్రం జిల్లా తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల సంబరాలంటూ ఆర్బాటం చేస్తుందని, వీరి పాలనలో ఇప్పటి వరకు 700మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో కేవలం ఆరు నెలల పనులు, దాదాపు వెయ్యి కోట్లు కేటాయిస్తే.. ఉమ్మడి పాలమూరులో 12లక్షల ఎకరాలకు పైగా సాగునీరందుతుందని, సొంత జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్నా ఉమ్మడి జిల్లాకు ఎలాంటి ప్రాధాన్యతనివ్వడం లేదన్నారు. ఇలాంటి సమస్యలను వదలి.. కేవలం కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు వంతపాడినట్లుగా కవిత ఎవరి సంతోషం కోసం జనంబాట పేరుతో తిరుగుతున్నారని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. కక్ష పూరితంగా కేసులు పెట్టించడం, అక్రమంగా ఆస్తులు సంపాదించడం, భూములు ఆక్రమించారనడం అంటూ చేసిన ఆరోపణలు వాస్తవమైతే రుజువు చేసి శిక్షించవచ్చని, నీవు వంతపాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తు చేశారు.
తన కుటుంబంలోని ముగ్గురు కూతుళ్లు స్థిరపడ్డారని, వారి అలనా.. పాలన చూసుకోవడం తండ్రిగా నా బాధ్యత అన్నారు. నాకు హైదరాబాద్‌లో ఎలాంటి విలాసవంతమైన ఫాం హౌజ్‌లు లేవని, మా అధినేత కేసీఆర్ వ్యవసాయ పొలంలో నివాసం ఉంటే, ఫాం హౌజ్ అంటూ కాంగ్రెస్ చేసిన పాపపు ప్రచారానికి కవిత వంతపాడుతుందన్నారు. కేవలం నా సొంత ఊరిలోని పొలంలో తాను కూడా ఇళ్లును నిర్మించుకుని వ్యవసాయం, పశువులు, గొర్రెలు, పంటలు పండించడం తాను ఇష్టంగా చేస్తుంటే.. ఫాం హౌజ్ అంటూ కవిత మాట్లాడటం విచారకరమన్నారు. నీకు గండిపేటలో ఉన్నట్లు విలాసవంతమైన ఫాం హౌజ్‌లు మాకు లేవని, మా అధినేత కూతురువన్న అభిమానంతో ఉంటే, ఆ గౌరవాన్ని కాపాడుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్లోని జగదీశ్వర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డిలపై ఆరోపణలు చేసుకుంటూ వచ్చిన కవిత ఇప్పుడు తనపైన డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలనే చేయడం హాస్యాస్పదమన్నారు. ఓటమి చెంది ఇంట్లో ఉన్న తుమ్మల నాగేశ్వరావును నాడు ఖమ్మం జిల్లా అభివృద్ధిని ఆకాంక్షించి పిలిచి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి మంత్రిని చేసిన కేసీఆర్‌కు సలహాలిచ్చే స్థాయి నీది కాదన్నారు. వారి జిల్లా రాజకీయ విభేదాలతో దూరమైతే కేసీఆర్ తప్పుచేశారనడానికి నీవెవరంటూ ఆక్షేపించారు. నువ్వు కూడా ఎన్నికల్లో ఓటమి చెందిన సంగతిని మరిచి మా ఓటములపై మాట్లాడుతున్నావని, నీవు చేసిన వ్యవహారానికి మీ నాయకురాలు మందు అమ్మితే తప్పులేదు..
మేం సారా అమ్మితే తప్పుందా అంటూ గిరిజన మహిళలు తమ ప్రచారాల్లో ప్రశ్నించిన ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేశారు. నాటి తెలంగాణ ఉద్యమంలో అనేక అవమానాలు, కేసులు, ఇబ్బందులు, రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డ నాటి కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను కేసీఆర్ సమక్షంలో సమర్థవంతంగా ఎదుర్కొన్న కుట్రల కింద నేడు నీవు చేస్తున్న ఆరోపణలు ఎవరి కోసం చేశావో తెలియని అమాయకులం కాదన్నారు. కవిత తప్పుడు ఆరోపణలు చేసిన వెంటనే ఆ వీడియోలను డూప్లికేట్ కాంగ్రెస్ టీం సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని ప్రజలు గమనించారన్నారు. కేసీఆర్ మానసిక బాధకు కారణంగా నిలిచిన నీవు హద్దులు తెలుసుకోవాలని, అనవసరంగా డొల్లతనంతో అభండాలు వేయడం సరికాదన్నారు.
నీకు అంటిన బురదను అందరికి అంటించాలని ప్రయత్నించడం మానుకోవాలని, తాము నిజంగా తప్పు చేస్తే సవరించుకోవడానికి తమకు ఎలాంటి బేషజాలు లేవన్నారు. డబ్బులు, ఆస్తుల కోసం ఏనాడు పని చేయలేదని, పాలమూరు ప్రజల కన్నీళ్లు, కష్టాలపైనే ఊపిరి ఉన్నంత వరకు పని చేస్తామని నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, లక్ష్మారెడ్డి, కరుణశ్రీ, కర్రెస్వామి, వెంకటేశ్, కృష్ణానాయక్, రమేశ్‌గౌడ్, మాణిక్యం, రఘుపతిరెడ్డి, బాలరాజు, తిరుపతయ్య, మతిన్, అశోక్, రాము, తదితరులు పాల్గొన్నారు.