అయిజ, నవంబర్ 23 : రైతులకు కూలీల కొరత వెంటాడుతున్నది. వానకాలంలో సాగు పంటలు చేతికొచ్చే వేళ కూలీలు సమయానికి పంట కోతలకు లభించికపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ప్రస్తుతం వానలు తగ్గుముఖం పట్టడంతో పత్తి కోతకు రావడంతో కూలీలు అధికంగా అవసరం ఉంటుంది. కూలీలకు డిమాండ్ పెరగడంతో అడిగినంత కూలీలు చెల్లించలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కిలో పత్తి రూ.12 నుంచి రూ. 15 వరకు అడుగుతున్నారు. అయినప్పటికీ కూలీలు దొరకడం లేదు. నిత్యం కూలీలకు కూలీ రూ.400 నుంచి రూ. 600 చెల్లిస్తామని రైతులు చెబుతున్నా అవసరమైన మేరకు కూలీలు లభించకపోవడంతో పంట పొలాల్లోనే పత్తి దర్శనమిస్తోంది.
అకాల వర్షాలు వస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉన్నది. ఇప్పటికే అధిక వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు కొద్దిపాటి పత్తి పంటనైనా కోతకోసి సీసీఐకి విక్రయిద్దామని రైతులు ఆరాటపడుతున్నా, కూలీల కొరతతో అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు వలసలు వెళ్లడంతో మరింత కొరత ఏర్పడి పత్తి పాలాల్లోనే ఉన్నది. అయిజ మండలంలో దాదాపు 29,832 ఎకరాల్లో 13,778 మంది రైతులు పత్తి సాగు చేశారు. కూలీల కొరత కారణంగా 9 వేల ఎకరాల్లోని పత్తి పంట దిగుబడి పొలాల్లోనే ఉంది. వర్షం కురిస్తే నాణ్యత తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది సీసీఐ పెట్టిన నిబంధనలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కిసాన్ కపాస్ యాప్ తెచ్చిన సీసీఐలోనే రైతులు స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎకరాకు పంట దిగుబడులు 15 క్వింటాళ్ల నుంచి 20క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చిన సీసీఐ నిబంధనలతో 7క్వింటాళ్ల వరకే పత్తిని సీసీఐ కొనుగోళ్లు చేస్తుండడంతో మిగిలిన పత్తి ఎక్కడ విక్రయించాలని రైతులు వాపోతున్నారు. దళారీల నుంచి రైతులను రక్షించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ దళారీలకు మేలు చేసేందుకే 7క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ నిబంధనలు సడలించి, పండించిన మొత్తం పత్తిని రైతుల దగ్గర నుంచి సీసీఐ కొనుగోళ్లు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.