పెబ్బేరు, డిసెంబర్ 14 : గ్రామాల్లో పారిశుధ్యా న్ని దృష్టిలో పెట్టుకొని నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ఏర్పాటు చేసిన ట్రాక్టర్లకు కనీసం డీజిల్ పోసి నడిపించలేని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన పెబ్బేరు మండలంలోని గుమ్మడం, యా పర్ల, బూడిదపాడు, శాఖాపురం తదితర గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండేళ్లుగా సర్పంచులు లేక గ్రామాలు కూనరిల్లాయని, చెత్త తొలగించేందుకు కనీసం ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేని దుస్థితి నెలకొందని ఆరోపించారు. దొంగ హామీలతో కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ఓట్లడగుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎ క్కడుంది అన్న వాళ్లకు పంచాయతీ ఎన్నికల మొద టి ఫలితాలే నిదర్శనమన్నారు. అధికారంలో ఉండి కల్లబొల్లి కబుర్లు చెప్పినా వారికి ప్రజలే బుద్ధి చెప్పారని, రెండో, మూడో విడుత ఫలితాలు కూడా బీఆర్ఎస్కు అనుకూలంగానే ఉంటాయని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ ప్రజల గుండెల్లో గూడుకట్టుకొని ఉందని, కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పన్నినా బీఆర్ఎస్కు ఏమి కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రజాపాలన అంటూ ప్రజల సొమ్ముతో సీఎం జల్సాలు చేస్తున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ సుపరిపాలనలో గ్రామాల్లో ఎంతో అభివృద్ధి చెందినందునే ఇప్పుడు పల్లె ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కడుతున్నారని నిరంజన్‌రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ మద్దతుతో పోటీలో ఉన్న అభ్యర్థులు నాగేశ్, వెంకటరెడ్డి, రవీందర్, విజయగౌడ్, సుజాత రవిలను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు రాములు, కర్రెస్వామి, వెంకటేశ్, దిలీప్‌రెడ్డి పాల్గొన్నారు.